కొండాపూర్ లో హైడ్రా కూల్చివేతలు
3,600 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
కొండాపూర్ లో ప్రభుత్వ భూమిలో ఉన్న ఆక్రమణలను శనివారం హైడ్రా కూల్చివేసింది. దాదాపు 3, 600 కోట్ల రూపాయల విలువ చేసే 36 ఎకరాల ప్రభుత్వానిదేనని హైకోర్టు తీర్పు నేపథ్యంలో హైడ్రా యుద్ద ప్రాతిపదిన ఆక్రమణలను తొలగించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం సర్వే నెంబర్ 59లో ఉన్న కొండాపూర్ ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించారని ప్రభుత్వం హైకోర్టు నాశ్రయించింది. ఈ భూములను రైతుల పేరిట కొందరు దుర్వినియోగం చేసినట్లు ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ భూములు రైతులవేనని రంగారెడ్డి కోర్టు తీర్పు నిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టు నాశ్రయించింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు నిచ్చింది. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని హైకోర్టు తీర్పు నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. భిక్షపతి నగర్ ప్రభుత్వ భూమిలో ఉన్న ఆక్రమణలు తొలగించే సమయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. తాత్కాలిక షెడ్డును ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్న వారిని హైడ్రా ఖాళీ చేయించింది. 25 ఏళ్లుగా ఈ భూములు వివాదంలో ఉన్నాయి.
శాతంరాయిలో 12 ఎకరాల ప్రభుత్వభూమిని కాపాడింది
హైడ్రా గత నెలలో కబ్జాదారులపై కొరడా ఝుళిపించింది. శంషాబాద్‌లో రూ.500 కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి కాపాడింది. ఆక్రమణలను తొలగించడమే కాదు ‘‘ఇది ప్రభుత్వ భూమి హైడ్రా పరిరక్షించింది’’ అని హైడ్రా అక్కడ బోర్డులను పాతింది.రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శాతంరాయి గ్రామంలోని సర్వే నంబర్ 17లో 12 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైంది. దీనిపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో క్షేత్రస్థాయిలో అధికారులు సమగ్ర సర్వే చేశారు. అది ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకొన్న హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. షెడ్లు, చుట్టూ ఏర్పాటు చేసిన ప్రహరీని తొలగించింది. 12 ఎకరాల్లో ఎకరం మేర నివాసాలు, ఆలయం, మసీదు ఉండగా.. వాటి జోలికి వెళ్లలేదని హైడ్రా స్పష్టం చేసింది. శాతంరాయిలోని 12 ఎకరాల భూమిని 2011లో ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డుకు కేటాయించింది. భూమి తమదని స్థానిక రాజకీయ నేత ఆక్రమించారు. అనీష్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ బోర్డులు అక్కడ వెలిసాయి. ఆ భూమిలో ఆ సంస్థ నిర్మాణాలకు చేపట్టడానికి సిద్దమయ్యారు. షెడ్లు, ప్రహారీ గొడ నిర్మించారు. వీటి ఫొటోలను స్థానికులు హైడ్రాకు పంపించారు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కూడా భూమి కబ్జాపై ఫిర్యాదు చేశారు. స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా బృందం అది ప్రభుత్వ స్థలంగా తేల్చింది. రాళ్లు, రప్పలతో ఉన్న ఈ భూమిని కబ్జాదారులు వ్యవసాయ భూమి అని చెప్పుకున్నారు. భూమిలో వ్యవసాయం చేస్తున్నామని బుకాయించారు. అస్‌ఫజాహీ వారసుల నుంచి కొన్నామని కబ్జాదారులు నకిలీ పత్రాలు సృష్టించారు. శంషాబాద్ పరిధిలో కొన్ని కుటుంబాలకు చెందిన భూములు అసలు లేనే లేవని రెవెన్యూ అధికారులు తేల్చారు. కబ్జాదారుల వాదనలో వాస్తవం లేదనే నిర్ణయానికి హైడ్రా వచ్చేసింది. మరో ప్రాంతంలో ఉన్న భూములను కబ్జాదారులు శాతంరాయిలో చూపే ప్రయత్నం చేసినట్టు హైడ్రా పేర్కొంది. అనీష్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు చెందిన శ్రీపాద దేశ్ పాండే భూములు వివాదాల్లో ఉన్నట్టు హైడ్రాకు అనేక ఫిర్యాదులు అందాయి.
గాజుల రామారంలో 100 ఎకరాల ప్రభుత్వభూమి
గత నెలలో గాజుల రామారంలో 4, 500 కోట్ల రూపాయల విలువ చేసే 100 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా పరిరక్షించింది. సర్వే నెంబర్ 397లో ఉన్న ఈ భూములను కొందరు ఆక్రమించి 60 లేదా 70 గజాల ప్లాట్లు గా చేసి విక్రయిస్తున్నారు. ఒక్కో ప్లాటు పది లక్షల రూపాయలవరకు ఉంటుందని అధికారులు గుర్తించారు. మార్కెట్ ప్రకారం 1500 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.