ఫాతిమా కాలేజీ పట్ల హైడ్రా మెతక వైఖరి అవలంభిస్తోందా?
వివాదంపై స్పష్టత ఇచ్చిన హైడ్రా;
అక్రమ ఆక్రమణల్ని కూల్చివేస్తూ హంగామా సృష్టించిన హైడ్రా ఎంతో మంది గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఒవైసీ నడుపుతోన్న ఫాతిమా కాలేజీకి కూడా మార్క్ చేసింది కానీ కూల్చివేసే విషయంలో వెనక్కి తగ్గింది. దీంతో హైడ్రాను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు సామాన్యులకు ఓ న్యాయం.. ఒవైసీకి మరో న్యాయమా అంటూ ఫైర్ అవుతున్నారు. ఓ స్టెప్ ముందుకేసి ఎమ్మెల్యే రాజాసింగ్ బిజెపి అధ్యేక్షుడ్ని టార్గెట్ చేస్తూ, ఫాతిమా కాలేజ్‌ని కూల్చేలా చేసి మీరు డమ్మీ కాదని నిరూపించుకోమంటూ వీడియో విడుదల చేశారు.
ఫాతిమా కాలేజీ పాతబస్తీలోని సూరం చెరువు ఎఫ్‌టీఎల్ లో నిర్మించబడింది. అకాడమిక్ సంవత్సరం తరువాత తొలగించే ప్రయత్నం చేస్తాం అని గతంలో చెప్పిన హైడ్రా ఇప్పుడు ఫాతిమా కాలేజీను ఎందుకు కూల్చడం లేదో వివరణ ఇచ్చింది.
* ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజ్ అనేది అక్బరుద్దీన్ ఓవైసీచే పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు నడపబడుతున్న విద్యాసంస్థ.
* ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు తీసుకోవడం లేదు. అవసరమైన చోట్ల చాలా తక్కువ ఫీజులు వసూలు చేస్తారు. ఇది పూర్తిగా స్వచ్ఛంద సంస్థ ద్వారా లాభాపేక్ష లేని పద్ధతిలో నడుస్తుంది.
* ఇక్కడ 10,000 మందికి పైగా పేద ముస్లిం బాలికలు/మహిళలు ప్రతీ సంవత్సరం విద్యనభ్యసిస్తున్నారు.* ఇటువంటి కళాశాలలు సామాజికంగా చాలా ముఖ్యమైన ప్రయోజనాన్ని అందిస్తాయి, ఎందుకంటే అవి పేద ముస్లిం మహిళలను సామాజిక వెనుకబాటుతనం నుండి విముక్తి చేస్తాయి.
* ముఖ్యంగా ముస్లింల వంటి వెనుకబడిన వర్గాల మహిళలకు అందించే ఏ విద్య అయినా ముస్లిం సమాజం అభివృద్ధికి ఖచ్చితంగా దారితీస్తుంది. ఇది వెనుకబడిన ముస్లిం కుటుంబాల అభివృద్ధికి, అంతిమంగా దేశానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.
ముస్లింలు ఎస్టీల కంటే విద్యలో వెనుకబడి వున్నారని, ఇక మహిళల పరిస్థితి దారుణంగా వుందని వివిధ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
నిజంగానే హైడ్రా ఎంఐఎం పట్ల మెతక వైఖరిని అవలంబిస్తోందా?
ఎం.ఐ.ఎం.నాయకులు, ఎమ్మెల్యేలు చేసిన కొన్ని ఆక్రమణ ప్రయత్నాల పట్ల హైడ్రా చాలా కఠినంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. గత సంవత్సరం ఆగస్టు 8న హైడ్రా చేసిన మొదటి కూల్చివేత, నేషనల్ పోలీస్ అకాడమీ, శాస్త్రిపురం, శివరాంపల్లి, హైదరాబాద్ సమీపంలోని బమ్ రుక్న్ ఉద్ దౌలా లేక్ లోని భవనాలు, ఆక్రమణలు. MIM ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు నిర్మించిన భారీ భవనాలు కూల్చివేశారు. ఈ 25 ఎకరాల సరస్సును ప్లాట్లుగా మార్చి, కింగ్స్ గ్రూప్ విక్రయిస్తోంది. ఇక్కడ ఒక్కో ఎకరం ఖరీదు రూ. 40 కోట్లు. కాబట్టి, ఈ సరస్సు ఆస్తి విలువ రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ. హైడ్రా ఇప్పుడు ఈ సరస్సును అభివృద్ధి చేస్తోంది. ఆక్రమణదారులు హైకోర్టు నుండి స్టే ఆర్డర్‌లతో చట్టపరమైన అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించినప్పటికీ, హైడ్రా ఈ సరస్సు అభివృద్ధి పనులను బలవంతంగా కొనసాగిస్తోంది. ఈ 25 ఎకరాల భూమి ఇప్పుడు తవ్వి, 24/7 చెరువు పనులు జరుగుతున్నాయి. HYDRAA అధికారులు హైదరాబాద్ పాతబస్తీలోని సరస్సు అభివృద్ధి పనులను దగ్గరగా వుండి, వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు.
ఇటీవల జరిగిన కూల్చివేతలో, HYDRAA చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూమిలో ఎం.ఐ.ఎం. కార్పొరేటర్లకు చెందిన అనేక వాణిజ్య దుకాణాలను తొలగించి, దాదాపు 3000 చదరపు గజాల రూ. 30 కోట్ల విలువైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది.
హైడ్రా ఎవరి పట్ల మెతక వైఖరిని అవలంబించడం లేదు. సామాజిక కారణాల వల్ల మాత్రమే ఫాతిమా ఉమెన్స్ కాలేజీ కూల్చివేతను నిలిపివేసింది. డబ్బు సంపాదించడానికి, ఫాతిమా కాలేజ్ నడపడం లేదు కాబట్టి వదిలేశామని హైడ్రా అంటోంది.