Revanth and Telugu Industry|రేవంత్ తో రాయబారానికి ఇండస్ట్రీప్రయత్నం ?

దిల్ రాజు(FDC Chairman DilRaju) నాయకత్వంలోనే సినీఇండస్ట్రీ ప్రముఖులు రేవంత్ తో రాయబారానికి ప్రయత్నించినట్లున్నారు.

Update: 2024-12-25 10:18 GMT
Revanth and DilRaju

అనుకున్నట్లే జరిగింది. రేవంత్ రెడ్డితో రాయబారానికి తెలుగుసినీ ఇండస్ట్రీ ప్రముఖులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రభుత్వానికి, సినీఇండస్ట్రీకి మధ్య ప్రముఖ సినీనిర్మాత దిల్ రాజు ఉన్నారు. నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజును ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎఫ్డీసీ) ఛైర్మన్ గా నియమించిన విషయం తెలిసిందే. అంటే దిల్ రాజు ఇటు రేవంత్(Revanth) తో పాటు అటు చిత్రసీమకు బాగా కావాల్సిన వ్యక్తి. అందుకనే దిల్ రాజు(FDC Chairman DilRaju) నాయకత్వంలోనే సినీఇండస్ట్రీ ప్రముఖులు రేవంత్ తో రాయబారానికి ప్రయత్నించినట్లున్నారు. ఇండస్ట్రీ ప్రముఖులు రేవంత్ తో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు అల్లుఅర్జున్(AlluArjun) తండ్రి అల్లు అరవింద్ ప్రకటించారు. ఇదే విషయాన్ని దిల్ రాజు మాట్లాడుతు రేవంత్ తో అపాయిట్మెంట్ దొరకగానే సినీ హీరోలు, నిర్మాతలు, దర్శకులు కలుస్తారని చెప్పారు. రేవంత్ తో అపాయిట్మెంట్ కోసం తాను ప్రయత్నిస్తున్నట్లు రాజు చెప్పారు.

రాజుచేసిన తాజా ప్రకటనతోనే సినీపరిశ్రమ(Telugu Cine Industry) పెద్దలు రేవంత్ ను కలవటానికి ఎంత ఆతృతగా ఉన్నారో అర్ధమవుతోంది. వీళ్ళంతా రేవంత్ ను కలవాలని అనుకుంటున్నది సీఎంమీద ప్రేమతోనో గౌరవంతోనో కాదు. అచ్చంగా భయంతోనే అన్న విషయం అర్ధమవుతోంది. నిజానికి రేవంత్ సీఎం అయినప్పటినుండి ఇప్పటివరకు సినీపరిశ్రమలోని చాలామంది ప్రముఖులు అసలు లెక్కేచేయలేదు. ఎవరు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నా సినీపరిశ్రమలోని ప్రముఖులు వెళ్ళి కలవటం, అభినందనలు తెలపటం ఆనవాయితీ. ఎందుకంటే సినీపరిశ్రమకు ప్రభుత్వంతో అనేక అవసరాలుంటాయి. ముఖ్యంగా పెద్ద సినిమాలు రిలీజప్పుడు టికెట్ల రేట్లు పెంచుకోవటం, బెనిపిట్ షోలు, ప్రీమియర్ షోలకు అనుమతివ్వటం, రాయితీలు తీసుకోవటం లాంటి అనేక అవసరాలుంటాయి. ఇక షూటింగులకు ఎలాగూ అనుమతులు తప్పనిసరి. అందుకనే ముఖ్యమంత్రిగా ఎవరున్నారన్నది చూడకుండా పరిశ్రమ ప్రభుత్వంతో మంచి సంబంధాలేనే కోరుకుంటుంది.

అయితే ఇపుడు ఏమైందో తెలీదుకాని పరిశ్రమలోని చాలామంది ప్రముఖులు రేవంత్ ను కలవనే లేదు. ప్రతియేటా సినిమాలకు ఇచ్చే నంది అవార్డులను ఇక నుండి గద్దర్ పేరుతో ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు రేవంత్ ప్రకటించారు. పరిశ్రమలోని పెద్దల అభిప్రాయాలు చెప్పమని రేవంత్ అడిగినా చాలామంది ప్రముఖులు పెద్దగా స్పందించలేదు. ఈఉదాహరణ చాలు సినీప్రముఖులు రేవంత్ ను లెక్కచేయలేదని చెప్పటానికి. సినీపరిశ్రమలోని పెద్దల ఆలోచనలను గ్రహించిన రేవంత్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయినా టికెట్ల రేట్లు పెంపుకు, బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలకు అనుమతులు అడిగితే ప్రభుత్వం ఇస్తునే ఉంది. అయితే సంధ్యా ధియేటర్ లో పుష్ప సినిమా విడుదల సందర్భంగా తొక్కిసలాట జరగటం, మహిళ చనిపోవటం, ఆమె కొడుకు కోమాలోకి వెళ్ళి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.

తొక్కిసలాటకు కారణమైన అల్లుఅర్జున్ పై పోలీసులు కేసునమోదుచేసి అరెస్టుచేసి జైలుకు పంపారు. దాంతో పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్యాన్ ఇండియా స్టార్ అనుకుంటున్న అల్లుఅర్జున్నే ప్రభుత్వం లెక్కచేయలేదు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వబట్టి సరిపోయింది లేకపోతే ఈరోజుకూ అల్లుఅర్జున్ చంచల్ గూడ జైలులోనే ఉండేవాడు. అల్లుఅర్జున్ అరెస్టును ఖండించలేక, అల్లుఅర్జున్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించలేక పరిశ్రమలోని పెద్దలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అల్లుఅర్జున్ అరెస్టుదెబ్బకు ప్రభుత్వం అంటే ఏమిటో చాలామందికి స్పష్టంగా అర్ధమైనట్లుంది. వ్యవస్ధలు ఎన్నున్నా అంతిమంగా రాజకీయ అధికారానికి మిగిలినవి తలొంచక తప్పదన్న విషయం అనుభవపూర్వకంగా తెలిసొచ్చినట్లుంది. అందుకనే అర్జంటుగా దిల్ రాజుతో రాయబారం పంపినట్లు అనుమానంగా ఉంది. ఇకనుండి బెనిపిట్ షోలు, ప్రీమియర్ షోలకు అనుమతులు లేవని రేవంత్ చేసిన ప్రకటన సినీపెద్దల్లో కలవరం మొదలైనట్లుంది. ఎందుకంటే జనవరిలో కొన్ని పెద్దసినిమాలు విడుదల అవుతున్నాయి. వందలకోట్ల రూపాయలతో సినిమాలు తీయటం, ఆ డబ్బును రాబట్టుకోవటానికి టికెట్ల రేట్లు పెంచేసి జనాలను చావకొట్టడమే నిర్మాతలు పనిగా పెట్టుకున్నారు. తమ సినిమాలకు బెనిపిట్ షో, ప్రీమియర్ షోలకు అనుమతులు ఇవ్వకపోతే నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారనటంలో సందేహంలేదు. అందుకనే ఏడాదిపాటు ప్రభుత్వాన్ని పెద్దగా లెక్కచేయని సినీపరిశ్రమ ఇప్పటికిప్పుడు రేవంత్ ను కలవటానికి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఏమొచ్చింది ?

Tags:    

Similar News