ముందుగానే తెలంగాణ తలుపు తడుతున్న వానదేవుడు

ఐఎండి చల్లని కబురు;

Update: 2025-05-22 05:16 GMT
కురుస్తున్న వర్షం : ఐఎండీ చల్లని కబురు

నైరుతి రుతుపవనాలు నాలుగైదు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనుండటంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి.మండే ఎండలు కాస్త తగ్గిపోయి తెలంగాణలో ఓ మోస్తరుతోపాటు భారీవర్షాలు కురుస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో ఎండ వేడిమికి అల్లాడిన ప్రజలకు ఒకింత ఊరట లభించినట్లయింది. తెలంగాణ రాష్ట్రంలో వేడిగాలులు, ఉక్కపోతతో అల్లాడిపోయే మే నెలలో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలకు ఉపశమనం లభించింది.


కేరళను తాకనున్న రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని ప్రజలకు చల్లని కబురును భారత వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.నైరుతి రుతుపవనాలు రాగల మూడు, నాలుగు రోజుల్లోనే కేరళ భూభాగంలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో రాగల 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ ఆవర్తనం రాగల 36 గంటల్లో ఉత్తర దిక్కులో కదులుతూ క్రమేపి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ధర్మరాజు వివరించారు. ఉపరితల ఆవర్తనం నుంచి కోస్తా ఆంధ్ర తీరం వరకు ద్రోణి ఏర్పడింది.

రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు
గురు, శుక్రవారాల్లో రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ‘ఫెడరల్ తెలంగాణ’కు తెలిపారు. రాగల రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.హైదరాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మెదక్, నిజామాబాద్, మెదక్, వికారాబాద్, ఖమ్మం వరంగల్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు కురిశాయని ఐఎండీ అధికారులు చెప్పారు.

వాతావరణ శాఖ హెచ్చరికలు
గురు, శుక్రవారాల్లో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలితో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. భారీవర్షాల నేపథ్యంలో ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

రుతుపవనాలు అంటే...
రుతుపవనాలు అంటే వర్షాలు కురిసే శక్తి ఉన్న పవనాలు. రుతుపవనం అనే పదం మౌసం అనే అరబిక్ నుంచి వచ్చింది. మౌసం అంటే రుతువు అని అర్థం. భూమిపై గాలి వేడెక్కి వాతావరణంలో కలిసి ఆ గాలి సముద్రం వైపు వీస్తుంది. ఆ సమయంలో సముద్రంలోని నీరు ఆవిరై గాలిలో కలుస్తాయి. గాలిలో తేమ పెరిగి బరువుగా మారి గాలి వీచే దిశ మారుతుంది. సముద్రం నుంచి భూమిపై వీచే గాలి, తేమతో ఘనీభవించి వర్షం కురుస్తుంది. నైరుతి నుంచి భారతదేశం వైపు గాలులు వీస్తుండటం తో దీన్ని నైరుతి రుతుపవనాలు అంటారు.

తొలివర్షం కేరళ కనుమల్లో...
నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల కురిసే తొలి వర్షం కేరళ కనుమల్లో కురుస్తుంది. రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత సాధారణంగా అయిదు నుంచి ఏడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చేరుకుంటాయి.

తెలంగాణలో నేడు ఆరెంజ్ అలర్ట్
గురువారం తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్,నల్గొండలోని కొన్ని ప్రాంతాల్లో 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలతో కూడిన మరిన్ని వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ కొనసాగుతోందని అధికారులు చెప్పారు.

నలుగురు మృత్యువాత

గడచిన 24 గంటల్లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఒక మహిళ సహా నలుగురు మరణించారు.నల్గొండ, మహబూబాబాద్, వనపర్తి జిల్లాల్లో నలుగురు మరణించారు. పిడుగుపాటుకు గురైన వారిలో నల్గొండ జిల్లా అప్పాజిపేటకు చెందిన మహిళా రైతు భిక్షమ్మ (46), మహబూబాబాద్ జిల్లా ఓథేకు చెందిన గొర్రెల కాపరి చేరాలు (55), ప్రవీణ్ కుమార్ (27), వనపర్తి జిల్లా మియాపూర్‌కు చెందిన యువకుడు కొరవ నాగరాజు (18) ఉన్నారు.వర్షాలు కురుస్తున్నపుడురైతులు, గొర్రెల కాపరులు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని అధికారులు కోరారు.

వర్ష బీభత్సానికి పలు పశువులు మృతి చెందాయి. మే 28 వతేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మరో సంఘటనలో సూర్యాపేట జిల్లా నల్లబండగూడెం గ్రామంలోని ఒక రైస్ మిల్లు సమీపంలో ఒకే పిడుగుపాటుకు 36 మేకలు మృత్యువాత పడ్డాయి.మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల్‌లలో కొనుగోలు కేంద్రాలలోని వరి నిల్వలు నీటిలో మునిగిపోయాయి. మహబూబ్‌నగర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఖమ్మంలో పిడుగుపాటు కారణంగా 22 పశువులు మరణించాయి. ఆదిలాబాద్, నిర్మల్ మరియు ఆసిఫాబాద్‌తో సహా ఉత్తర జిల్లాలు మరియు సిద్దిపేట, సూర్యపేట, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.


అప్రమత్తంగా ఉండండి : విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్
ఈ నెలాఖరులోగా రుతుపవనాలు ప్రవేశించనున్న నేపథ్యంలో వర్షాకాల సీజన్ ఆరంభం కానుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున, ఏవిధమైన విపత్తులు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో మే మాసాంతం వరకే రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో జిల్లాలకు ముందస్తు చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మార్గదర్శకాలను విడుదల చేశారు.

ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం
తెలంగాణలో ముందస్తుగానే 12 స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (SDRF)లను సిద్ధంగా ఉంచామని అరవింద్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఒక్కో టీమ్ లో తెలంగాణా స్పెషల్ పోలీస్ కు చెందిన 100 మంది సుశిక్షితులైన పోలీసులు ఉంటారని, ఈ బృందాలను రాష్ట్రంలోకి పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేశామని ఆయన చెప్పారు.ఎక్కడైనా భారీ వర్షాలు కురిసినా వెంటనే సమీపంలోని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుంటాయని కలెక్టర్లకు తెలిపారు.ఈ సారి మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

అప్రమత్తంగా ఉండండి : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు.హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ, పోలీస్​, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.


Tags:    

Similar News