మెడికల్ కాలేజీల్లో తనిఖీలు
ఈ నెల 25 నుంచి 29 వరకు స్పెషల్ డ్రైవ్;
By : B Srinivasa Chary
Update: 2025-06-23 07:56 GMT
సమాజంలో విద్య, వైద్యం ప్రాముఖ్యత ఉన్న రంగాలు. ఈ రెండు రంగాలను నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం మున్ముందు తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. తెలంగాణలో 26 వైద్య కళాశాలలపైజాతీయ వైద్య కమిషన్ సీరియస్ గా ఉంది. పూర్తిగా దిగజారిపోయిన ఈ కళాశాలకు వైద్యకమిషన్ షోకాజ్ నోటీసులు జారి చేసింది. షోకాజ్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులు డిల్లీ వెళ్లి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో మౌలి సదుపాయాల కల్పనకు ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు తనిఖీల పేరిట స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 మెడిక కాలేజీల్లో లోపాలు ఉన్నట్టు జాతీయ వైద్య కమిషన్ ఇప్పటికే వెల్లడించింది. భావిభారత డాక్టర్లు తయారయ్యే ఈ మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు పూర్తిగా కరవయ్యాయి. ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, డిఎంఈ నరేంద్రకుమార్ ఈ మేరకు ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలపై నివేదిక తయారు చేసే పనిలో వైద్య ఆరోగ్య శాఖ ఉంది. ప్రత్యేక తనిఖీల పేరిట స్పెషల్ డ్రైవ్ ఏర్పాటుచేస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. పది కమిటీలు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. ఈ కమిటీలు దాదాపు 34 మెడికల్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి ఈ నెల 30 న నివేదిక సమర్పించనున్నాయి.