Allu Arjun and Revanth|పుష్పమీద కేసుపెడితే ఇండస్ట్రీ మీద పెట్టినట్లేనా ?
మహిళ మరణం దురదృష్టమని మొసలికన్నీరు కారుస్తున్న ప్రతిపక్షాలు అందుకు కారణమైన హీరోమీద కేసుపెట్టడాన్ని మాత్రం తప్పపటడమే ఆశ్చర్యంగా ఉంది.;
ప్రతిపక్షాల నేతల మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. సినిమా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో హీరో అల్లుఅర్జున్(AlluArjun) మీద కేసుపెట్టి, అరెస్టుచేయటాన్ని బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP)లు అడ్వాంటేజ్ తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. పోలీసులు అల్లుఅర్జున్ మీద కేసుపెట్టగానే రేవంత్ రెడ్డి టార్గెట్ గా రాజకీయాలకు తెరలేపాయి. జాతీయ అవార్డు గ్రహీత అల్లుఅర్జున్ మీద కేసుపెట్టడం ఏమిటంటు ప్రతిపక్షాలు గోలమొదలుపెట్టేశాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటలరాజేందర్ తదితరులు పదేపదే రేవంత్ ను టార్గెట్ ను చేస్తున్నారు. పుష్ప(Pushpa)మీద కేసుపెట్టడాన్ని కక్షసాధింపుగా రచ్చరచ్చ చేశారు. తర్వాత అరెస్టుచేయగానే రేవంత్ ప్రభుత్వం(Revanth Government) తెలుగుసినీఇండస్ట్రీ(Telugu Cine Industry)ని టార్గెట్ చేస్తోందని, ఇండస్ట్రీని బోనులో నిలబెట్టే కుట్రలు జరుగుతోందని ప్రతిరోజు పదేపదే ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే సినీఇండస్ట్రీ అంటే అల్లుఅర్జున్ ఒక్కడే అన్నట్లుగా కేటీఆర్, హరీష్ రావు, సంజయ్, కిషన్, ఈటల నానా రచ్చచేస్తున్నారు. తాజాగా ఈటల రాజేందర్ మాట్లాడుతు సినిమా ఇండస్ట్రీని బోనులో నిలబెట్టేందుకు సీఎం కుట్రలు చేస్తున్నారంటు ఆరోపించారు. క్రికెట్ ప్లేయర్స్, పొలిటికల్ లీడర్స్, సినిమా స్టార్లకు పెద్దఎత్తున మాస్ ఫాలోయింగ్ ఉంటుందని, వారి పర్యటనల్లో ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈటల చెప్పింది ఎలాగుందంటే అల్లుఅర్జున్ సంథ్యా థియేటర్లో(Sandhya Theatre) పుష్ప సినిమా చూడటానికి వచ్చినపుడు తగినంత బందోబస్తు చేయకపోవటం ప్రభుత్వం తప్పన్నట్లుగా ఉంది. ప్రభుత్వాన్ని, రేవంత్ ను టార్గెట్ చేస్తున్నవారంతా ఘటనకు మూలకారణం ఏమిటన్న విషయాన్ని కన్వీనియెంట్ గా మరచిపోయినట్లు నటిస్తున్నారు.
అల్లుఅర్జున్ రాకసందర్భంగా థియేటర్ యాజమాన్యం పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చారు కదాని పదేపదే అడుగుతున్నారు. అల్లుఅర్జున్ వస్తున్నారని ధియేటర్ యాజమాన్యం పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చింది వాస్తవమే. అయితే సినిమా హీరోతో పాటు యూనిట్ లో ఎవరినీ రావద్దని చెప్పాలని పోలీసులు థియేటర్ యాజమాన్యానికి రాసిన లేఖను మాత్రం ఎక్కడా ప్రస్తావించటంలేదు. ఇక్కడే ప్రతిపక్షాల కుట్ర బయటపడుతోంది. సందర్భం ఏదైనా సరే రేవంత్ ను టార్గెట్ చేయాలన్నదే ప్రతిపక్షాల టార్గెట్ అని జనాలకు అర్ధమైంది. అల్లుఅర్జున్ రాకకు పోలీసులు అనుమతించి తగినంత బందోబస్తు ఏర్పాటుచేయకపోతే అప్పుడు పోలీసులను తప్పుపట్టవచ్చు. హీరోతో పాటు సినిమా యూనిట్ లో ఎవరినీ రావద్దని చెప్పమని పోలీసులు థియేటర్ యాజమాన్యానికి లేఖ రాశారు. రావద్దని చెప్పటానికి కారణాలను కూడా పోలీసులు థియేటర్ యాజమాన్యానికి స్పష్టంగా చెప్పిన విషయాన్ని మాత్రం ప్రతిపక్షాలు ఎక్కడా మాట్లాడటంలేదు.
రావద్దని చెప్పిన తర్వాత అల్లుఅర్జున్ వస్తాడని పోలీసులు ఎలాగ అనుకుంటారు. స్టార్ హీరో సినిమా రిలీజ్ కు థియేటర్ దగ్గర ఎంత బందోబస్తు అవసరమో అంతే పోలీసులు ఏర్పాటుచేశారు. అయితే ఎప్పుడైతే అల్లుఅర్జున్ రోడ్డుషో ద్వారా థియేటర్ దగ్గరకు వస్తున్నాడని తెలిసిన వెంటనే పోలీసులు ఆగమేఘాల మీద అదనపు బందోబస్తును పంపించారు. రావద్దన్నా రావటమే కాకుండా రోడ్డుషో, ర్యాలీ ద్వారా అల్లుఅర్జున్ థియేటర్ దగ్గరకు రావటంతోనే తొక్కిసలాట జరిగిందని ప్రతిపక్షాలకు కూడా బాగా తెలుసు. తెలిసినా సరే అల్లుఅర్జున్ భుజాల మీద నుండి ప్రతిపక్షాలు రేవంత్ మీదకు తుపాకి ఎక్కుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. అల్లుఅర్జున్ రాకకారణంగానే థియేటర్లో తొక్కిసలాట జరిగింది వాస్తవం, ఆ తొక్కిసలాటలో మహిళ మరణించిందన్నదీ వాస్తవమే. మహిళ మరణం దురదృష్టమని మొసలికన్నీరు కారుస్తున్న ప్రతిపక్షాలు అందుకు కారణమైన హీరోమీద కేసుపెట్టడాన్ని మాత్రం తప్పపటడమే ఆశ్చర్యంగా ఉంది.
బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు ఎలాగున్నాయంటే సినీఇండస్ట్రీ అంటే అల్లుఅర్జున్ ఒక్కడే అన్నట్లుగా ఉన్నాయి. ఇపుడు సమస్య ప్రభుత్వానికి అల్లుఅర్జున్ కు మధ్య మాత్రమే. ప్రభుత్వానికి-సినీఇండస్ట్రీకి ఎలాంటి సమస్యాలేదు. సినీఇండస్ట్రీ అంటే అల్లుఅర్జున్ ఒక్కడే కాదన్న విషయం అందరికీ తెలుసు. ఇండస్ట్రీలోని చాలామందిలో అల్లుఅర్జున్ ఒక్కడు అంతే. అల్లుఅర్జున్ మీద కేసుపెట్టి అరెస్టుచేస్తే మొత్తం సినీఇండస్ట్రీ మీద కేసుపెట్టినట్లుగా ప్రతిపక్షాలు ఓవర్ యాక్షన్ చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఘటన తాలూకు వివాదం కోర్టుకు చేరుకుంది. కాబట్టి ఘటనలో తప్పు ఎవరిదన్న విషయాన్ని కోర్టు నిర్ణయిస్తుంది. న్యాయపరంగా ప్రభుత్వాన్ని కోర్టులో ఎదుర్కోలేనంత చిన్నోడేమీ కాదు అల్లుఅర్జున్. కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్షాలు రాజకీయలను పక్కనపెట్టేసి ఘటనను ఘటనగా చూస్తే బాగుంటుంది.