‘దాడులు మళ్ళీ జరగకూడదంటే భారత్ కఠినంగా ఉండాలి’

అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు రేవంత్.;

Update: 2025-04-25 17:55 GMT

పహల్గామ్ దాడి దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము మద్దతుగా ఉంటామని అన్ని పార్టీలు బాహాటంగా వెల్లడిస్తున్నాయి. తాజాగా పహల్గామ్‌లో జరిగిన మారహోమానికి వ్యతిరేకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ‘శాంతి ర్యాలీ’ చేశారు. దేశంలో మళ్ళీ ఇలాంటి ఉగ్రదాడులు జరగకుండా ఉండాలంటే భారత్ కఠినంగా వ్యవహరించాలని రేవంత్ అన్నారు. ఈ ర్యాలీలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా పాల్గొన్నారు.‘‘పహల్గామ్ భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతీ చర్యకు మద్దతు పలికేందుకు అందరం సిద్ధంగా ఉన్నాం. అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సానుభూతి తెలుపుతోంది. ఆ కుటుంబాలకు అందరం అండగా నిలబడి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. 1967, 1971 లో ఇలాంటి దాడులు జరిగినపుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారు. ఒక్క దెబ్బతో పాకిస్తాన్ ను పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని రెండు ముక్కలు చేశారు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీని వాజ్ పేయ్ దుర్గామాతతో పోల్చారు. ప్రధాని మోడీ గారు మీరు దుర్గామాత భక్తులుగా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోండి. ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలి. కోట్లాదిభారతీయులంతా మీకు మద్దతుగా ఉంటారు… ఒక్క దెబ్బతో పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేయండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపండి’’ అని కోరారు.

Tags:    

Similar News