సమయం కూడా ఇవ్వకుండానే కూల్చేసిన హైడ్రా

కూల్చివేతలపై తమకు నోటీసులు కూడా ఇవ్వకుండానే బుల్డోజర్లు, పొక్లైనర్లతో వచ్చి కూల్చేస్తున్నారంటు బాధితులు గోలగోల చేస్తున్నారు.

Update: 2024-09-22 07:17 GMT
Kukatpalli Hydra

కూకట్ పల్లిలో ఆదివారం ఉదయం మొదలైన కూల్చివేతల్లో బాధితులు హైడ్రాపై నానా రచ్చ చేస్తున్నారు. కూల్చివేతలపై తమకు నోటీసులు కూడా ఇవ్వకుండానే బుల్డోజర్లు, పొక్లైనర్లతో వచ్చి కూల్చేస్తున్నారంటు బాధితులు గోలగోల చేస్తున్నారు. నల్లచెరువును ఆక్రమించి చేసిన నిర్మాణాలను కూల్చేసే టార్గెట్ తో హైడ్రా ఆదివారం ఉదయమే రంగంలోకి దిగింది. 27 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన నల్లచెరువులో 14 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు హైడ్రా నిర్వహించిన సర్వేలో తేలింది. అన్నీ కోణాల్లో ఆక్రమణలను నిర్ధారించుకున్న హైడ్రా ఆదివారం ఉదయమే కూల్చివేతలు మొదలుపెట్టేసింది.



 నల్లచెరువు పరిధిలోని కూకట్ పల్లిలో నిర్మించిన 18 భవనాలను హైడ్రా కూల్చేసింది. దాంతో అందులో నివాసముంటున్న వాళ్ళంతా హైడ్రాతో పాటు రేవంత్ రెడ్డిని కూడా శాపనార్ధాలు పెడుతున్నారు. రూపాయి రూపాయి కూడబెట్టుకుని, ప్రభుత్వం నుండి అన్నీ అనుమతులు తీసుకుని కట్టుకున్న తమ ఇళ్ళను హైడ్రా ఇపుడు కూల్చేయటం ఏమిటని బాధితులు నిలదీస్తున్నారు. చెరువును ఆక్రమించి ఎవరో లే అవుట్ వేస్తే దానికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవిన్యు అధికారులు ఏమిచేస్తున్నారంటు బాధితులు మండిపోతున్నారు. తప్పుడు లే అవుట్లు వేసినపుడు ప్రభుత్వం ఎలాగ అనుమతిచ్చిందని ప్రశ్నిస్తున్నారు. లే అవుట్లకు అనుమతించి, తాము ఇళ్ళు కట్టుకునేందుకు అనుమతిచ్చినపుడు ఈ ప్రాంతమంతా నల్లచెరువు ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ పరిధిలో ఉందన్న విషయం ప్రభుత్వానికి తెలీదా అంటు గోలగోల చేస్తున్నారు.

హైడ్రా కూల్చేసేముందు తమకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు. అయితే తాము 15 రోజుల ముందే నోటీసులు జారీచేసినట్లు హైడ్రా అధికారులు చెబుతున్నారు. నోటీసులు ఇచ్చుంటే తామే ఇళ్ళను ఖాళీ చేసేవారమని బాధితులు రోడ్డునపడి రోధిస్తున్నారు. విషయం ఏమిటంటే ఉదయమే హైడ్రా కూల్చివేతలకు దిగటంతో చాలామంది యజమానులు, అద్దెకు ఉంటున్నవాళ్ళు ఇంకా నిద్రలో నుండి లేవనుకూడా లేదు. ఆదివారం కావటంతో చాలామంది నిద్రలోనే ఉన్నారు. అలాంటిది తమ ఇళ్ళబయట ఏవో శబ్దాలు రావటంతో ఉలిక్కిపడి లేచి ఇళ్ళలోనుండి బయటకు వచ్చారు. బయటకు వచ్చి చూస్తే ఏముంది కాంపౌడ్ వాళ్ళు కూలిపోతున్నాయి.



 ఏమి జరుగుతోందో అర్ధమవ్వటానికి ఇళ్ళల్లో ఉంటున్న వాళ్ళకి కాసేపు పట్టింది. వెంటనే హైడ్రా తమిళ్ళను కూల్చేస్తోందన్న విషయం అర్ధమై వెంటనే రోడ్లపైకి వచ్చేసి గోల మొదలుపెట్టారు. పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా అన్నీ ఇళ్ళను కూల్చేసింది. బాధితులు ఎవరూ కూల్చివేతలకు అడ్డంపడకుండా హైడ్రా ముందుగానే అన్నీ జాగ్రత్తలు తీసుకుంది. కూల్చివేతలను కాసేపు ఆపితే ఇంట్లోని విలువైన వస్తువులను తెచ్చుకుంటామని బాధితులు ఎంతగా రిక్వెస్టు చేసినా హైడ్రా అధికారులు సమయం ఇవ్వకుండా కూల్చివేతలను పూర్తి చేసారు. కూల్చివేతల మధ్యలోనే కొందరు తమ ఇళ్ళలోని విలువైన వస్తువులను తెచ్చుకోవాల్సొచ్చింది.

Tags:    

Similar News