తీన్మార్ మల్లన్న దాడికి భలే ట్విస్ట్ ఇచ్చిన కవిత

కవిత మీద దాడి అంటే మొత్తం తెలంగాణ మీద దాడియేనా;

Update: 2025-07-14 07:02 GMT
Kavitha and Teenmar Mallanna

తెలంగాణ రాజకీయ కాలుష్యాన్ని ఇద్దరూ కలిసి యధాశక్తి పెంచేస్తున్నారు. అసలే కాలుష్యంతో కంపుకొడుతున్న తెలంగాణ రాజకీయానికి ఎంఎల్సీలు కల్వకుంట్ల కవిత, తీన్మార్ మల్లన్న తమవంతుగా మరింత కంపుచేస్తున్నారు. ఇద్దరు చేసిన ఓవర్ యాక్షన్ వల్లే రాజకీయం ఇంత కంపుగా తయారైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల(BC Reservations) కోసం ఆర్డినెన్స్ జారీచేయాలని ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం నిర్ణయించింది. ఈనిర్ణయంలో ప్లస్సయినా, మైనస్సయినా పూర్తిగా రేవంత్ ది మాత్రమే అని అందరికీ తెలుసు. కాని కవిత(Kavitha) ఓవర్ యాక్షన్ వల్ల ఇపుడింతగా రాద్దాంతం అవుతోంది. ఆర్డినెన్స్ జారీచేయాలన్న క్యాబినెట్ నిర్ణయంలో క్రెడిట్ కొట్టేయాలని కవిత ఆరాటపడుతున్నారు. బీసీలకు రిజర్వేషన్ల కోసం తాము చేసిన పోరాటాలు, తెచ్చిన ఒత్తిడి ఫలితంగానే రేవంత్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్ కు క్యాబినెట్ నిర్ణయించిందని కవిత చేసిన ప్రకటనే ఇపుడీ వివాదానికి మూలకారణం.

నిజానికి బీసీల రిజర్వేషన్ల కోసం కవితచేసిన పోరాటం, ఆందోళనలు పెద్దగా లేవన్న విషయం అందరికీ తెలిసిందే. మీడియా సమావేశాల్లో, జాగృతి మీటింగుల్లో, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని హెచ్చరించటం, ఈనెల 17వ తేదీన రైలురోకోకు పిలుపు మాత్రమే కవిత ఇచ్చారు. ఇంతమాత్రానికే రేవంత్ ప్రభుత్వం భయపడిపోయి, ఒత్తిడికి తట్టుకోలేక బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ జారీచేసేస్తుందా ? ఏడాదిన్నర నుండి బీసీల రిజర్వేషన్ల కోసం తాను పోరాటాలు చేస్తున్నట్లు కవిత చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది. కవిత చెప్పుకుంటున్న ఏడాదిన్నరలో 6 మాసాలు ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam) కేసులో తీహార్ జైలులోనే ఉన్నారు. అంతకుముందు బీసీల రిజర్వేషన్ల కోసం కవిత మాట్లాడనుకూడా లేదు.

జైలునుండి విడుదలైన తర్వాత బీఆర్ఎస్ లో అన్న కేటీఆర్(KTR) తో ఆధిపత్య పోరాటంమొదలైంది. దాంతో సొంత అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసమే కవిత బీసీల రిజర్వేషన్ అంటు హడావుడి మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. వాస్తవాలు అందరికీ తెలిసినా రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకోవటానికే కవిత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్ల ఆర్డినెన్స్ తమ పోరాటాల ఫలితమే అని కవిత చెప్పుకోవటంపై పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh kumar goud), మంత్రులు ఎద్దేవా చేస్తున్నారు.

ఇదే విషయమై కాంగ్రెస్ నుండి సస్పెండ్ అయిన ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) ఓవర్ గా రియాక్టయ్యాడు. కవిత క్రెడిట్ క్లైం చేసుకోవటానికి తీన్మార్ కు ఎలాంటి సంబంధంలేదు. కవిత క్రెడిట్ క్లైం చేసుకునేవిషయాన్ని కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. మధ్యలో తీన్మార్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్ధంకావటంలేదు. ఆదివారంఉదయం జరిగిన ఒకమీటింగులో మాట్లాడుతు కవితపై కొన్ని వ్యాఖ్యలు చేసిన తీన్మార్ అదేసమయంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దాంతో మధ్యాహ్నం జాగృతి నేతలు, క్యాడర్ తీన్మార్ ఆఫీసుపై దాడిచేసి ఫర్నీచర్ ను ధ్వంసంచేశారు. అక్కడినుండి ఒకవైపు కవిత మరోవైపు తీన్మార్ ఆరోపణల మీద ఆరోపణలు చేసుకుంటున్నారు. సభ్యత్వాలను రద్దుచేయాలని ఒకరిపై మరొకరు శాసనమండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. గడచిన రెండురోజులుగా రెండువైపుల నుండి జరుగుతున్నది అంతా రాజకీయ కాలుష్యాన్ని పెంచటమే కాని తెలంగాణ సమాజానికి ఎలాంటి ఉపయోగంలేదు.

తెలంగాణను వివాదంలోకి లాగుతున్నదా ?

కల్వకుంట్ల ఫ్యామిలీకి విచిత్రమైన అలవాటుంది. తమపైన ఏ కోణంలో అయినా దాడులు మొదలైనా లేదా తాము ఇబ్బందులు పడుతున్నా వెంటనే మొత్తం తెలంగాణను లాగేస్తున్నారు. ఇపుడు కల్వకుంట్ల కవిత కూడా అదే చేస్తున్నారు. వివాదం కవిత-తీన్మార్ మల్లన్న మధ్య అయితే కవిత తెలంగాణ ఆడబిడ్డలంటు ఒకటే గోలచేస్తున్నారు. తెలంగాణ ఆడబిడ్డలు తీన్మార్ కు బుద్ధి చెబుతారంటు ఆడవాళ్ళందరినీ వివాదంలోకి లాగటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తీన్మార్ అన్నది డైరెక్టుగా కవితను మాత్రమే. అయితే కవిత మాత్రం తెలంగాణ ఆడబిడ్డలను తీన్మార్ అవమానించాడంటు పదేపదే మాట్లాడుతున్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏదన్నా ఇబ్బందులు మొదలైనా, కేసులు నమోదైనా, అవమానాలు ఎదురైనా మొత్తం తెలంగాణపైన కేసులు పెట్టినట్లుగా, అవమానాలు ఎదురైనట్లుగా మొత్తం తెలంగాణను వివాదంలోకి లాగేందుకు ప్రయత్నిస్తుండటం ఆశ్చర్యంగా ఉంది. గతంలో లిక్కర్ స్కామ్ లో ఈడీ, సీబీఐ నోటీసులు ఇచ్చినపుడు కూడా తెలంగాణ ఆడబిడ్డకు నోటీసులిచ్చి అవమానిస్తారా అంటు కవిత నానా గోలచేసింది. అయితే ఆమె గోలను తెలంగాణ ఆడబిడ్డలు ఎవరూ పట్టించుకోలేదులేండి.

Tags:    

Similar News