తెలంగాణా గొంతు అంటే కేసీయార్ మాత్రమేనా ?
రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్, జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్, వీహెచ్ అందరిదీ తెలంగాణా గొంతుకలే కదా.
తెలంగాణ గొంతు అంటే కేసీయార్ మాత్రమేనా ? ఇపుడిదే అంశంపై జనాల్లో చర్చ జరుగుతోంది. చర్చ ఎందుకు జరుగుతోందంటే ఎన్నికల ప్రచారం చేయకుండా కేసీయార్ ను కేంద్ర ఎన్నికల కమీషన్ 48 గంటలపాటు నిషేధించింది కాబట్టి. నిషేధం ఎందుకు విధించింది అంటే ఏప్రిల్ 5వ తేదీన సిరిసిల్ల ప్రచారంలో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలను కేసీయార్ నోటికొచ్చినట్లు తిట్టారు. దాంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిశెట్టి నిరంజన్ చేసిన ఫిర్యాదును ఎన్నికల కమీషన్ పరిశీలించింది. ఫిర్యాదు ఆధారంగా వాస్తవాలను గ్రహించిన తర్వాత కేసీయార్ కు కమీషన్ నోటీసులు జారీచేసింది. అయితే ఆ నోటీసులకు కేసీయార్ వెంటనే సమాధానం చెప్పకుండా సమయం అడిగారు. ఆ తర్వాత ఇచ్చిన సమాధానంతో కమీషన్ సంతృప్తిచెందకుండా 48 గంటలపాటు ప్రచారంచేయకుండా బుధవారం నిషేధం విధించింది.
ఎప్పుడైతే తన ప్రచారంపై కమీషన్ నిషేధం విధించిందో వెంటనే తెలంగాణా గొంతుకను కేంద్ర ఎన్నికల కమీషన్ నొక్కేయటం ఏమిటి ? నిషేధించటం ఏమిటంటు కేసీయార్, కేటీయార్ గోల చేస్తున్నారు. పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో 48 గంటలపాటు ప్రచారం చేయకుండా కేసీయార్ పై నిషేధం విధించటం చిన్న విషయంకాదు. అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీ ప్రచారానికి కేసీయార్ 48 గంటలు దూరం కావటం పార్టీకి పెద్ద దెబ్బనే చెప్పాలి. అయితే నోటికొచ్చినట్లు మాట్లాడకూడదన్న ఇంగితం కేసీయార్ కు ఉండాలి. అనేదంతా అనేసి, నోటికోచ్చిందంతా తిట్టేసి తానేం తప్పు మాట్లాడలేదని అడ్డం తిరిగితే చెల్లుతుందా ? తనను కూడా రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు తిడుతున్న విషయం ఎన్నికల కమీషన్ కు తెలీదా ? వినబడలేదా ? అని ఎదురుదాడి చేస్తే ఉపయోగంలేదు. కేసీయార్ ప్రచారంపై నిషేధం విధిస్తే తెలంగాణా గొంతుపై నిషేధం విధించటం అన్యాయమని కేటీయార్ మండిపడటమే విచిత్రంగా ఉంది.
కేసీయార్ ఆరోపిస్తున్నట్లుగా గుడ్లు పీకేస్తాను, పేగులు తెంపి మెడలో వేసుకుంటానని రేవంత్ అన్నట్లుగా మీడియాలో ఎక్కడా కనబడలేదు. కచ్చితంగా రేవంత్ కూడా పరుఫమైన పదాలే ఉపయోగించుంటారనటంలో సందేహంలేదు. అయితే అది కేసీయార్ తిట్టిన తిట్ల తర్వాతే అయ్యుంటుంది అన్నది మాత్రం వాస్తవం. తన నోటిని అదుపులో పెట్టుకోకుండా తెలంగాణా గొంతుకను ఎన్నికల కమీషన్ నొక్కేస్తుందా అని నానా గోలచేచయటంలో ఎలాంటి ఉపయోగముండదు. ఇక్కడ తెలంగాణా గొంతుకంటే కేసీయార్ మాత్రమేనా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్, జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్, వీహెచ్ అందరిదీ తెలంగాణా గొంతుకలే కదా. తెలంగాణా బాగుకోసం గొంతెత్తే ప్రతి ఒక్కళ్ళది తెలంగాణా గొంతుకే అన్న విషయాన్ని కేసీయార్ మరచిపోయారు.
తెలంగాణా అంటే కేసీయార్..కేసీయార్ మాత్రమే తెలంగాణా అన్న కలరింగ్ ఇవ్వాలని తెగ ప్రయత్నించి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. కేసీయార్ మాటల్లో జనాలకు అహంకారం మాత్రమే కనబడుతోందికాని ఆత్మవిశ్వాసం కనబడటంలేదనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అందుకనే పదేళ్ళ అధికారం చాలని జనాలు బీఆర్ఎస్ ను ఓడించారు. దాన్నే కేసీయార్ తట్టుకోలేకపోతున్నారు. తనను తాను జీవితకాలపు ముఖ్యమంత్రిగా కేసీయార్ ఊహించుకున్నట్లున్నారు. అలాంటిది రెండు ఎన్నికలు అవగానే జనాలు ఓడగొట్టడాన్ని తట్టుకోలేకపోతున్నారు. పైగా తనకు ఏమాత్రం పడని రేవంత్ ముఖ్యమంత్రి అవటాన్ని కేసీయార్ అసలు జీర్ణించుకోలేకపోతున్నట్లున్నారు. అందుకనే రేవంత్ ను నోటికొచ్చింది మాట్లాడుతు తనను తాను తెలంగాణా గొంతుక అంటు ప్రచారం చేసుకుంటున్నారు.