‘ఫోన్ ట్యాపింగ్‌లో విచారణకు నేను రెడీ’
ఫోన్ ట్యాపింగ్ విషయంలో వ్యక్తిగత హద్దులు ఉండాలి. చట్టప్రకారం సాధ్యమే అయినా.. అనుమతి తప్పనిసరి.;
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ట్యాప్ కాలేదని భావిస్తున్నానని, ఒకవేళ బాధితుల జాబితాలో తన పేరు కూడా ఉంటే సిట్ విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవుతానని అన్నారు. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టప్రకారం సాధ్యమయ్యే పనే అని, కానీ అందుకు తగిన అనుమతులు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఢిల్లీలో పెట్టిన చిట్ చాట్‌లో భాగంగా రేవంత్.. ఫోన్ ట్యాపింగ్‌పై స్పందించారు. కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వినాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. అంతకన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఈ వ్యవహారంలో నిజం నిగ్గు తేల్చడం కోసమే సిట్‌ను ఏర్పాటు చేశామని, సిట్ అధికారులను తాను డిక్టేట్ చేయనని ఆయన స్పష్టం చేశారు.
‘‘ఎన్నికల ముందు తన ఫోన్ ట్యాప్ అయిందని ఆర్‌ఎస్ ప్రవీణ్.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతే మేము సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించాం. అందులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. సిట్ నుంచి నాకు ఇప్పటి వరకు నోటీసులు రాలేదు. కాబట్టి నా ఫోన్ ట్యాప్ కాలేదనే భావిస్తున్నా. బాధితుల జాబితాలో నా పేరు ఉంటే తప్పకుండా నోటీసులు ఇస్తారు కదా. అదే జరిగితే కచ్చితంగా సిట్ ముందు హాజరవుతా. నా వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తా. ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధమైన పని కాదు. కానీ దానికి తగిన పర్మిషన్లు తీసుకోవాలి. చాలా మంది నేను కూడా ఫోన్లు ట్యాప్ చేస్తున్నా అని ప్రచారం చేస్తున్నారు. నేను అలా ఎప్పటికీ చేయను’’ అని రేవంత్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది. ఇందులో ఒకవైపు ప్రభాకర్ రావు సహా ఇతర అధికారులను విచారిస్తున్న సిట్.. మరోవైపు బాధితుల వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఆయన వ్యాఖ్యలు అధికార పార్టీకి పారదర్శకత, న్యాయపరమైన దిశగా ప్రభుత్వం నడుస్తోందన్న సంకేతాలను ఇస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.