తెలంగాణ‌లో హ్యుండయ్ కారు మెగా టెస్ట్ సెంట‌ర్‌

హ్యుండయ్ మోటార్ కంపెనీ తెలంగాణలో కారు మెగా టెస్ట్ సెంటర్‌ను స్థాపించాల‌ని యోచిస్తోంది.

Update: 2024-08-12 13:58 GMT

దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుండయ్ మోటార్ కంపెనీ తెలంగాణలో కారు మెగా టెస్ట్ సెంటర్‌ను స్థాపించాల‌ని యోచిస్తోంది. కంపెనీ భారతీయ విభాగమైన‌ హ్యుండయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (HMIE) ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తోంది. మెగా టెస్ట్ సెంటర్‌లో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌకర్యం (EVలతో సహా) ఉంటుంది. అలాగే హైదరాబాద్‌లో ఉన్న ఇంజినీరింగ్ కేందం పునరుద్ధర‌ణ‌, ఆధునీకర‌ణ, విస్త‌ర‌ణ ద్వారా HMIE భారతదేశం స‌హా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మరింత ఉపాధిని కల్పించ‌నుంది.

తెలంగాణ‌కు పెట్టుబ‌డుల సాధ‌నే ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం ద‌క్షిణ కొరియాలో ప‌ర్య‌టిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు సియోల్‌లో హ్యుండయ్ మోటార్ కంపెనీ అధికారుల‌తో సోమ‌వారం (02-08-2024) స‌మావేశ‌మ‌య్యారు. చ‌ర్చ‌ల‌ అనంత‌రం హెచ్ఎంఐఈ ప్ర‌తినిధులు మాట్లాడుతూ భారతదేశం త‌మ‌కు చాలా ముఖ్యమైన మార్కెట్ అని, భారతీయ వినియోగదారుల కోసం బెంచ్‌మార్క్ సెట్టింగ్ ఉత్పత్తులు, సాంకేతికత అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామ‌ని తెలిపారు. అత్యాధునిక పరీక్షా సౌకర్యాల అభివృద్ధి చేసేందుకు త‌మ‌కు అవ‌కాశం క‌ల్పించిన‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియ‌జేస్తున్న‌ట్లు హెచ్ఎంఐఈ ప్ర‌తినిధులు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్ర‌పంచ దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబ‌డుల‌ను తెలంగాణ‌లో పెట్టించేంద‌కు త‌మ ప్ర‌భుత్వం దృష్టి సారించింద‌న్నారు. హ్యుండయ్ మోటార్ కంపెనీ త‌న అనుబంధ సంస్థ హ్యుండయ్ ద్వారా తెలంగాణలో కార్ టెస్టింగ్ సదుపాయం నెలకొల్పేందుకు పెట్టుబడులు పెట్టాలని ప్ర‌ణాళిక ర‌చిస్తోంద‌న్నారు. రాష్ట్రం అనుస‌రిస్తున్న పారిశ్రామిక స్నేహపూర్వక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఆటంకాలు లేని అనుమతుల వ్యవస్థతో ప్ర‌గ‌తిశీల‌, భ‌విష్య‌త్ ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ‌లో వ్యాపారం చేసేందుకు HMIE వంటి అత్యుత్తమ-తరగతి కంపెనీలు ముందుకు వ‌స్తున్నాయ‌ని తెలిపారు. హెచ్ఎంఐఈ మెగా టెస్ట్ సెంటర్ సమీపంలోని సౌకర్యాలు ఇతర అనుబంధ సంస్థలు, సరఫరాదారులను ఆకర్షించే అవకాశం ఉంది. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగానూ భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుంది.

Tags:    

Similar News