పోలీసులు టార్గెట్ మిస్సయ్యారా ?

ఢిల్లీ పోలీసులు టార్గెట్ మిస్సయినట్లే ఉన్నారు. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో విషయంలో రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారించాలన్నది ఢిల్లీ పోలీసుల పట్టుదల.

Update: 2024-05-03 13:04 GMT
revanth reddy

ఢిల్లీ పోలీసులు టార్గెట్ మిస్సయినట్లే ఉన్నారు. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో విషయంలో రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారించాలన్నది ఢిల్లీ పోలీసుల పట్టుదల. కాంగ్రెస్ పార్టీ వేసిన పిటీషన్ను విచారించిన హైకోర్టు విచారణను నిలిపేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అమిత్ షా ఫేక్ వీడియోను వైరల్ చేశారని చెప్పి ఇప్పటికే తెలంగాణా కాంగ్రెస్ లోని ఐదుగురు సోషల్ మీడియా ముఖ్యులను పోలీసులు అరెస్టుచేసిన విషయం తెలిసిందే. ముందు అందరికీ నోటీసులిచ్చిన పోలీసులు నాలుగురోజుల తర్వాత రెండోసారి నోటీసులు ఇచ్చి ఐదుగురిని అరెస్టు చేశారు. అయితే వీళ్ళంతా కోర్టులో కేసు వేయటంతో బెయిల్ వచ్చింది. ఇదే కేసులో రేవంత్ కు కూడా నోటీసులు ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు మహాపట్టుదలగా ఉన్నారు.

అయితే రేవంత్ వాళ్ళకి అంత అవకాశం ఇవ్వలేదు. అసలు నోటీసులు తీసుకోవటానికే అంగీకరించలేదు. అమిత్ షా ఫేక్ వీడియో వైరల్ అవ్వటానికి తనకు సంబంధమే లేదని ఎదురుదాడి మొదలుపెట్టారు. నోటీసు తీసుకోవటానికి, విచారణకు హాజరవ్వటానికి రేవంత్ ఇష్టపడలేదు. ఇదే సమయంలో రేవంత్ కు నోటీసులు ఇవ్వకుండా వెనక్కు వెళ్ళటానికి పోలీసులూ ఇష్టపడలేదు. ఈ నేపధ్యంలోనే పార్టీ దాఖలుచేసిన కేసును హైకోర్టు విచారించింది. కేసును విచారించిన కోర్టు తదుపరి విచారణను ఆపేయమని ఆదేశించింది. విచారణను నాలుగు వారాల పాటు వాయిదావేసింది.

కోర్టు జోక్యం కారణంగా ఢిల్లీ పోలీసుల ఆశలపై నీళ్ళు చల్లినట్లయ్యింది. నిజానికి ఢిల్లీ పోలీసుల లెక్కప్రకారం రేవంత్ మే 1వ తేదీనే ఢిల్లీలో విచారణకు హాజరవ్వాల్సుంది. 13వ తేదీన పోలింగ్ కారణంగా రేవంత్ 17 పార్లమెంటు నియోజకవర్గాల్లోను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. విచారణ పేరుతో తనను ఇబ్బందిపెట్టాలన్నదే దురాలోచనగా రేవంత్ బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఢిల్లీ పోలీసులను బీజేపీ అడ్డంపెట్టుకుని తనను, కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్లాన్ చేసినట్లుగా రేవంత్ ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. రేవంత్ విచారణకు హాజరయ్యుంటే ఢిల్లీ పోలీసులు ఏమిచేసుండేవారో తెలీదు.

మొత్తానికి ఢిల్లీ పోలీసులకు రేవంత్ ఎదురుతిరిగి కోర్టులో కేసు వేయించి విచారణపై స్టే తీసుకురాగలిగారు. దాంతో చేసేదిలేక ఢిల్లీ పోలీసులు వెనక్కు తిరిగివెళ్ళటం ఖాయమని అర్ధమవుతోంది. కాబట్టి నోటీసులు, విచారణ విషయంలో ఎలాంటి టెన్షన్ లేకుండా రేవంత్ హ్యాపీగా ఎన్నికల ప్రచారాన్ని పూర్తిచేసుకోవచ్చు.

Tags:    

Similar News