Mohan Babu|గొడవను మోహన్ బాబు తొక్కిపెడుతున్నారా ?

మోహన్ బాబు చేసిన ప్రకటన మీద చాలామందిలో అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Update: 2024-12-08 09:25 GMT
Mohan babu and Manoj

గొడవ జరిగింది వాస్తవం. అయితే ఎవరు ఎవరిమీద దాడిచేశారన్న విషయంలో స్పష్టతలేదు. గొడవ తర్వాత డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా నిజమే. ఫోన్ అందుకోగానే పోలీసులు వెంటనే మోహన్ బాబు ఇంటికి చేరుకుని విచారణ జరిపిందీ వాస్తవమే. కాకపోతే బాధితులు పోలీసుస్టేషన్ కు వచ్చి ఫిర్యాదు మాత్రం చేయలేదు. సరిగ్గా ఇక్కడే మోహన్ బాబు ఒక ప్రకటన జారీచేశారు. అదేమిటంటే తమ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగలేదని, ఎవరు ఎవరిమీదా దాడిచేసుకోలేదని, దయచేసి ఎవరూ తప్పుడు ప్రచారాలు చేయద్దని. ఇక్కడే మోహన్ బాబు చేసిన ప్రకటన మీద చాలామందిలో అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మోహన్ బాబు(Mohan Babu) చెప్పిందే కాసేపు నిజమని అనుకుంటే మరి మోహన్ బాబు ఇంటినుండి డయల్ 100(Dial 100)కి ఫోన్ చేసి గొడవ జరిగిందని పోలీసులకు ఫోన్ చేసింది ఎవరు ? ఫోన్ అందుకోగానే పోలీసులు(Telangana Police) తమ ఇంటికి వచ్చి ఏమి విచారణ చేశారు ? పోలీసుస్టేషన్ కు వచ్చి జరిగిన గొడవ విషయమై ఫిర్యాదు చేయమని ఎందుకు చెప్పారు ? మోహన్ బాబు ఇంట్లో తమ విద్యాసంస్ధల్లో కీలకమైన ఉద్యోగి వినయ్ తన అనుచరులతో ఎందుకు ఉన్నాడు ? అనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం దొరకటంలేదు. వినయ్ తన అనుచరులతో మనోజ్(Manchu Manoj) మీద దాడిచేశాడని, ఆ సమయంలో మోహన్ బాబు అక్కడే ఉన్నారని ఉదయం నుండి మీడియాలో ఒక్కసారిగా ప్రచారం మొదలైంది. ఉదయం నుండి జరుగుతున్న ప్రచారం ఏమిటంటే మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య తీవ్రస్ధాయిలో గొడవలయ్యాయని. ఒకరిపై మరొకరు దాడి చేసుకుని కొట్టుకున్నారని. తనపై తండ్రి దాడిచేశాడని మంచుమనోజ్ పహడీ షరీష్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే మోహన్ బాబు కూడా పోలీసుస్టేషన్ కు వచ్చి కొడుకు తనపై ఇచ్చిన ఫిర్యాదులాంటిదే ఇచ్చారనే ప్రచారం విపరీతంగా జరిగింది.

ఇంట్లో వాళ్ళమధ్య ఏమి జరిగిందన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఎవరు ఎవరిమీద దాడిచేశార అన్నది చిక్కుప్రశ్నగా మిగిలిపోయింది. తండ్రి, కొడుకుల మధ్య వివాదానికి సంబంధించి టీవీల్లో మోహన్ బాబు ఇంటిదగ్గర పోలీసులు ఉన్న దృశ్యాలను అందరు చూసిందే. తండ్రి, కొడుకులు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారని సమాచారం. శ్రీవిద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్సిటీ(MohanBabuUniversity)పై ఆధిపత్యంతో పాటు ఆస్తుల పంపకాల విషయంలో కుటుంబంలో అన్నమంచు విష్ణు(Manchu Vishnu), తమ్ముడు మనోజ్ మధ్య గొడవలు అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. సోదరుల మధ్య వివాదంలో మోహన్ బాబు పెద్దకొడుకు విష్ణుకు మద్దతుగా నిలిచారనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది.

ఈ వివాదాలు, గొడవల కారణంగానే సోదరుల మధ్య కొంతకాలంగా మంచి సంబంధాలు లేవు. తమమధ్య గొడవలను ఇద్దరూ ట్విట్లర్లో పోస్టులు పెట్టడం ద్వారా కుటుంబ తగాదాలను రోడ్డున పడేసుకున్నారు. ఈ గొడవల నేపధ్యంలో ఆదివారం మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవలు అయ్యాయనే ప్రచారం బాగా వైరల్ అయ్యింది. మీడియాతో పాటు సోషల్ మీడియా(Social Media)లో పరస్పరం చేసుకున్న దాడుల ప్రచారం బాగా పెరిగిపోయింది. ప్రచారం మొదలైన చాలాసేపటికి మోహన్ బాబు మీడియాకు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అదేమిటంటే తమ మధ్య గొడవలు జరిగిందన్న ప్రచారం అబద్ధమని, దయచేసి ఎవరు నమ్మవద్దని.

మోహన్ బాబు చెప్పిందే నిజమైతే మరి డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు చేసిన ఫిర్యాదు మాటేమిటి ? డయల్ 100కి ఫోన్ వస్తేనే తాము మోహన్ బాబు ఇంటికి వెళ్ళినట్లు పోలీసులు ఎందుకు చెప్పారు ? మోహన్ బాబు చెప్పింది నిజమే అనుకుంటే పోలీసులు చెప్పింది అబద్ధం. మోహన్ బాబు ఇంట్లో గొడవలు జరిగినట్లు డయల్ 100కి ఫోన్ వచ్చిందని అబద్ధం చెప్పాల్సిన అవసరం పోలీసులకు ఏముంది ? ఇవన్నీ గమనించిన తర్వాత మోహన్ బాబు ఇంట్లో ఏదో జరిగిందన్నది వాస్తవం. ఏమి జరిగిందన్న విషయాన్ని మోహన్ బాబు తొక్కిపెడుతున్నట్లు అనుమానాలు పెరిగిపోతోంది. తమింట్లో గొడవ జరగిందన్న విషయం మీడియా, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినట్లు గమనించిన మోహన్ బాబు నష్టనివారణకు దిగినట్లు అర్ధమవుతోంది. ఏమి జరిగిందన్న విషయం ఈరోజు కాకపోతే రేపయినా బయటపడకపోతుందా ?

Tags:    

Similar News