హైడ్రా ఒకడుగు వెనక్కి... ఓవైసీ, మల్లారెడ్డికి రంగనాథ్ ఫైనల్ వార్నింగ్

అక్రమ కట్టడాలను ఆలస్యం చేయకుండా నేలమట్టం చేస్తోన్న హైడ్రా ఓవైసీ కాలేజ్ విషయంలో ఒకడుగు వెనక్కి వేసినట్టు కనిపిస్తోంది.

Update: 2024-08-27 14:52 GMT

అక్రమ కట్టడాలను ఆలస్యం చేయకుండా నేలమట్టం చేస్తోన్న హైడ్రా ఓవైసీ కాలేజ్ విషయంలో ఒకడుగు వెనక్కి వేసినట్టు కనిపిస్తోంది. హైదరాబాద్ - చాంద్రాయణగుట్ట సలకం చెరువులోని ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. పనిలో పనిగా అక్బరుద్దీన్ ఒవైసీ, మల్లారెడ్డి లకు ఓ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. "అక్రమ కట్టడాలు తొలగించేందుకు సమయం ఇస్తున్నాం. విద్యా సంస్థలు కాబట్టి అకడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నష్టం. విద్యార్థులు రోడ్డున పడకూడదని మాత్రమే ఆలోచిస్తున్నాం. వాళ్లకు వాళ్లుగా తొలగించకపోతే హైడ్రానే చర్యలు తీసుకుంటుంది. ఒవైసీ అయినా, మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రూల్" అంటూ వార్నింగ్ ఇచ్చారు.

కాగా, హైదరాబాద్ పరిధిలో చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీలకి చెందిన కాలేజీలను కూడా హైడ్రా కూల్చివేయనుంది అని వార్తలు వచ్చాయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో ఉన్న వారి కళాశాల బిల్డింగులకి హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నోటీసులపై స్పందించిన ఒవైసీ నన్ను కాల్చండి, కానీ పేద విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తున్న మా ఫాతిమా కాలేజీని మాత్రం కూల్చకండి అంటూ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. 

ఇక మంగళవారం సాయంత్రం హైడ్రా అధికారులు సలకం చెరువును పరిశీలించారు. చంద్రాయణగుట్టలో సలకం చెరువును కబ్జా చేసిఅక్బరుద్దీన్ ఫాతిమా ఓవైసీ ఉమేన్స్ కాలేజీ నిర్మించారని హైడ్రాకు ఫిత్ర్యాదులు అందిన నేపథ్యంలో అధికారులు స్థలాన్ని పరిశీలించారని తెలుస్తోంది. రేపో, మాపో ఓవైసీ కాలేజీ కూల్చివేస్తారంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటిపై స్పందించిన రంగనాథ్... విద్యా సంస్థలు కాబట్టి అకడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నష్టం జరుగుతుందని ఆలోచిస్తున్నాం అంటూనే.. మల్లారెడ్డికి, ఓవైసీకి వార్నింగ్ ఇచ్చేశారు.

Tags:    

Similar News