కరెంట్ షాక్‌లకు అందరూ బాధ్యులే..
పోయిన ప్రాణాలకు బాధ్యులెవరంటూ ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు.;
తెలంగాణలో కేబుళ్ల తొలగింపు ప్రక్రియ రాష్ట్ర హైకోర్టుకు చేరింది. యుద్ధప్రాతిపదికన కేబుళ్లను అధికారులు తెలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు ఇంటర్నెట్ ఆపరేటర్ల కేబుళ్లను కూడా విద్యుత్ శాఖ సిబ్బంది కట్ చేసేశారు. వీటిలో ప్రముఖ టెలికాం సంస్థలైన భారతి ఎయిర్‌టెల్, జీయో కూడా ఉన్నాయి. వీటితో పాటు అనేక స్థానిక నెట్ ప్రొవైడర్లు కూడా ఉన్నారు. ఒక్కసారిగా కేబుళ్ల తొలగింపు చేపట్టడంతో వినియోగదారులు కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు.
మంగళవారం గంటల వ్యవధిలోనే దాదాపు 60వేల ఫిర్యాదులు వచ్చాయని నెట్ ఆపరేటర్లు పేర్కొన్నారు. ఇదే అంశంపై భారతి ఎయిర్‌టెల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం చేపట్టిన కేబుళ్ల తొలగింపును వెంటనే ఆపాలని, వాటిని తొలగించడానికి కాస్తంత సమయం ఇవ్వాలని కోరుతూ ఎయిర్‌టెల్ అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది.
ఎయిర్‌టెల్ దాఖలు చేసిన ఎమర్జెన్సీ పిటిషన్‌ను జస్టిస్ నగేష్ భీమపాక విచారించారు. కేబుళ్ల పునరుద్దరణ అనేది సమస్య కాదన్నారు. కానీ విద్యుదాఘాతంతో పోయిన ప్రాణాలకు ఎవరు బాధ్యులు? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘‘ప్రమాదాలకు ప్రతి ఒక్కరూ బాధ్యులే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, సర్వీస్ ప్రొవైడర్లు ఇలా ప్రతి ఒక్కరూ చేతులు దులిపేసుకుంటే ఎలా? రామాంతపూర్ దుర్ఘటనకు ప్రతి ఒక్కరూ బాధ్యులే. మనుషులంటే కాస్త దయ చూపాలి’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
డబ్బు చెల్లిస్తున్నాం: పిటిషనర్
తమ కేబుళ్ల కోసం విద్యుత్ స్తంభాలను వినియోగించుకుంటున్నందుకు డబ్బులు చెల్లిస్తున్నామని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇప్పుడు కనిపించిన కేబుల్‌ను కనిపించినట్లు కట్ చేస్తూ పోతున్నారని అన్నారు. దీని వల్ల తమ వినియోగదారులు ఇంటర్‌నెట్ అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అయితే ప్రజల ప్రాణాలు పోతుంటే ఇంటర్‌నెట్ సేవలు ఎందుకంటూ టీజీఎస్పీడీసీఎల్ తరపు న్యాయవాది అన్నారు. ఈ సందర్భంగానే కరెంటు స్తంభాలకు పరిమితికి మించిన సంఖ్యలో కేబుళ్లు ఉన్నాయని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కేబుళ్ల తొలగింపుపై టీజీఎస్పీడీసీఎల్, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
డిప్యూటీ సీఎం ఆదేశాలతోనే తొలగింపు..
విద్యుత్ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనుమతులు లేకుండా ఉన్న అన్ని విద్యుత్ కనెక్షన్లను తొలగించాలని చెప్పారు. అదే విధంగా కేబుల్ వైర్లు తొలగించడానికి ఏడాది సమయం ఇచ్చినా ఆపరేటర్లు స్పందించలేదని, వాటిని కూడా తొలగించాలని వెల్లడించారు. వారి నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అనేక ప్రాంతాల్లో విద్యుత్ శాఖ సిబ్బంది చర్యలు చేపట్టింది. స్తంభాలకు ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుళ్లను తొలగిస్తోంది. ఈ స్పెషల్ డ్రైవ్ పది రోజుల పాటు సాగుతుందని అధికారులు చెప్పారు.
అసలు జరిగిందిందే..
హైదరాబాద్‌లో కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు కరెంట్ షాక్ ఘటనలు సంభవించాయి. వీటిలో రామాంతపూర్‌లో గోకులాష్టమి సందర్భంగా జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు అక్కడిక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరోప్రాంతంలో వినాయకచవితి కోసం పందిరి కడుతున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ఇటువంటి ఘటనలు రోజూ వెలుగు చూస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. కరెంటు స్తంభాలపై అడ్డదిడ్డంగా ఉన్న వైర్లను తొలగించే పని చేపట్టారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో కేబుళ్ల తొలగింపులో అధికారులు వేగం పెంచారు.