జలాశయాల్లోకి పెరిగిన వరద ప్రవాహం
దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.;
By : Saleem Shaik
Update: 2025-08-13 00:49 GMT
హైదరాబాద్ నగరంలోని హుసేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల్లో వరదనీరు అధికంగా చేరుతుండటంతో గేట్లు ఎత్తి దాన్ని దిగువకు వదులుతున్నారు. దీని వల్ల నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. హిమాయత్ సాగర్ గేట్ల ఎత్తడంతో మూసీలో వదరనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసారం బ్రిడ్జి వద్ద వరదనీరు పెరగడంతో హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
నిండు కుండలా మారిన హుసేన్ సాగర్
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో నగరం నడిబొడ్డున ఉన్న హుసేన్ సాగర్ నిండుకుండలా మారింది. హుసేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా దీనికంటే కొంచెం దిగువన ఉంది. భారీవర్షాల వల్ల 1,027 క్యూసెక్కుల వరదనీరు హుసేన్ సాగర్ లోకి వస్తుండగా , అధికారులు 1,130 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హుసేన్ సాగర్ నుంచి వరదనీటిని కాల్వల్లోకి వదులుతుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. హుసేన్ సాగర్ కాల్వ తీరంలోని లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అవసరమైతే వారిని సురక్షిత శిబిరాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరు డి హరిచందన లోతట్టుప్రాంతాల్లో పర్యటించారు. మరో వైపు జీహెచ్ఎంసీ అధికారులు హుసేన్ సాగర్ నీటిమట్టాన్ని పరిశీలిస్తూ దిగువ ప్రాంతాల ప్రజల భద్రతకు చర్యలు చేపట్టారు.
జంట జలాశయాలకు జలకళ
హైదరాబాద్ నగర జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లకు భారీవర్షాలతో జలకళ వచ్చింది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.500 అడుగులు కాగా ప్రస్థుత నీటిమట్టం 1762.250 అడుగుల నీరు చేరింది. జలాశయంలో 2.715 టీఎంసీల నీరు చేరింది. జలాశయం నుంచి వరదనీటిని మూసీలో వదులుతున్నారు. మరో ఉస్మాన్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్థుతం 1783.700 అడుగుల మేరకు నీరు చేరింది. ఇప్పటికే 2.617 టీఎంసీల నీరు ఉస్మాన్ సాగర్ లో చేరింది.
ఈ ఏడాది హైదరాబాద్ నీటి కష్టాలు తీరినట్లే...
హైదరాబాద్ నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న జలాశయాల్లోకి వరదనీరు భారీగా చేరడంతో నగర నీటి కష్టాలు ఇక తీరినట్లేనని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఇంజినీరు కె కృష్ణ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల్లోకి పూర్తి స్థాయిలో వరదనీరు చేరుతుందని ఆయన తెలిపారు., మరో వైపు మంజీరా జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1651.750 అడుగులు కాగా ప్రస్థుతం 1712.584 అడుగుల మేర నీరు వచ్చింది.కృష్ణా నది నీటిని మళ్లించేందుకు ఉద్ధేశించిన అక్కంపల్లి రిజర్వాయరు పూర్తి స్థాయి నీటి మట్టం 245 అడుగులు కాగా ఇప్పటికే 241.300 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా తాజాగా 589.600 అడుగుల మేరకు నీరు జలాశయంలోకి వచ్చింది.గోదావరిపై నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 485 .560 అడుగులు కాగా ప్రస్థుతం 476.237 అడుగుల మేరకు నీరు చేరింది.