33 జీవోతో మెడికల్ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం?

ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధనల వలన స్థానికులకు అన్యాయం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2024-08-06 10:05 GMT

ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధనల వలన స్థానికులకు అన్యాయం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ నెల 3న కాళోజి నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఇక్కడ విద్యాసంస్థల అడ్మిషన్లలో 2014 నుంచి 2024 వరకు ఏపీ విద్యార్థులకు కోటా ఉన్నది. ఈ ఏడాదితో విభజన చట్టంలోని గడువు ముగియడంతో కాళోజి యూనివర్సిటీ తాజా అడ్మిషన్ల ప్రక్రియ కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో స్థానికతపై గతంలో ఉన్న నిబంధనల్లో మార్పులు చేసింది. తెలంగాణ ప్రభుత్వం జులై 19న జారీ చేసిన 33 జీవో ప్రకారం స్థానికత నిబంధనలు మార్చినట్టు నోటిఫికేషన్ లో పేర్కొంది.

33 జీవోతో మాకు అన్యాయం జరిగేలా ఉందని తెలంగాణ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణిస్తామని నోటిఫికేషన్లో పేర్కొనడంతో వివాదం చెలరేగింది. 2023-24 విద్యా సంవత్సరం వరకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏడేళ్ల కాలంలో గరిష్ఠంగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణలోకి తీసుకునేవారు. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి స్థానికతలో చేసిన మార్పులతో తెలంగాణ వారికే ఎక్కువ అన్యాయం జరగనుందనే ఆరోపణలు వస్తున్నాయి.

విద్యాశాఖమంత్రికి లేఖ...

తెలంగాణ రాష్ట్ర NEET తెలంగాణ 2024 విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకి లేఖ రాశారు. జీవో 33 వలన స్థానికత కోల్పోతున్న తెలంగాణ విద్యార్థులకు తగు న్యాయం చేయాలని లేఖలో కోరారు.

"ప్రస్తుతం NEET తెలంగాణ 2024 - MBBS అడ్మిషన్లో భాగంగా నోటిఫికేషన్ సమయంలో లేని నిబంధనలను ది.19-07-2024 నాడు GO MS నెం.33కు అటాచ్ చేసిన అమెండ్మెంట్ వలన తెలంగాణలో పుట్టి, పెరిగి తెలంగాణలో నివసిస్తూ ఉన్న తెలంగాణ లోకల్ అభ్యర్థులమైన మాకు దారుణమైన అన్యాయం జరుగుతుంది. ఇది స్థానికతలో ప్రధానంగా పరిగణించే రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్దంగా ఉంది. ఇలా జరగడం వలన తెలంగాణ రాష్ట్ర విద్యార్థులమైన మేము 12 సంవత్సరాలు అహర్నిశలు. రాత్రింబవళ్లు ఎంతో కష్టపడి చదివి రాంకు సాధించిన మాకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగుతుంది. ఈ అమెండ్మెంట్ తెలంగాణ లోకల్ విద్యార్థులైన మా పాలిట శాపంగా మారి మమ్ములను నిరాశ నిస్పృహలకు లోనుచేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తుంది. ఇదే సందర్భంలో గత కొన్నేళ్లుగా అమలవుతున్న దానిని పరిశీలించినట్లయితే 6 నుండి 12వ తరగతి చదివిన 7 యేళ్ల కాలములో గరిష్టంగా 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణించేవారు. ప్రస్తుతం జి.వో. ఎం.ఎస్. నెం.33కు 19-07-2024 తేదినాడు అటాచ్ చేసిన అమెండ్మెంట్ వలన 9వ, 10వ, 11వ మరియు 12వ తరగతులు వరుసగా తెలంగాణ రాష్ట్రములో చదివితేనే స్థానికులుగా పరిగణించబడుతుంది. 9వ తరగతి కంటే ముందు ఎక్కడ చదివారనే దానిని పరిగణలోనికి తీసుకొనుట లేదు. GO MS No. 33, HM & FW (C1) Dept. Dated: 19-07-2024 ప్రకారం 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలంగాణ రాష్ట్రములో చదివి ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్లో చదివిన తెలంగాణ స్థానిక విద్యార్థులైన మేము స్థానికతను కోల్పోతున్నాము. కావున తమరు మా యందు దయ ఉంచి ది.19-07-2024 నాడు GO MS నెం.33కు సంబంధించిన అమెండ్మెంట్ రద్దుచేసి స్థానికత విషయంలో గత సంవత్సరము వరకు మన రాష్ట్రములో అమలులో ఉన్న విధంగా చివరి 7సంవత్సరాల కాలాన్ని పరిగణలోకి తీసుకొని తెలంగాణ విద్యార్థులకు స్థానికత విషయంలో తగు న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాము" అంటూ వారు రాసిన లేఖలో మంత్రిని కోరారు.

ఏపీ విద్యార్థులకు బెనిఫిట్...

33 జీవో ప్రకారం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఏపీ విద్యార్థులకు లాభం చేకూరుతుందని ప్రధానంగా వినిపిస్తోన్న ఆరోపణ. ఈ నిబంధనతో హైదరాబాద్ లో చదివిన ఏపీ విద్యార్థులు తెలంగాణాలో స్థానికులుగా ఉంటారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని చాలా ప్రాంతాలకి చెందిన విద్యార్థులు గుంటూరు, విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతుంటారు. ఇలా ఇంటర్ చదవడానికి పొరుగు రాష్ట్రాలకి వెళ్లినవారికి కొత్త నిబంధనతో స్థానికత కోటను కోల్పోతారు అని వాదిస్తున్నారు.

ప్రైవేట్ కాలేజీలకు లాభం చేకూర్చేందుకు?

మరోవైపు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రైవేటు కాలేజీలకు మేలు చేసేందుకే స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను పెట్టిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. స్థానికత నిర్ధారణ కోసం వైద్య, ఆరోగ్యశాఖ జారీ చేసినట్టు చెబుతున్న ఈ 33 జీవో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌ సైట్‌ లోనూ అందుబాటులో లేదని, పారదర్శకత లేకపోవడంతో ఈ జీవో అమలుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికత కోటాలో ఎక్కువ మందికి అవకాశం ఇస్తే ప్రైవేటు కాలేజీల్లో బీ క్యాటగిరీ సీట్లకు పోటీ పెరుగుతుందని, ఇది ప్రైవేట్‌ కాలేజీలకు మేలు చేస్తుందని అంటున్నారు.

తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా?

మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా? అని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోందన్నారు. జీవో 33 ప్రకారం నిర్దేశించిన స్థానికతలోని అంశాలు ప్రభుత్వం వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్లే ఉన్నాయన్నారు. 9 వ తరగతి నుంచి 12 తరగతి వరకు మన వద్ద చదివిన విద్యార్థులే స్థానికులు అవుతారని ప్రభుత్వం చెబుతోంది. ఈ నిర్ణయం ప్రకారం చాలా మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులే తెలంగాణలో లోకల్ అవుతారు. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఉన్నందున ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల చాలా మంది ఇక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం వారంతా తెలంగాణలో లోకల్ అవుతారు. అదే విధంగా ఇతర రాష్ట్రాలలో చదివే మన విద్యార్థులు నాన్ లోకల్ అయ్యే ప్రమాదం ఉందన్నారు.

"2023-24 విద్యాసంవత్సరం వరకు 6 వ తరగతి నుంచి 12 తరగతి వరకు నాలుగేళ్లు గరిష్టంగా ఎక్కడ చదివితే అదే స్థానికతగా గుర్తించాం. దాని కారణంగా మన విద్యార్థులు ఇంటర్మీడియేట్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ వారు లోకల్ గానే పరిగణించబడే వారు. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న కొత్త నిబంధనల ప్రకారమైతే వేలాది మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకల్ అవుతారు. దీంతో మన విద్యార్థులు మెడిసిన్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా...గతంలో అనుసరించిన విధానాన్నే అనుసరించాలి" అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News