ఈడీ విచారణలో వెలుగుచూసిన ఐఏఎస్ అమోయ్ కుమార్ అక్రమాలు
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో కలెక్టరుగా పనిచేసిన అమోయ్ కుమార్ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. రెండో రోజు ఈడీ విచారణలో పలు అక్రమాలు బయటపడ్డాయి.
By : The Federal
Update: 2024-10-24 09:01 GMT
తెలంగాణ రాష్ట్రంలో ఐఎఎస్ అధికారి అమోయ్ కుమార్ అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగుచూస్తూనే ఉన్నాయి. రెండు రోజులుగా భూదాన్ భూముల అక్రమాలపై అమోయ్ కుమార్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
- రంగారెడ్డి జిల్లా కలెక్టరుగా పనిచేసినపుడు అమోయ్ కుమార్ మహేశ్వరం మండలంలోని నాగారంలో భూదాన్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.
- గురువారం హైదరాబాద్ నగరంలోని ఈడీ కార్యాలయంలో సీనియర్ ఐఏఎస్ అమోయి కుమార్ ను అధికారులు విచారించారు.ఏడు గంటల పాటు ఇతన్ని విచారించి పలు విషయాలు రాబట్టారు.
- గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమోయ్ కుమార్ పలు అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడైంది. దీంతో బుధవారం నుంచి ఇతన్ని ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
- ప్రస్థుతం తెలంగాణ పశుసంవర్ధక శాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న అమోయ్ కుమార్ ఈడీ విచారణ కోసం బషీర్ బాగ్ కార్యాలయానికి వచ్చారు.
- అమోయ్ కుమార్ కలెక్టర్‌గా శేరిలింగంపల్లి, నానక్‌రాంగూడ భూముల అక్రమాలు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వీటి విషయంలోనూ ఈడీ అధికారులు విచారణలో ప్రశ్నలు అడిగారు. ఈ భూముల బాగోతంలో పలువురు బీఆర్ఎస్ నేతలతో పాటు అప్పటి మంత్రుల హస్తం ఉందని చెబుతున్నారు.
బయటపడిన భూదాన్ భూముల బండారం
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూములైన వందల కోట్ల రూపాయల విలువైన 42 ఎకరాలు అక్రమంగాప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేశారని ఈడీ విచారణలో తేలింది. ఈ భూమికి పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇచ్చారని వెల్లడైంది. హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లాపూర్మెట్ గ్రామం లో సర్వేనెంబర్ 17 లో పూర్వీకుల నుంచి కొంత మంది రైతులకు సంక్రమించిన 26 ఎకరాల సాగుభూములు బలవంతంగా లాక్కున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల ముడుపులను అమాయ్ కుమార్ తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.దీంతో నిజాన్ని నిగ్గు తేల్చేందుకు ఈడీ విచారణ జరుపుతోంది.అమోయ్ కుమార్ స్టేట్మెంట్ ను అధికారులు రికార్డు చేశారు.