‘వ్యూహం’ నిర్మాత అరెస్ట్
హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలింపు;
‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో నమోదైన ఫిర్యాదుతో ఆయన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వివాదాస్పద సెటైరికల్ పొలిటికల్ డ్రామా తో కూడుకున్న చిత్రం వ్యూహం. ఈ చిత్రానికి నిర్మాత దాసరికిరణ్ ను పటమట పోలీసులు బుధవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం విజయవాడకు తరలించారు. విజయవాడకు చెందిన గాజుల మహేష్ ఫిర్యాదు మేరకు దాసరి కిరణ్ పై చీటింగ్ కేసు నమోదైంది.
వివరాలలోకి వెళ్తే.. దాసరికిరణ్ గాజుల మహేశ్ ట్రావెల్ వ్యాపారి. రెండేళ్లక్రితం దాసరికిరణ్ తన వద్ద నుంచి రూ 4.5 కోట్లు అప్పుగా తెచ్చుకున్నాడని పోలీసులకు గాజుల మహేశ్ ఫిర్యాదు చేశాడు. ఈ డబ్బును తిరిగి ఇవ్వాలని అనేక పర్యాయాలు గాజుల మహేష్ కోరినప్పటికీ దాసరి కిరణ్ పట్టించుకోలేదు అని పోలీసులు తెలిపారు. దీంతో గాజుల మహేష్ తన భార్యతో కల్సి విజయవాడ లోని దాసరి కిరణ్ కార్యాలయానికి ఈ నెల 18న వెళ్లారు.డబ్బులు తిరిగివ్వాలని కోరినప్పటికీ అక్కడ దంపతులపై కిరణ్ అనుచరులు 15 మంది దాడి చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. గాజుల మహేశ్ దంపతుల ఫిర్యాదుమేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దాసరి కిరణ్ వంగవీటి, వ్యూహం, జీనియస్, సిద్దార్థ వంటి చిత్రాలను నిర్మించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాసరి కిరణ్ వీరాభిమాని అని ప్రచారంలో ఉంది. జగన్ ప్రభుత్వం 2022లో దాసరి కిరణ్ ని టిటిడి బోర్డు సభ్యులుగా చేసింది. వ్యూహం సినిమాలో అప్పటి ప్రతిపక్షనేతలైన చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లను నెగెటివ్ కోణంలో చిత్రీకరించడంతో వివాదాస్పదమైంది. చిత్రం రిలీజ్ కాకమునుపే వ్యూహం సినిమా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అభ్యంతరకరమైన సన్నివేశాలపై నారాలోకేశ్ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. హైకోర్టు జోక్యంతో చిత్రం విడుదలైనప్పటికీ పెద్దగా విజయం పొందలేదు.