HYDRAA | ఆలయ భూముల కబ్జాలపై హైడ్రా దృష్టి

‘హైడ్రా’తాజాగా ఆలయ భూముల కబ్జాలపై కూడా దృష్టి సారించింది. జగద్గిరిగుట్టలోని గోవిందరాజుల స్వామి ఆలయ భూముల కబ్జాలపై హైడ్రా యాక్షన్ ప్రారంభించింది.;

Update: 2025-01-18 11:01 GMT
జగత్ గిరిగుట్ట ఆలయ భూముల కబ్జాలను పరిశీలిస్తున్న ఏవీ రంగనాథ్ (ఫొటో హైడ్రా సౌజన్యంతో)

జగద్గిరిగుట్టలోని గోవిందరాజుల స్వామి ఆలయ చెరువు భూములు ఆక్రమణలకు గురయ్యాయని హైడ్రా కమిషనర్ ఏ వీ రంగనాథ్ కు ఆలయ పూజారి నరహరి ఫిర్యాదు చేశారు.

- ఈ ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్, దేవాయదాయ శాఖల అధికారులు,స్థానిక పోలీసులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ఆక్రమణలను పరిశీలించారు.
- హైడ్రా కార్యాలయంలో ప్రతీ సోమవారం జరుగుతున్న ప్రజా ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ స్పందించారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్టపై ఉన్న ఆలయ భూముల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా దీనిపై దృష్టి సారించింది.
- గోవిందరాజుల స్వామి ఆలయం కొలను, గుండం కబ్జా అవుతున్నట్టు పూజారి నరహరి వీడియోను కూడా హైడ్రా అధికారులకు చూపించారు. పర్కి చెరువు కబ్జాలను కూడా స్థానికులు కమిషనర్ కు చూపించారు.జగద్గిరి గుట్ట ఆలయసముదాయం,ఆలయ భూములను కమిషనర్ పరిశీలించారు.

జులై తర్వాత నిర్మాణాలపై హైడ్రా చర్యలు
2024 జులై నెలలో హైడ్రా ఏర్పాటు అయిందని అంతకు ముందు నిర్మించిన నివాసాల జోలికి హైడ్రా వెళ్లదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. 2024 జులై తర్వాత జరిగిన కబ్జాలపై మాత్రం చర్యలుంటాయని ఆయన వివరించారు. గూగుల్ మ్యాప్స్ పరిశీలించి 2024 జులై తర్వాత చేసిన చెరువుల కబ్జాలను గుర్తిస్తామని ఆయన పేర్కొన్నారు.శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు ఏవీ రంగనాథ్ అధికారులతో కలిసి ఆలయ భూముల కబ్జాతో పాటు పర్కి చెరువు కబ్జాలకు పరిశీలించారు.

కులసంఘాల పేరిట కబ్జాలు
కొందరు కుల సంఘాల పేరిట ఆలయాల భూముల కబ్జాలు చేసి సొంతానికి వాడుకోవడాన్ని కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా పరిగణించారు. కులసంఘాల పేరిట కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్ముకోవడాన్ని కూడా సీరియస్ గా తీసుకున్నారు.ఆలయ భూముల కబ్జాదారులకు నోటీసులు ఇస్తామని ఆయన తెలిపారు.

15 రోజుల్లో హైడ్రా పోలీసు స్టేషన్
హైడ్రా పోలీసు స్టేషన్ కూడా 15 రోజుల్లో పని ప్రారంభిస్తుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. కబ్జాదారులపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని ఆయన పేర్కొన్నారు.హైడ్రా రాకతో కబ్జాలు ఆగుతున్నాయని త్వరలోనే ఆలయ భూములకు కూడా కబ్జాల నుంచి విముక్తి కలుగుతుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.ఆలయ కబ్జాల నియంత్రణకు హైడ్రా తో కలసి పని చేస్తామని స్థానికులు చెప్పారు.

పర్కి చెరువు కబ్జాలపై సమావేశం
చెరువు, ఆలయ భూములు కబ్జాలు అవుతున్నా పట్టించుకోని స్థానిక అధికారుల నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. వచ్చే బుధవారం జగద్గిరి గుట్ట ఆలయ భూములతో పాటు పర్కి చెరువు కబ్జాలపై స్థానికులతో హైడ్రా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.ప్రజలు అన్ని ఆధారాలతో హైడ్రా కార్యాలయానికి వచ్చి పత్రాలు అందజేయాలని ఆయన సూచించారు.

చెరువు పరిరక్షణకు కమిటీ
కబ్జాల పాలైన పర్కి చెరువును పరిరక్షించేందుకు వీలుగా పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి, చెరువు కబ్జాకాకుండా కాపాడుతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. అధికారులకు సహకరించాలని ఆయన సూచించారు.స్థానికులు ఒక కమిటీగా ఏర్పడి దేవాలయ భూముల పరిరక్షణకు నడుం బిగించాలని కోరారు.ఈ రెండు కమిటీల వాట్సాప్ గ్రూప్ లలో తనను యాడ్ చేసి సమాచారాన్ని షేర్ చేయాలని రంగనాథ్ సూచించారు.


Tags:    

Similar News