ప్రభుత్వ కార్యాలయాల ప్రక్షాళన చేస్తాం.. సీఎం రేవంత్ హామీ

అభివృద్ధిని అడ్డుకునే వారంతా శత్రువులే. అలాంటి వారిని నిలువరించాల్సిన బాధ్యత ప్రజలదేనన్న రేవంత్.;

Update: 2025-08-20 11:56 GMT

రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయని, ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని ప్రక్షళాన చేసత్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం సంపూర్ణ ప్రక్షాళనను అతిత్వరలో చేపడతామని చెప్పారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు రూపుదిద్దుకోవాలని చెప్పారు. గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (TALIM) సమీపంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ భవనంతో పాటు సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల భవన సముదాయాలకు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగానే భవన సముదాయాల నిర్మాణ సామగ్రిని పరిశీలించారు. అనంతరం 'ప్రజా పాలన – ప్రగతి బాట' సభలో పాల్గొన్నారు.ప్రభుత్వ కార్యాలయాల ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవం, మధ్య తరగతి ప్రజలకు రాజీవ్ స్వగృహ గృహ నిర్మాణం, నైట్ ఎకానమీని పెంచుతూ విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి సంబంధించిన ప్రణాళికలను సమగ్రంగా వివరించారు. “ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలున్నా ప్రభుత్వ కార్యాలయాలు సరిగా లేవు. ఏటా 15 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చే స్టాంపులు - రిజిస్ట్రేషన్ శాఖకు ప్రజలు కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్నారు’’ అని తెలిపారు.

‘‘ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుతున్న వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వస్తే వారిని ఏదో తప్పు చేసిన దోషుల్లా చూసే పరిస్థితి ఉంది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటే, సదుపాయాలు లేక దారుణంగా ఉన్నాయి. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సంవత్సరానికి 19 లక్షల డాక్యుమెంట్లు చేస్తున్నారు. ఈ కార్యాలయాల్లో వసతులు పెంచడం వల్ల ప్రభుత్వానికి ఆదాయమే కాకుండా గౌరవం కూడా పెరుగుతుంది. ప్రపంచంతో పోటీ పడే విధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ కార్యాలయాలు రూపుదిద్దుకోవాలి. గచ్చిబౌలిలో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వచ్చే రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. కార్యాలయాలాల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించి గంటల కొద్ది నిరీక్షించే పనిలేకుండా టైమ్ స్లాట్ ప్రకారం పనులు ప్రజలకు పనులు పూర్తి కావాలి’’ అని కోరారు.

‘‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అపర్ణ గ్రూప్ 30 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ కార్యాలయం నిర్మాణానికి ముందుకు రావడం పట్ల సంస్థ ఎండీ ఉదయ్‌కి మనస్ఫూర్తిగా అభినందనలు. మిగతా కార్యాలయాలను కూడా ఇదే స్ఫూర్తితో మంత్రులు చొరవ తీసుకుని పూర్తయ్యేలా చూడాలి. వచ్చే పదేళ్లలో ప్రపంచమంతా హైదరాబాద్ నగరాన్ని చూడటానికి వచ్చే విధంగా తీర్చిదిద్దుతాం. గత పాలకులు కొంత పరిమితితో కూడిన దృక్పథంతో ముందుకు వెళ్లారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం విశాల దృక్పథంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో అభివృద్ధిని అడ్డుకునే వారంతా శత్రువులే. అలాంటి వారిని నిలువరించాల్సిన బాధ్యత ప్రజలదే’’ అని అన్నారు.

‘‘గడిచిన కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఆగిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లయ్యే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా రాష్ట్రం ఎదగాలని తెలంగాణ రైజింగ్ 2047 (Telangana Rising 2047) దార్శనికతతో ముందుకు వెళుతున్నాం. మూసీ ప్రక్షాళన (Musi Rejuvenation), భారత్ ఫ్యూచర్ సిటీ (Bharath Future City) నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదు. ఒకనాడు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడితే అదెందుకు. కార్లు ఉన్న వారికోసమా అని అవహేళన చేశారు. హైదరాబాద్ నీటి సమస్యతో గతంలో ఖాళీ కుండల ప్రదర్శనలు కనిపించేవి. తాగునీటి సమస్య పరిష్కారానికి కృష్ణా నదీ జలాలను తరలించగా, అవి కూడా సరిపోకపోవడంతో, గోదావరి, మంజీరా జలాలను తరలించడం జరిగింది’’ అని గుర్తు చేశారు.

‘‘హైదరాబాద్ అభివృద్ధికి చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అందుకే మన టార్గెట్ బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ నగరాలతో కాదు. న్యూయార్క్, సింగపూర్, టోక్యో నగరాలతో పోటీ పడదలచుకున్నాం. అందుకు మనకు చేతనవుతుంది. మన దగ్గర సాంకేతిక నైపుణ్యం ఉంది. కావలసింది చిత్తశుద్ధి మాత్రమే. మిగతా రాష్ట్రంలో సబర్మతీ, యమునా, గంగా నదులను ప్రక్షాళన చేస్తున్నప్పుడు హైదరాబాద్ నగర ప్రతిష్టను పెంచే మూసీ నది ప్రక్షాళన చేపడితే ఎందుకు అడ్డుపడుతున్నారు. ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ. దాన్ని గోల్డ్ సిటీగా మార్చాలి. మూసీని పునరుజ్జీవింపజేసి నైట్ ఎకానమీని పెంచాలని అనుకుంటున్నాం. ఆ ప్రాంతంలో వ్యాపారాలు వృద్ధి చెందాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అలాగే సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు వ్యాపారాలు సాగేలా నైట్ ఎకానమీని వృద్ధి చేయాలి’’ అని తెలిపారు.

‘‘నైట్ ఎకానమీ వృద్ధి సాధించాలంటే ఎలివేటెడ్ కారిడార్ రావాలి. 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించి 365 రోజుల పాటు మూసీలో నీరు ఉండే విధంగా రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసి, ఆర్థికంగా తెలంగాణ ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నగరాల్లో మధ్య తరగతికి రాజీవ్ స్వగృహ ద్వారా సరసమైన ధరలకు ఇళ్లు కట్టుకోవడానికి వీలు కల్పించాలి. అందుకు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి ప్రణాళికలు రూపొందించాలి. మధ్య తరగతి గురించి ఆలోచన చేయాలి. వారికి సొంతింటి కల నెరవేరాలంటే నగరం విస్తరణ ఇవసరం. మెట్రో, రీజినల్ రోడ్డు, మూసీ ప్రక్షాళన వంటివి జరగాలి’’ అని అన్నారు. ‘‘ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధిస్తున్న తరుణంలో హైదరాబాద్ నగరాన్ని మురికి కూపంగా, చెత్త చెదారం పేరుకుపోయిన నగరంగా, నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్యలతో అలాగే వదిలేయడానికి వీలులేదు. ఒక గొప్ప విశ్వనగరంగా రూపుదిద్దుకోవాలి..” అని అన్నారు.

Tags:    

Similar News