వర్షాల వేళ నాలాల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదుల వెల్లువ
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీవర్షాలతో వరద ముంపు సమస్య తలెత్తడంతో హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.;
By : Saleem Shaik
Update: 2025-08-12 07:49 GMT
హైదరాబాద్ నగరంలో వర్షాల వేళ నాలాల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వరద నీరు ముంచెత్తే రహదారులు, కాలనీల చిత్రాలతో పాటు నాలాల ఆక్రమణలను ఫిర్యాదుదారులు కళ్లకు కట్టినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఆక్రమణలు చిన్నవైనా వరదకు ఆటంకం కలిగినప్పుడు సమస్య తీవ్రంగా పరిగణిస్తోందని పలువురు నగరవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. కుండపోతగా వర్షం పడుతున్నప్పుడు వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది. ఈ సమయంలో వరదను చూసి నాలా ఆక్రమణలను తొలగించాలని పలువురు నగరవాసులు ఫిర్యాదులో పేర్కొంటున్నారు.
హైడ్రా ప్రజావాణికి 51 ఫిర్యాదులు
సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 51 ఫిర్యాదులు వస్తే అందులో 70 శాతం వరకూ నాలా ఆక్రమణలపైనే ఉన్నాయి. వరద కాలువలెక్కడా వాస్తవంగా ఉండాల్సిన వెడల్పు లేవని, కొన్ని చోట్ల నాలుగు వంతుల్లో 3 వంతుల వరకూ కబ్జాలకు గురయ్యాయని ప్రజలు పేర్కొన్నారు. హైడ్రా అదనపు కమిషనర్ ఎన్.అశోక్ కుమార్ ఫిర్యాదులను పరిశీలించి, గూగుల్ మ్యాప్స్ ద్వారా వాస్తవ పరిస్థితిని తెలుసుకుని సంబంధిత అధికారులకు వాటి పరిష్కార బాధ్యతలను అప్పగించారు.
ఎన్నెన్నో ఫిర్యాదులు...
- పాతబస్తీ చాంద్రాయణగుట్టలోని బార్కాస్ సలాలా ప్రాంతంలోని నాలా మీద ఇల్లు కట్టేశారు. దీంతో ప్రతి ఏటా వరద ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోందని అక్కడి నివాసితులు చిత్రాలతో అక్కడి తీవ్రతను కళ్లకు కట్టారు. ఈ ఆక్రమణలను తొలగిస్తే మూడు బస్తీలకు వరద ముప్పు తప్పుతుందని వారు పేర్కొన్నారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కీసర మండలం నాగారం విలేజ్‌లో పార్కులకు, ప్రజావసరాలకు ఉద్దేశించిన 12000 గజాల స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని, వెంటనే వాటికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కాపాడాలని హెచ్ఎంటీ బేరింగ్స్ నగర్ నివాసితులు కోరారు. ఇందులో రహదారులు, పార్కులున్నాయని వారు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ ఏఆర్‌సీఐ రోడ్డులోని ఆర్ఛిడ్ రెసిడెన్సీ సమీపంలోని పెద్ద చెరువు నాలా కబ్జాలకు గురవ్వడంతో తమ ప్రాంతాలన్నీ నీట మునుగుతున్నాయని అక్కడి ఆర్ఛిడ్ రెసిడెన్షియల్ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
రోడ్డు కబ్జా, పార్కులోకి మురుగునీరు
సంగారెడ్డి జిల్లా అమీన్‌పురా మండలం బీరంగూడలోని వందనపురి కాలనీ ఫేజ్-1లో 20 అడుగుల రహదారిని 10 అడుగుల మేర ఎదురుగా ఉన్న ప్లాట్ యజమానులు కబ్జా చేశారంటూ స్థానికులు పిర్యదు చేశారు. రోడ్డు ఆక్రమణలను తొలగించి లే ఔట్ ప్రకారం రోడ్డు భూమిని పరిరక్షించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఉప్పరపల్లిలోని ఎస్ ఆర్ సదన్ జీకే అవెన్యూ సమీపంలోని పార్కులోకి మురుగు నీరు వచ్చి చేరుతోందని,దీంతో పార్కులోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ నాలా ఆక్రమణలకు గురైందని, దీంతో మురుగునీరు పొంగి పార్కులోకి వస్తోందన్నారు.అమీర్‌పేట, ఎల్లారెడ్డిగూడ అంబేద్కర్ నగర్‌లో నాలాను ఆక్రమించి ఇల్లు నిర్మించేయడం వల్ల వరదనీరు సాఫీగా సాగడంలేదని.. దీంతో వరద తమ ప్రాంతాలను ముంచెత్తుతోందని ఆయా ప్రాంతాల నివాసితులు హైడ్రా ప్రజావాణి ఫిర్యాదులో పేర్కొన్నారు.