ఆపరేషన్ హైడ్రా: ఆ అధికారులపై మొదలైన విచారణ

హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలకు పూనుకున్నారు.

Update: 2024-08-30 11:12 GMT

హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్స్ (FTL), బఫర్ జోన్‌లలో నిర్మాణాలకు చట్టవిరుద్ధంగా అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలకు పూనుకున్నారు. తగిన ఆధారాలతో సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మొహంతికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులపై విచారణ ప్రారంభమైంది.

ఈ క్రిమినల్ కేసులతో పాటు అక్రమంగా అనుమతుల జారీలో ప్రమేయం ఉన్న మరో అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రంగనాథ్ సిఫార్సు చేశారు. నిజాంపేట్, చందానగర్ వంటి ప్రాంతాల్లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేసిన అక్రమ నిర్మాణాలపై ఏజెన్సీ విచారణ కేంద్రీకృతమై ఉంది. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చిన రెవెన్యూ శాఖ, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ), హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) అధికారులు ఈ కేసులో ఇరుక్కున్నారు.

చందానగర్, ప్రగతినగర్‌లోని ఎర్ర కుంట సరస్సు చుట్టూ బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలకు సహకరించిన ఐదుగురు ప్రభుత్వ అధికారులను హైడ్రా గుర్తించింది. ఈ అధికారులు ఇప్పుడు క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆక్రమణలకు సంబంధించి కొనసాగుతున్న కేసుల్లో నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎర్ర కుంట చెరువు బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మించిన మూడు భవనాలను ఈ నెల మొదట్లో హైడ్రా కూల్చివేసింది. ఐదు అంతస్తులతో కూడిన ఈ నిర్మాణాలు 0.29 ఎకరాల ఆక్రమణ భూమిలో నిర్మించబడ్డాయి. 

Tags:    

Similar News