Mallareddy | ‘రాజకీయమే వద్దనుకుంటున్నా’
బీజేపీ, టీడీపీ, బీఆర్ఎస్ అని పక్క చూపులు చూసే ఆసక్తి తనకు లేదన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.;
తన రాజకీయ జీవితంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాలపైనే ఆసక్తి లేదన్నారు. శనివారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణ మారుతున్న నేపథ్యంలో మల్లారెడ్డి వైఖరి ఏంటి అనే చర్చ మొదలైంది. పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని, గువ్వల బాలరాజు తమ పార్టీలోకి రానున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ రామ్‌చందర్ రావు వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో బలం పుంజుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ(TDP) కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే మల్లారెడ్డి పార్టీ మారుతారా? మారరా? అన్న చర్చ తెరపైకి వచ్చింది. ఇదే అంశంపై మల్లారెడ్డి స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్‌లో ఉన్నానని, ఇప్పటికీ బీఆర్ఎస్ నేతనేనని చెప్పారు.
‘‘ప్రతి నేను ఏ పార్టీ వైపు చూసేటట్లు లేను. నాకు 73 ఏళ్లు వచ్చాయి. ఇంకా ఏవైపుకో, ఏ పార్టీలో చేరడానికో చూడాల్సిన అవసరం లేదు. నేను ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయ్యాను. ఇంకా మూడేళ్లు రాజకీయాల్లో ఉంటా. అసలు నాకు రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్నా’’ అని మల్లారెడ్డి స్పష్టం చేశారు. దీంతో అతి త్వరలో బీఆర్ఎస్‌కు మరో భారీ షాక్ తగలడం ఖాయమన్న చర్చ మొదలైంది. రాజకీయాలకు గుడ్ బై చెప్పడానికి మల్లారెడ్డి సిద్ధమవుతున్నారని, రేపోమాపో ఆయన తన రాజీనామా ఇచ్చినా ఆశ్చర్యం అక్కర్లేదని విశ్లేషకులు చెప్తున్నారు. అదే జరిగితే ప్రస్తుత కష్టకాలంలో బీఆర్ఎస్‌కు భారీ ఎదురు దెబ్బే అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.