బీఆర్ఎస్ లో కొత్త జోష్ కనబడుతోందా ?
ఫిరాయింపు ఎంఎల్ఏల వ్యవహారంపై సుప్రింకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు కచ్చితంగా బీఆర్ఎస్ లో జోష్ నింపేదే అనటంలో సందేహంలేదు;
ఫిరాయింపు ఎంఎల్ఏల వ్యవహారంపై సుప్రింకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు కచ్చితంగా బీఆర్ఎస్ లో జోష్ నింపేదే అనటంలో సందేహంలేదు. బీఆర్ఎస్(BRS) తరపున గెలిచి కాంగ్రె(Congress)స్ లోకి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏల మీద ఎలాగైనా అనర్హత వేటు వేయించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అనర్హత వేటు వేయించే విషయంలో ఇదివరకు హైకోర్టులో దాఖలుచేసిన పిటీషన్లు డిస్మిస్ అయ్యాయి. దాంతో కేటీఆర్ వెంటనే సుప్రింకోర్టులో మరోసారి పిటీషన్లు వేయించారు. ఈ పిటీషన్లను విచారించిన సుప్రింకోర్టు సోమవారం విచారణ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కేసును విచారిస్తున్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్ర ధర్మాసనం తెలంగాణ అసెంబ్లీ తరపున వాదించిన లాయర్ ముకుల్ రోహిత్గీ పై సీరియస్ అయ్యింది. సమాధానం చెప్పటానికి గడువు కావాలని, ఫిరాయింపు ఎంఎల్ఏలకు నోటీసులు ఇచ్చే విషయంలో సమయం కావాలని, ఫిరాయింపుల అనర్హత ఫిర్యాదులను విచారించేందుకు తగిన సమయం కావాలని రెగ్యులర్ గా అడగటంపై తీవ్ర వ్యాఖ్యలుచేసింది.
రీజనబుల్ టైం అంటే ఎంతని రోహిత్గీని నిలదీసింది. తగిన సమయం అంటే ఎంత ? గడువుకావాలంటే ఎంత కాలం అంటు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. తగిన సమయం అన్నా, కొంత గడువు కావాలని అన్నపుడు సమయం, గడువు అంటే ఎన్నిరోజులో కచ్చితంగా చెప్పాల్సిందే అని అడిగింది. ఒకవేళ అసెంబ్లీ తరపు లాయర్ చెప్పకపోతే గడువు అంటే ఎన్నిరోజులన్న విషయాన్ని ధర్మాసనమే చెబుతుందని హెచ్చరించింది ధర్మాసరం. తర్వాత రోహిత్గీ రిక్వెస్టు కారణంగా విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదావేసింది. రాజకీయపార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే చూస్తు ఊరికునేదిలేదని ఘాటుగా చెప్పింది. నిర్ణయం తీసుకోవటానికి గడువనేది ఉంటుందని అభిప్రాయపడింది.
కేసువిచారణ చివరకు ఏమవుతుందో తెలీదు కాని సోమవారం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతల్లో జోష్ పెరిగిపోతోంది. అది ఏస్ధాయిలో ఉందంటే పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల మీద అనర్హత వేటు ఖాయమని, పదినియోజకవర్గాల్లో ఉపఎన్నికలు తప్పవని, ఉపఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ ఫుల్ స్వీప్ చేసేస్తుందని కేటీఆర్ పదేపదే చెబుతున్నారు. సుప్రింకోర్టు తాజా వ్యాఖ్యల నేపధ్యంలో ఏ క్షణమైనా ఉపఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి పార్టీ అభ్యర్ధులను గెలిపించేందుకు ప్రజాప్రతినిధులు, మాజీమంత్రులు, మాజీలు, సీనియర్ నేతలు, క్యాడర్ సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చేస్తున్నారు.
ఫిరాయింపులు వీళ్ళే
ఇప్పటివరకు బీఆర్ఎస్ తరపున గెలిచిన 10 మంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు, జగిత్యాల నుండి డాక్టర్ సంజయ్ కుమార్, గద్వాల నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్ చెరు నుండి గూడెం మహిపాల్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎంఎల్ఏ టీ ప్రకాష్ గౌడ్, ఖైరతాబాద్ నుండి దానంనాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి, చేవెళ్ళ నుండి కాలే యాదయ్య, శేరిలింగంపల్లి అరెకపూడి గాంధీ, బాన్సువాడ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డి అనర్హత పిటీషన్లపై విచారణ జరుగుతోంది. నిజానికి పదేళ్ళ అధికారంలో కేసీఆర్(KCR) ఫిరాయింపులకు పాల్పడినట్లు గతంలో ఎవరూ పాల్పడలేదు. పదేళ్ళ హయాంలో టీడీపీ(TDP), కాంగ్రెస్ నుండి కేసీఆర్ 18 మంది ఎంఎల్ఏలు, 23 మంది ఎంఎల్సీలు, నలుగురు ఎంపీలను బీఆర్ఎస్ లోకి లాక్కున్నారు.
కేసీఆర్(KCR) ప్రోత్సహించిన పార్టీ ఫిరాయింపులపై అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ స్పీకర్ కు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఉపయోగంలేకపోయింది. ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత వేటువేయాలని టీడీపీ, కాంగ్రెస్ హైకోర్టులో కేసులు వేసినా ఉపయోగంకనబడలేదు. పదేళ్ళ అధికారంలో కేసీఆర్ ఫిరాయింపులకు ఏనాడు అడ్డుచెప్పని కేటీఆర్, హరీష్ రావులు ఇపుడు తాము శుద్ధపూసలమన్నట్లుగా మాట్లాడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రతిపక్షమన్నదే లేకుండా చేయాలన్న ఉద్దేశ్యంతోనే కేసీఆర్ టీడీఎల్పీ, సీఎల్పీలను బీఆర్ఎస్ లో కలిపేసుకున్నారు. అప్పట్లో కేసీఆర్ చేసింది రాజకీయ వ్యూహంలో భాగమైతే ఇపుడు రేవంత్(Revanth) చేస్తున్నది అరాచకమని కేటీఆర్ ఆరోపిస్తుండటమే విచిత్రం.