జీహెచ్ఎంసీలో పూడికతీత పేరిట గోల్‌మాల్

జీహెచ్ఎంసీలో పూడికతీత పనుల్లో అక్రమాలు జరిగాయి.నిబంధనలకు పాతరేసి నిధులను స్వాహా చేస్తున్నారు.;

Update: 2025-07-04 10:06 GMT
హైదరాబాద్ నాలాలో పేరుకుపోయిన పూడిక

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 1302 కిలోమీటర్ల పొడవు వరదనీటి కాల్వలు, 390 పెద్ద నాలాలు, 912 కిలోమీటర్ల మేర మైనర్ డ్రెయిన్స్ ఉన్నాయి. నాలాల్లో వర్షపునీరు సాఫీగా వెళ్లేందుకు వీలుగా ప్రతీ ఏటా పూడికతీత పనులు చేపట్టాలి.పూడికతీత పనులు సజావుగా చేపట్టలేదు.హైదరాబాద్ నగరంలో నాలాల్లో పూడిక వెలికితీత కోసం ఈ ఏడాది జీహెచ్ఎంసీ రూ.55 కోట్లతో 203 పనులు చేపట్టాలని ప్రాథమిక అంచనాలను రూపొందించింది. ఈ నిధులతో పనులు చేపట్టడంలో అడుగడుగునా అక్రమాలు జరిగాయి.


జీహెచ్ఎంసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే...
హైదరాబాద్ నగరంలోని వరదనాలాల్లో పేరుకుపోయిన పూడికను వేసవికాలంలోనే పూర్తిగా తొలగించి వర్షాకాలంలో వరదనీరు సాఫీగా పోయేలా చూడాలని పూడికతీత పనులు చేపట్టాలి. ప్రతీ ఏటా జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల ఆధ్వర్యంలో ఈ పనులు జరగాలి. పూడిక పేరుకుపోయిన నాలాలను గుర్తించి పూడికతీతకు డిసెంబరు నెలలోనే అంచనాలు రూపొందించాలి.కానీ ఆ పని జరగలేదు. అంచనాలను వార్డు కమిటీ సభ్యులకు కూడా తెలియ పర్చాలి. కానీ వారికి తెలియకుండానే కాగితాల్లోనే పనులు చేసినట్లు చూపించి పూడికతీత నిధులను దుర్వినియోగం చేస్తున్నారని నగరానికి చెందిన కాలనీ సంక్షేమ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్ వీరేష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

నాలాల్లో పూడిక ఎలా చేరుతుందంటే...
హైదరాబాద్ నగరంలోని నాలాల్లోకి ప్రతీ ఏటా పెద్ద ఎత్తున పూడిక చేరుతుంది. ప్రజలు ఇళ్ల నిర్మాణానికి ఇసుక తీసుకువచ్చి రోడ్లపైనే వేస్తుంటారు. ఈ ఇసుక వర్షాలకు కొట్టుకుపోయి నాలాల్లోకి పోతుంది. దీనికి తోడు ప్రజలు ప్లాస్టిక్, ఇతర ఇళ్లలోని వ్యర్థాలను నాలాల్లో పడేస్తున్నారు. దీంతో నాలాల్లో పూడిక పేరుకుపోతుంది.

నిబంధనలకు పాతర
నాలాల్లో తొలగించిన పూడికను లారీల్లో జీపీఎస్ సాయంతో దూర ప్రాంతాలకు తరలించాలి. తొలగించిన పూడిక లారీలను వే బ్రిడ్జీల వద్ద తూకం వేసి దాన్ని ఫొటోలు తీసి ఫైళ్లలో పెట్టాలని జీహెచ్ఎంసీ నిబంధన విధించింది. కానీ కాంట్రాక్టర్లు పూడిక తొలగించే లారీలకు జీపీఎస్ పెట్టడం లేదు, తూకం వేయడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ సోమ శ్రీనివాసరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పూడికతీత పనులను స్థానిక కార్పొరేటర్లు, వార్డు కమిటీ సభ్యులు,వార్డుల ఏరియా సభ సభ్యులు, మురుగునీటిపారుదల విభాగం సిబ్బంది సమక్షంలో చేపట్టాలి. కానీ వీరెవరికీ తెలియకుండానే సజావుగా పూడిక తీయకుండానే బిల్లులు డ్రా చేస్తున్నారు.పూడికతీత బిల్లులు చెల్లించే ముందు పూడిక లారీల బరువు, ఫొటోలు, జీపీఎస్ ను పరిశీలించాలి. కానీ ‘తలా పాపం తిలా పిడికెడు’ చందంగా పూడికతీత పనుల బిల్లుల్లో డిప్యూటీ కమిషనర్లు, కార్పొరేటర్ల నుంచి ఏఈ, ఏఈఈ, డీఈ, ఈఈ,ఎస్ఈల దాకా అందరూ పర్సంటేజీలు తీసుకొని ఈ బాగోతంపై కిక్కురు మనడం లేదని సోమ శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏది?
జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ ఇంజినీరు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పూడికతీత పనులను ప్రతీ మంగళ, శుక్రవారాల్లో పర్యవేక్షించాలని జీహెచ్ఎంసీ సర్క్యూలర్ జారీ చేసినా అది అమలు కావడం లేదు. నగరంలో తొలగించిన పూడికను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించాలి.కానీ అది జరగడం లేదు. పూడికతీత పనులను జీహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, జోనల్ కమిషనర్లు పిరియాడికల్ గా పర్యవేక్షించాల్సి ఉండగా వారు కూడా పట్టించుకోవడం లేదు. ప్రతీ ఏటా మే 31వతేదీలోగా నాలాల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలనే ఆదేశాలు ఆచరణలో అమలు కావడం లేదు.

ఆలస్యంగా పూడికతీత పనులు
సాధారణంగా ప్రతీ ఏటా జనవరి నుంచి మే నెలాఖరులోగా నగరంలోని నాలాల్లో పూడికతీత పనులు చేపట్టాలి. నైరుతి రుతుపవనాలకు ముందుగా నాలాల్లో పూడికను తొలగించి, వర్షాకాలంలో వరదలు వెల్లువెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.ప్రతీ ఏటా డిసెంబరులో పూడికతీత పనులకు టెండర్లు పిలిచి చేపట్టాల్సిన పనులు అధికారుల నిర్లక్ష్యం వల్ల కాలేదు. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నెల వచ్చినా నాలాల్లో పూడికతీత పనులు సజావుగా చేపట్టలేదు. 203 నాలాల్లో పనులు చేపట్టాల్సి ఉండగా కేవలం 120 ప్రాంతాల్లో అరకొర పనులతో సరిపుచ్చేశారు.

వీకర్ సెక్షన్ కోఆపరేటివ్ సొసైటీలకు పూడికతీత పనులు
నాలాల్లో పూడికతీత పనులను అంచనాలు రూపొందించకుండానే వీకర్ సెక్షన్ కోఆపరేటివ్ సొసైటీలతో చేపించినట్లు రాజేంద్రనగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ సమాచార హక్కు చట్టం కింద అందించిన సమాచారంలోనే పేర్కొన్నారు. రాజేంద్రనగర్ వార్డులో 16 కిలోమీటర్ల పొడవు నాలాలో పూడిక తొలగింపునకు వీకర్ సెక్షన్ కోఆపరేటివ్ సొసైటీకి రూ.రూ.19 లక్షలు చెల్లించినట్లు డీసీ పేర్కొన్నారు. వాస్తవానికి నాలా పొడవు, వెడల్పు, లోతును బట్టి పూడిక తొలగింపునకు అంచనాలు రూపొందించి పనులు చేయాలి కానీ దీన్ని జీహెచ్ఎంసీ ఇంజినీర్లు పట్టించుకోవడం లేదు.

అమలు కానీ షెడ్యూల్
జీహెచ్ఎంసీలో నాలాల్లోని పూడిక తొలగింపు పనులకు ప్రతీ ఏటా మార్చి 15వతేదీ లోగా పరిపాలనా ఆమోదం ఇవ్వాలి. మార్చి 31వతేదీలోగా దీనికి టెండర్లు పిలవాలి. ఏప్రిల్ మొదటివారంలోనే పూడిక తొలగింపు పనులు చేపట్టాలి. మే 31 వతేదీలోగా నాలాల్లో పేరుకుపోయిన పూడిక మొత్తాన్ని తొలగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారికంగా సర్క్యులర్ జారీ చేసినా దీన్ని పాటించడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ సోమ శ్రీనివాసరెడ్డి చెప్పారు.

ముందుకు రాని కాంట్రాక్టర్లు
జీహెచ్ఎంసీలో గతంలో చేసిన పనులకు గాను కాంట్రాక్టర్లకు రూ.1400 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంది.తాము గతంలో చేసిన పనులకు బిల్లులు రాక జీహెచ్ఎంసీలో కొత్త పనులు చేసేందుకు తాము ముందుకు రావడం లేదని జీహెచ్ఎంసీ కాంట్రాక్టరు ఎన్ స్వామి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

పూడిక తొలగించనందువల్లే వరద ముంపు ముప్పు
వేసవికాలంలో నాలాల్లో పేరుకుపోయిన పూడికను తొలగించాల్సిన జీహెచ్ఎంసీ సరిగా పనులు చేపట్టక పోవడంతో నగరంలోని బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీ, లోటస్ పాండ్ నుంచి వరదనీటి సమస్య ఏర్పడింది. హకీంపేట నుంచి బల్కం చెరువులోకి వరద నీరు పూడిక వల్ల వెళ్లక పోవడంతో కాలనీల్లో వరదనీరు నిలిచి పోయింది. 2024 సంవత్సరంలో కూడా 3.12 లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడికను తీసి 81 శాతం పనులే చేశారు.జీహెచ్ఎంసీ రికార్డుల్లో మాత్రం ఐదు లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడిక తీసినట్లు లెక్కలు చూపించారు. ఈ ఏడాది కూడా పూడికతీత పనులు సజావుగా చేయలేదు. దీంతో ఈ ఏడాది వర్షాకాలంలో పలు కాలనీలు, బస్తీలకు వరదముప్పు తప్పేలా లేదని హైదరాబాద్ నగరంలోని వెంకటరమణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బి హరీష్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఏసీబీ డైరెక్టర్ జనరల్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఫిర్యాదు
జీహెచ్ఎంసీలో పూడికతీత పనుల్లో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కు చెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ కు లేఖ రాశారు. నగరంలోని నాలాలు, డ్రెయిన్లలో పూడికతీత పనుల పేరిట గత కొన్నేళ్లుగా అక్రమాలు సాగుతున్నాయని, నిబంధనలను పాటించకుండా పనులు చేశామనిపించి నిధులు స్వాహా చేస్తున్నారని ఆయన ఏసీబీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రతీ ఏటా నాలాల్లో పూడికతీత పనులకు రూ.55కోట్లను వెచ్చిస్తూ పనులు సజావుగా చేపట్టడం లేదని, దీనిలో సాగుతున్న అక్రమాలపై ఏసీబీ సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పద్మనాభరెడ్డి ఏసీబీ డీజీని కోరారు.


Tags:    

Similar News