42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఏర్పాటు
42 శాతం కోటాకోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్త: మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య
వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ల కోసం కలిసి వచ్చే బీసీ, కుల సంఘాల నేతలతో ప్రత్యేకంగా 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి ఏర్పాటు చేశారు. మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు ,బాల రాజు గౌడ్,విశారదన్ మహారాజు గారి నేతృత్వంలో ఈ సమితి ఏర్పాటయింది. త్వరలో ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడంతోపాటు, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారీగా రథయాత్ర నిర్వహించడమే కాకుండా 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు.
తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సోమవారం 42% బీసీ రిజర్వేషన్లు - ఉద్యమ కార్యాచరణ అంశంపై బీసీ మేధావులు, అడ్వకేట్లు, బీసీ సంఘాలు, కుల సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేశారని చెన్న శ్రీకాంత్ బీసీ, బీసీ ఇంటెలెక్చ్యువల్ ఫోరమ్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు తెలిపారు
సమావేశంలో ప్రసంగిస్తూ బీసీ రిజర్వేషన్ల కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య హెచ్చరించారు.
కేవలం రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ తో మాత్రమే బీసీ రిజర్వేషన్లకు రక్షణ ఉంటుందని తాము మొదట్నుంచి చెబుతున్నామని వక్తలు ముక్తకంఠంతో చెప్పారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర చేసి ప్రజలను చైతన్యం చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని వారు ఆరోపించారు.
రాజ్యాంగపరమైన రక్షణలు తీసుకోకుండా జీవోలతో రాజకీయ పార్టీలు డ్రామాలు చేస్తున్నాయని ఈశ్వరయ్య ధ్వజమెత్తారు.
దేశంలోనే చాలా రాష్ట్రాలలో జీవోలతో రిజర్వేషన్లు తెచ్చే ప్రయత్నం జరిగిందని, వాటిని కోర్టులు కొట్టివేశాయని ఈ అనుభవముతోనే 9వ షెడ్యూల్లో చేర్చడం ఒకటే పరిష్కారమని, జీవోలతో ఎన్నికలు నిర్వహిస్తే వాటికి చట్టబద్ధత ఉండదని, కోర్టులు కొట్టివేస్తాయని 'బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం' చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ టీ. చిరంజీవులు పేర్కొన్నారు.
మండల్ కమిషన్ నుంచి నేటి వరకు బిజెపి బీసీ రిజర్వేషన్లకు దారుణంగా అడ్డుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పనిసరిగా స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను వర్గీకరించి,అత్యంత వెనుక బడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
బీసీల రిజర్వేషన్ల సాధనకై అతిపెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంతో ప్రజలతో నిర్మిస్తామని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ అన్నారు. ఈ సందర్భంగా బీసీల రిజర్వేషన్ల కోసం కొట్లాడే అందరి సమన్వయంతో కలిసి పనిచేస్తామని తెలిపారు.
ఇతర రాజకీయ పార్టీలతో అంట కాగుతూ బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి నాయకత్వం వహించే వారిని తాము ఎలా నమ్ముతామని తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ అన్నారు.