జగన్ దారిలోనే రేవంత్

ఇక్కడే జగన్ అనుసరిస్తున్న మోడల్ వైపు రేవంత్ చూపు పడింది. అదేమిటంటే 2019 ఎన్నికల్లో నవరత్నాల రూపంలో అనేక సంక్షేమపథకాలను హామీఇచ్చారు

Update: 2024-05-24 05:46 GMT
Jagan and Revanth

అనేక సమస్యలతో అవస్తలు పడుతున్న తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విషయంలో మాత్రం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మార్గంలో నడుస్తున్నట్లు అనిపిస్తోంది. ఎందులో అంటే రైతురుణమాఫీ విషయంలో. పోయిన ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావటమే లక్ష్యంగా రేవంత్ అనేక హామీలిచ్చారు. సిక్స్ గ్యారెంటీస్ గా పాపులరైన హామీల్లో కీలకమైనది, అత్యంత ఖరీదైన హామీ ఏమిటంటే రైతు రుణమాఫీ. హామీ అయితే ఇచ్చారు కాని అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలిసింది దాన్ని అమలుచేయటంలో ఇబ్బందులు ఏమిటో. ఇంతకీ విషయం ఏమిటంటే సుమారు 37 లక్షలమంది రైతులకు వర్తించబోయే ఈ హామీని అమలుచేయాలంటే రు. 40 వేల కోట్ల రూపాయలు అవసరం. అంతడబ్బు ప్రభుత్వం దగ్గర లేవన్నది వాస్తవం.

ఇక్కడే జగన్ అనుసరిస్తున్న మోడల్ వైపు రేవంత్ చూపు పడింది. అదేమిటంటే 2019 ఎన్నికల్లో నవరత్నాల రూపంలో అనేక సంక్షేమపథకాలను హామీఇచ్చారు. అధికారంలోకి పథకాల అమలుకు డబ్బులు లేవు. అందుకని బాగా ఆలోచించి పథకాల అమలు మొత్తానికి కలిపి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే కార్పొరేషన్ను ఏర్పాటుచేశారు. కొన్ని శాఖల్లోని ఆస్తులను జగన్ ప్రభుత్వం ఈ కొర్పొరేషన్ పరిధలోకి తీసుకొచ్చింది. ఆ శాఖల ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని చూపించి బ్యాంకుల్లో అప్పులుచేసింది. ఆ అప్పులతో నవరత్నాలను అమలుచేస్తు, శాఖల ద్వారా వస్తున్న ఆదాయాలతో బ్యాంకుల్లో తీసుకున్న అప్పులకు అసలు, వడ్డీని కట్టేస్తోంది. ఈ పద్దతిలోనే జగన్ ఐదేళ్ళు నవరత్నాలను అమలుచేశారు. ఇపుడు అదే పద్దతిలో రైతురుణమాఫీ కోసం ప్రత్యేకంగా (తెలంగాణా స్టేట్ ఫార్మర్స్ వెల్ఫేర్ కార్పొరేషన్’ పేరుతో కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

ఈ కార్పొరేషన్ను ఏర్పాటుచేసి వ్యవసాయ శాఖ ద్వారా వస్తున్న ఆదాయాన్ని గ్యారెంటీగా చూపించి బ్యాంకుల్లో అప్పులు తీసుకుని ఒకేసారి రైతురుణమాఫీ చేయాలన్నది రేవంత్ ఆలోచన. ఆగష్టు 15వతేదీకి రుణమాఫీ చేయకపోతే రేవంత్ పరువుపోవటం ఖాయం. అందుకనే ఏ పద్దతిలో అయినా సరే రుణమాఫీ జరిగిపోవాలని వ్యవసాయ, ఆర్ధికశాఖ ఉన్నతాధికారులను రేవంత్ స్పష్టగా ఆదేశించారు. రుణమాఫీకి అవసరమైన మార్గాలను వెతకాలని చెప్పారు. రుణమాఫీ కోసమే ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ని ప్రభుత్వం ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నది. ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్నికల కోడ్ ఎత్తేయగానే రుణమాఫీకి సంబంధించి రేవంత్ ఉన్నతాధికారులతో సమావేశమవబోతున్నారు. అప్పుడే రైతు సంక్షేమ కార్పొరేషన్, ఎస్పీవీ, ఏపీ మోడల్ లాంటి అంశాలపై నిర్ణయాలుంటాయి.

రుణమాఫీకి రేవంత్ ప్రభుత్వం కట్ ఆఫ్ డేట్ గా 2019, ఏప్రిల్ 1 నుండి 2023 డిసెంబర్ 10వ తేదీని పెట్టుకున్నది. పై సంవత్సరాల మధ్య వ్యవసాయం కోసం రైతులు చేసిన రుణాలను మాత్రమే రద్దుచేయాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయానికి, అప్పులకు అసలు పొంతనే లేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. గత ప్రభుత్వం దొరికినచోటల్లా 7, 8 శాతం వడ్డీకి అప్పులు తెచ్చినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ ప్రభుత్వం ఆర్ధికసంస్ధలతో 3 శాతం వడ్డీకే అప్పులు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాయి. 3 శాతం వడ్డీకి అప్పులు తెచ్చి 8 శాతం వడ్డీకి తెచ్చిన అప్పులను క్లియర్ చేయాలని ఆలోచిస్తున్నది. దీనివల్ల వడ్డీలభారం తగ్గటంతో పాటు చేసిన అప్పుల్లో అసలు కూడా వీలైనంతగా తగ్గుతుందని చెప్పాయి.

ప్రభుత్వవర్గాల సమాచారం ప్రకారం 25 వేల రూపాయల లోపు అప్పులు తీసుకున్న రైతులు 2.96 లక్షలమంది ఉన్నారు. రు. 25-రు. 50 వేలమధ్య అప్పులున్న రైతుల సంఖ్య 5.72 లక్షలు. రు. 50వేలు-రు. 75 మధ్య రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 7 లక్షలు. 75 వేల రపాయల నుండి లక్షమధ్య అప్పుతీసుకున్న రైతుల సంఖ్య 21 లక్షలున్నట్లు తేలింది. సుమారు 37 లక్షలమంది రైతులు తీసుకున్న అప్పులు సుమారు రు. 25 వేల కోట్లయితే దానిపైన వడ్డీతో కలిసి సుమారు రు.35-40 వేలకోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సుంటుంది. అధికారంలోకి రావటమే టార్గెట్ గా హామీ ఇచ్చేసిన రేవంత్ రెడ్డి ఇపుడు ఆ హామీ అమలుకు కిందామీదా పడుతున్నారు. మరి ఈ సమస్య నుండి ఏ విధంగా బయటపడతారో చూడాల్సిందే.

Tags:    

Similar News