బెట్టింగ్ యాప్స్ కేసుల్లో విచారణ వేగవంతం

మూడు రాష్ట్రాల్లో తెలంగాణ పోలీసుల సోదాలు

Update: 2025-09-24 11:10 GMT

బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. తెలంగాణ సీఐడీ కీలక ఆపరేషన్‌ చేపట్టింది. దేశ వ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. గుజరాత్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లోని ఆరు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. బెట్టింగ్ యాప్స్ ను నిర్వహిస్తున్న 8 మందిని అరెస్టు చేసింది. వీరంతా 6 బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. తాజ్‌ 007, ఫెయిర్‌ప్లే లైవ్‌, ఆంధ్ర 365, వీఎల్‌ బుక్‌, తెలుగు 365, యస్‌ 365 బెట్టింగ్‌ యాప్‌లను ఈ ముఠా ప్రమోట్ చేస్తోంది. చట్ట విరుద్దమైన బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న మూడు రాష్ట్రాల్లో ఆరు ప్రాంతాల్లో దాడులు చేయగా అనేక విషయాలు వెల్లడౌతున్నాయి. సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆన్ లైన్ లో బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న 8 మందిని అరెస్ట్ చేయగలిగామని సిఐడి పోలీసులు తెలిపారు. సిఐడి సోదాల్లో హార్డ్ వేర్ డివైజ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు విదేశాల్లో ఉన్నట్టు గుర్తించామని చారు సిన్హా తెలిపారు. తెలంగాణ సిఐడి పోలీసులు ఇతర రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించడం ఇదే ప్రథమం. బెట్టింగ్ యాప్స్ ద్వారా పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న బెట్టింగ్ యాప్స్ పై ఉక్కుపాదం మోపాలని సిఐడి నిర్ణయించినట్టు తెలుస్తోంది.

తెలంగాణ పోలీసులు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై గత కొంత కాలంగా సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 19 యాప్లలను ప్రమోట్ చేస్తున్న యజమానులపై కేసులు నమోదు చేసి, సెలబ్రిటీలను విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.తెలంగాణ పోలీసులు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ లను నిర్మూలించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు మాత్రమే నోటీసులు జారీ చేసి, వారిపై కేసులు నమోదు చేసిన సిఐడి అధికారులు ఇప్పుడు ఆ యాప్‌ల అసలు యజమానులపై దృష్టి సారించారు.ఈ యాప్ లలో జంగిల్ రమ్మి డాట్ కామ్‌, ఏ23, యోలో 247, ఫెయిర్ ప్లే, జీత్‌విన్‌, విబుక్, తాజ్ 77, వివి బుక్‌, ధనిబుక్ 365, మామ247, తెలుగు365, ఎస్‌365, జై365, జెట్‌ఎక్స్, పరిమ్యాచ్‌, తాజ్777బుక్, ఆంధ్రా365 వంటివి ఉన్నాయి. ఈ కేసుల్లో బెట్టింగ్ యాప్ వ్యవస్థాపకులు, నిర్వహణ బృందం సభ్యులు ఉన్నారు.

ప్రముఖ సినీ నటులు, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో ఉన్న ఇన్ ఫ్లూయెన్సర్స్ సహా 25 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు, ఇప్పుడు యాప్ యజమానులను నేరస్థుల జాబితాలో చేర్చారు. విచారణను స్పీడు పెంచాలని నిర్ణయించారు. ఈ కేసుల్లో చట్టపరమైన లోపాలను సవరించేందుకు కొత్త సెక్షన్లను చేర్చుతున్నట్లు సిఐడి అధికారులు తెలిపారు. నేరస్థులను శిక్షించడానికి బలమైన ఆధారాలను సేకరించేందుకు అధికారులు సిద్దమయ్యారు. నేరస్థులకు కఠిన శిక్షలు పడితేనే బెట్టిగ్ యాప్స్ నిర్మూలన సాధ్యం కాదని సిఐడి అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News