Hydra|నేతల్లో హైడ్రా టెన్షన్ పెంచేస్తోందా ?

చెరువులు, కాల్వలను ఆక్రమించిన నేతల్లో అన్నీ రాజకీయపార్టీల వాళ్ళూ ఉన్నట్లు చెప్పారు.

Update: 2024-12-03 08:46 GMT
Hydra Commissioner AV Ranganadh

హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్ చేసిన హెచ్చరికతో నేతల్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లే ఉంది. ఒక సమావేశంలో రంగనాధ్ మాట్లాడుతు జలవనరుల కబ్జాలో రాజకీయ నేతలు, సంపన్నుల పాత్రే ఎక్కువగా ఉందన్నారు. చెరువులు, కాల్వలను ఆక్రమించిన నేతల్లో అన్నీ రాజకీయపార్టీల వాళ్ళూ ఉన్నట్లు చెప్పారు. అందరి గుట్టుమట్లు తొందరలోనే బయటపెతామని, ఏ ఒక్కరిని వదిలిపెట్టమని హైడ్రా కమీషనర్(Hydra Commissioner Ranganadh) బహిరంగంగానే హెచ్చరించారు. దాంతో జలవనరులను చెరబట్టిన కబ్జాదారుల్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. రంగనాధ్ చెప్పింది నూరుశాతం కరెక్టనే చెప్పాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా చెరువులు, కాల్వలతో పాటు ప్రభుత్వ భూములను కబ్జాచేసేది ఎక్కువగా రాజకీయ నేతలు, వాళ్ళ అండతో సన్నిహితులు, బినామీలే అని అందరికీ తెలుసు.

హైడ్రా కూల్చివేతలు మంచి ఊపుమీదున్నపుడు పలానా నేత ఫామ్ హౌస్(Farm House) ఉంది దమ్ముంటే కూల్చేయాలని ఒక నేతంటే మరో నేతకు సంబంధించిన ఫామ్ హౌసును ఇంకో నేత చూపించారు. జన్వాడ కేటీఆర్ ఫాంహౌస్(Janwada KTR Farmhouse) ను హైడ్రా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు అనగానే వెంటనే బీఆర్ఎస్(BRS) నేతలు పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ గురించి మాట్లాడారు. జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌసును అక్రమంగా, కాలువను ఆక్రమించుకుని నిర్మించినట్లు బయటపడింది. దాంతో ఏ నిముషంలో అయినా ఫాంహౌసు కూల్చేయటం ఖాయమనే ప్రచారం పెరిగిపోయింది. దాంతో ఏమనుకున్నారో ఏమో కేటీఆర్ రాత్రికి రాత్రే ఫామ్ హౌసును ఖాళీ చేసేశారు. కేటీఆర్ ఫామ్ హౌస్ ను హైడ్రా కూల్చేయబోతోందనే మంటతో కాంగ్రెస్ నేత పట్నం మహేందర్ రెడ్డి ఫాం హౌస్ మాటేమిటంటు కారుపార్టీ నేతలు నానా గోలచేశారు.

పట్నం కూడా చెరువును ఆక్రమించుకునే అక్రమంగా ఫామ్ హౌసు నిర్మించుకున్నారని ఆరోపిస్తు అందుకు కొన్ని ఆధారాలను కూడా బీఆర్ఎస్ నేతలు ట్విట్టర్లో రిలీజ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు, హరీష్ రావు(HarishRao) చెరువు, కాల్వలను కబ్జాచేసి ఫామ్ హౌసులు నిర్మించుకున్నట్లు స్వయంగా రేవంత్ రెడ్డే(Revanthreddy) బహిరంగసభలో ఆరోపించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల్లో చాలామంది చెరువులు, కాల్వలను ఆక్రమించుకుని అక్రమంగా ఫామ్ హౌసులు నిర్మించుకున్నారన్న విషయం ఆరోపణలు, పరస్పర ఆరోపణలతో బయటపడింది. ఇదే సందని చెప్పి హైడ్రా కూడా ఫామ్ హౌసుల బాగోతాలన్నింటిపైనా ఆరా తీసినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫామ్ హౌసులు ఎన్ని ఉన్నాయి ? ముఖ్యంగా నిషేధిత 111 జీవో పరిధిలోని గండిపేట, మహేశ్వరం మండలాల పరిధిలో ఉన్న ఫామ్ హౌసులు ఎన్ని, దాని ఓనర్లు ఎవరనే వివరాలను గుట్టుచప్పుడు కాకుండా హైడ్రా బయటకు లాగినట్లు తెలుస్తోంది.

అందిన వివరాల ప్రకారం కబ్జాచేసిన నిర్మించుకున్న ఫామ్ హౌసుల్లో మెజారిటి ఫామ్ హౌసులు రాజకీయ నేతలవే అన్న విషయం తేలిపోయిందట. కబ్జాలకు ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడాలు లేవుకదా. అందుకనే అంతా కలిసి కూడబలుక్కున్నట్లుగా జలవనరులను కబ్జాచేసి శక్తి ఉన్న నేతలు ఫామ్ హౌసులు కట్టేసుకున్నారు. ఇపుడా వివరాలన్నీ హైడ్రా కమీషనర్ రంగనాధ్ కు ఆధారాలతో సహా చేరిందని తెలియటంతోనే చాలామందిలో టెన్షన్ పెరిగిపోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు హైడ్రా కూల్చేసిన ప్రాపర్టీల్లో అత్యధికం ఎగువ, మధ్య తరగతి జనాలు బ్యాంకులు, ఆర్ధికసంస్ధల్లో రుణులు తీసుకుని కొనుగోలుచేసినవే. ఈ నేపధ్యంలోనే సంపన్నులు, రాజకీయనేతల ఫామ్ హౌసుల కూల్చివేతలపైన ఎక్కువగా ఆరోపణలు వినిపించాయి.

బాధితులు ఈ విషయాలను డైరెక్టుగా కమీషనర్ నే ప్రశ్నించారు. రూపాయి రూపాయి కూడబెట్టుకుని, ప్రభుత్వ శాఖల అనుమతులు అన్నీ ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే అప్పులు తీసుకుని కొనుక్కున్న ఇళ్ళని కూల్చేయటం ఏమి న్యాయమని బాధితులు రేవంత్ తో పాటు హైడ్రా కమీషనర్ ను నిలదీశారు. అందరి కళ్ళెదురుగానే సంపన్నులు, సెలబ్రిటీలు, రాజకీయనేతలు కబ్జాలు, ఫామ్ హౌసులు కనబడుతున్నా వాటిని హైడ్రా ఎందుకు కూల్చటంలేదని మామూలు జనాలు కూడా ప్రశ్నించారు. దాంతో కూల్చివేతల జోరును తగ్గించిన రంగనాధ్ తొందరలోనే మొదలవ్వబోయే యాక్షన్ ఫామ్ హౌసుల నుండి మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారు. అందుకనే కబ్జాదారుల్లో రాజకీయపార్టీల నేతలు, సంపన్నులే ఎక్కువగా ఉన్నారని బహిరంగంగా చెప్పింది. నగరంలోని చెరువుల్లో 61 శాతం కబ్జాలకు గురయ్యాయని, ఆ కబ్జాలు చేసింది కూడా రాజకీయనేతలు, సంపన్నులే అని రంగనాధ్ ప్రకటించారంటే అర్ధమేంటి ?

ఫామ్ హౌసులకు సంబంధించిన అన్నీ వివరాలను హైడ్రా సేకరించిందన్న విషయం తెలిసిపోతోంది. ఈ పాయింట్ దగ్గరే నేతలు, సంపన్నుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. చెరువులను కాపాడటం, పునరద్ధరించటమే హైడ్రా ముఖ్య ఉద్దేశ్యంగా రంగనాధ్ చెప్పారు. కాబట్టి చెరువులను పునరుద్ధరించాలన్నా, కాపాడాలన్నా కబ్జాలను క్లియర్ చేయాల్సిందే అని కమీషనర్ ప్రకటించారు. మరి ఫామ్ హౌసులపైకి హైడ్రా యాక్షన్ ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News