రోడ్డుపై వదిలేసిన శిశువును చూసి కలెక్టర్ కన్నీళ్లు...
ఈ అనాథ శిశువు జనగామ తల్లీ పిల్లల ఆరోగ్యకేంద్రం సంరక్షణలోకి తీసుకువచ్చారు.;
By : Saleem Shaik
Update: 2025-07-27 04:02 GMT
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలేషాపూర్ గ్రామం ప్రధాన రహదారి...ఈ రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో కన్న పేగుబంధాన్ని తెంచుకొని అప్పుడే పుట్టిన నవజాత శిశువును వదిలేసి వెళ్లారు...అంతే తల్లిదండ్రులున్నా వారు వదిలివేయడంతో అనాథగా (Abandoned Infant) మారి రోడ్డుపైకి చేరిన ఆ శిశువు కెవ్వుమని రోదిస్తోంది. ఆ శిశువు ఏడుపు విన్న స్థానికులు ఆ పసికందును చేరదీసి, ఆపై పోలీసులు, వైద్యాధికారులకు సమాచారం అందించారు. అలా ఈ అనాథ శిశువు జనగామలోని తల్లీ పిల్లల ఆరోగ్యకేంద్రం సంరక్షణలోకి తీసుకువచ్చారు.
చలించిన కలెక్టర్ దంపతులు
తమ బిడ్డ పట్ల ప్రేమానురాగాలను మర్చిన మాతృమూర్తి అప్పుడే పుట్టిన నవజాత శిశువును రోడ్డుపై వదిలి వెళ్లడాన్ని తెలుసుకున్న జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, ఆయన భార్య డాక్టర్ సయ్యదా అమ్రీన్ చలించి పోయారు. అనాథ శిశువు గురించి తెలుసుకున్న కలెక్టర్ దంపతులు తీవ్ర భావోద్వేగానికి గురై ఆ శిశువును చూసేందుకు జనగామలోని తల్లీ పిల్లల ఆరోగ్యకేంద్రానికి(Mother and Child Health Centre) వచ్చారు. శిశువును చూసిన కలెక్టర్ దంపతులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
శిశువును అక్కున చేర్చుకున్న కలెక్టర్ భార్య
నవజాత శిశువును రోడ్డుపై వదిలి వెళ్లిన ఘటన గురించి భర్త నుంచి తెలుసుకున్న కలెక్టరు భార్య, తల్లి అయిన డాక్టర్ సయ్యదా అమ్రీన్ భర్తతో (Rizwan Basha Shaik and his wife Dr. Syeda Amreen)కలిసి జనగామలోని తల్లీ పిల్లల ఆరోగ్యకేంద్రానికి వచ్చి అనాథ శిశువును తన ఒడిలోకి తీసుకున్నారు. (CompassionInAction) అమ్రీన్ తన చేతులతో శిశువును ఎత్తుకొని డబ్బా పాల సీసాతో ఆ శిశువుకు కలెక్టరు భార్య పాలు పట్టారు. కళ్లలో నుంచి కన్నీరు ఉబికి వస్తుండగా అమ్రీన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘పిల్లలు దేవుని ఆశీర్వాదాలని, అలాంటి పిల్లలకు ప్రేమ, ఆశ్రయం లేకుండా చేయడం హృదయాన్ని కలిచివేస్తోంది’’అని డాక్టర్ అమ్రీన్ వ్యాఖ్యానించారు.
కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ
అనాథ శిశువు ఆరోగ్యం, భవిష్యత్ గురించి జిల్లా వైద్యాధికారులతో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా చర్చించారు. అనాథ శిశువుపై శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. శిశువుకు అందిస్తున్న వైద్య సేవల గురించి కలెక్టర్ వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.
బేబీ క్రెడిల్ పాయింట్
బిడ్డలు భారం అనుకుంటే వారిని రోడ్లు, చెత్తకుండీల పాలు చేయవద్దని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా కోరారు.ఎవరైనా బిడ్డలు భారం అనుకుంటే వారిని జనగామ తల్లీపిల్లల ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన బేబీ క్రెడిల్ పాయింట్ (Baby Cradle Point) లలో వదిలివేయాలని కలెక్టర్ కోరారు. సురక్షితంగా ఆసుపత్రిలో ఉన్న ఊయలలో వదిలి వెళితే ఆ బిడ్డను ప్రభుత్వం, ప్రజలు చూసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతీ బిడ్డకు జీవించే హక్కు ఉందని, ఎవరైనా బిడ్డను పెంచలేక పోతే తాము సహాయం చేస్తామని చెప్పారు. జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ చట్టం 2015 ప్రకారం అనధికార దత్తత నేరమని కలెక్టర్ చెప్పారు. పిల్లలను అనదికారికంగా దత్తత తీసుకోవద్దని కలెక్టర్ కోరారు. అనాథ పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.