SIGACHI Explosion |కంపెనీలో పేలుడుపై ఐఐసీటీ శాస్త్రవేత్తల విచారణ షురూ
సిగాచి ఫార్మా కంపెనీ పేలుడు ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐఐసీటీ శాస్త్రవేత్తల బృందం గురువారం నుంచి విచారణ ప్రారంభించింది.;
By : Saleem Shaik
Update: 2025-07-03 04:00 GMT
సిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన భారీ పేలుడు ఘటన తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద ఘోర విపత్తుగా విషాదాన్ని నింపింది. ఫార్మా కంపెనీలో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘోర ప్రమాదంపై సమగ్ర విచారణకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలతో కూడిన నిపుణుల కమిటీని దర్యాప్తునకు నియమించింది.
నేడు సిగాచీ పరిశ్రమను సందర్శించనున్న శాస్త్రవేత్తలు
సిగాచి పరిశ్రమలో పేలుడుపై దర్యాప్తు చేసి, ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన సూచనలు, సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనుంది. హైదరాబాద్ ఐఐసీటీ ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటేశ్వరరావు ఛైర్మన్ గా ముగ్గురు నిపుణుల కమిటీ గురువారం సిగాచి పరిశ్రమను సందర్శించి, ప్రమాద కారణాలు, తీవ్రతపై దర్యాప్తు చేయనున్నారు. సిగాచి పరిశ్రమ అధికారులు, తెలంగాణ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్ స్పెక్టర్, అగ్నిమాపక శాఖ అధికారులను శాస్త్రవేత్తల కమిటీ ఫార్మా ప్రమాదం, భద్రత అంశాలను ఆరా తీయనుంది.
సిగాచీలో పేలుడు ఘటన...
మెదక్ ఉమ్మడి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారంలోని ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఫేజ్ 1లోని ప్లాట్ నంబరు 20,21లలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో (SIGACHI Explosion ) జూన్ 30వతేదీన ఉదయం 9.20 గంటలకు జరిగిన ఘోర పేలుడు ఘటన తర్వాత మంటలు ఎగసి పడ్డాయి. ఈ ఫ్యాక్టరీలో టాబ్లెట్లు, క్యాప్సూల్స్ తయారీలో వాడేందుకు మైక్రోక్రిస్టలీన్ సెల్యూలోజ్ పౌడరు (Microcrystalline Cellulose Powder) ను సిగాచి పరిశ్రమలో ఉత్పత్తి చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు జరిగినపుడు పరిశ్రమ లోపల 143 మంది కార్మికులున్నారు.ఈ ఘోర ప్రమాదంలో 40 మంది సజీవ దహనం కాగా మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సిగాచీ పేలుడుపై విచారణకు శాస్త్రవేత్తల కమిటీ
సిగాచి పేలుడు ఘటన, కెమికల్ పరిశ్రమల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు. ఇకముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై దర్యాప్తు చేసి ఐఐసీటీ శాస్త్రవేత్లల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఐఐసీటీ ప్రఖ్యాత శాస్త్ర వేత్త డాక్టర్ బి వెంకటేశ్వరరావు ఛైర్మన్ గా, ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ టి ప్రతాప్ కుమార్, చెన్నైకు చెందిన రిటైర్డు సీఎస్ఐఆర్ శాస్త్రవేత్త డాక్టర్ సూర్యనారాయణ, పూణేలోని సీఐఎస్ఆర్ ఎన్ సీ ఎల్ సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ గూగేలు సభ్యులుగా నిపుణుల కమిటీని దర్యాప్తుకోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సిగాచీ పేలుడుపై తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం లేబర్ ఎంప్లాయ్ మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీనికి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఆర్టీ నంబరు 277 పేరిటను విడుదల చేసింది.
దర్యాప్తు చేయాల్సిన అంశాలివే...
తెలంగాణలోని పరిశ్రమల్లో కార్మికులు పాటించాల్సిన సేఫ్టీ నిబంధనలు, స్టాండర్డు ఆపరేటింగ్ ప్రోసీజర్ (ఎస్ఓపీ)ని ఐఐసీటీ శాస్త్రవేత్తల కమిటీ పరిశీలించి నివేదించనుంది. కెమికల్, ఇండస్ట్రియల్ కంపెనీల్లో ఉత్పత్తి సమయంలో యాజమాన్యాలు నిబంధనలను ఉల్లంఘించడంపై ఈ నిపుణుల కమిటీ దృష్టి సారించనుంది. కెమికల్, ఫార్మా పరిశ్రమల్లో ప్రమాదాలు వాటిల్లకుండా శాస్త్రవేత్తల కమిటీ సూచనలు చేయనుంది.పేలుడు సంభవించిన సిగాచి యాజమాన్యం, సిబ్బంది, కార్మికులు, జిల్లా అధికారులు, కన్సల్ టెంట్లు, ఇతర సంస్థలు, ప్రభుత్వ అధికారులను ఈ కమిటీ విచారించనుంది. ఈ నిపుణుల కమిటీ నెలరోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.ఈ కమిటీకి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.