మోదీ అనుకుంటే తప్ప సాధ్యంకాదా ? బీజేపీదే బాధ్యత
రిజర్వేషన్ల అంశం రాష్ట్రప్రభుత్వ పరిధిలోనిది కాదు పూర్తిగా కేంద్రం పరిధిలోని అంశం కాబట్టే...
నరేంద్రమోదీ అనుకుంటే మాత్రమే బీసీలకు స్ధానికసంస్ధల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు సాధ్యమవుతాయి. మోదీ(Narendra Modi) అనుకోకపోతే తెలంగాణలో ఎంతమంది ఎంతమొత్తుకున్నా అంగుళంకూడా రిజర్వేషన్ల సాధన వ్యవహారం ముందుకుసాగదు. ఎందుకంటే రిజర్వేషన్ల అంశం రాష్ట్రప్రభుత్వ పరిధిలోనిది కాదు పూర్తిగా కేంద్రం పరిధిలోని అంశం కాబట్టే. బీసీలకు రిజర్వేషన్ల(BC Reservations) పెంపువిషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు అసెంబ్లీ, మండలిలో తీర్మానాలు చేసినా, బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించినా, రాష్ట్రపతి, గవర్నర్ల దగ్గరకు బిల్లులు పంపినా, ఆర్డినెన్సులు జారీచేసినా ఆవగింజంత విలువకూడా ఉండదు. ఎన్నిసార్లు కోర్టుతలపులు తట్టినా ఎలాంటి ఉపయోగం ఉండదు. మోదీ అనుకున్నపుడు మాత్రమే తెలంగాణ(Telangana)నుండి వచ్చిన బిల్లును పార్లమెంటులో చర్చకు పెట్టి, ఆమోదించి, సవరణలుచేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చినపుడే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలవుతాయి లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఎంత గొడవచేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు.
మోదీ అనుకోవాలంటే ముందుగా తెలంగాణలోని బీజేపీఎంపీలు, ముఖ్యంగా కేంద్రమంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలి. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అడుగుతున్నట్లుగా మోదీ గనుక అపాయిట్మెంట్ ఇవ్వగలిగితే సమస్య పరిష్కారానికి ముందడుగు పడినట్లవుతుంది. ఎలాగంటే మోదీ గనుక అపాయిట్మెంట్ ఇస్తే రేవంత్ ఆధ్వర్యంలో అఖిలపక్షం కలుస్తుంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయాల్సిన అవసరాన్ని వివరిస్తుంది. రాష్ట్రపతి దగ్గర పెండింగులో ఉన్న బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదించి, రాజ్యాంగసవరణ చేసి 9వ షెడ్యూల్ లో చేర్చమని అఖిలపక్ష భేటీలో రేవంత్ అడుగుతారు.
మోదీ సానుకూలంగా ఉంటే అప్పుడు బిల్లుకు మోక్షంవచ్చి సరైనదారిలో ప్రయాణిస్తుంది. లేకపోతే ఎంతకాలమైనా పార్టీలు ఒకదానిపై మరొకటి బ్లేమ్ గేమ్ ఆడుకోవాల్సిందే తప్ప రిజర్వేషన్ల అమలు సాధ్యంకాదు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు అవ్వాలంటే బాధ్యత బీజేపీ మీదనే ఎక్కువుంది. తెలంగాణ ప్రభుత్వం మోదీ అపాయిట్మెంట్ అడుగుతున్నా అటునుండి సానుకూల స్పందన కనబడటంలేదు. కాబట్టే ఢిల్లీకి అఖిలపక్షాన్ని రేవంత్ తీసుకుని వెళ్ళలేకపోతున్నాడు. మోదీ అపాయిట్మెంట్ కోసం కిషన్ రెడ్డి, బండి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ కే లక్ష్మణ్ గట్టిగా ప్రయత్నిస్తే సాధ్యమవుతుంది.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు క్రెడిట్ అంతా రేవంత్ ప్రభుత్వానికే దక్కుతుందని అనుకుంటే అందుకు సారధ్య బాధ్యతను కేంద్రమంత్రులే తీసుకుని క్రెడిట్ బీజేపీ ఖాతాలోనే వేసుకోవచ్చు. కేంద్రమంత్రులే మోదీ దగ్గరకు తెలంగాణ నుండి అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్ళి రిజర్వేషన్ల అమలుకు ప్రధానిని ఒప్పించవచ్చు. మోదీ అపాయిట్మెంట్ తీసుకోవటమే కీలకం కాని రేవంత్ తీసుకున్నారా లేకపోతే కేంద్రమంత్రులు తీసుకున్నారా అన్నది ఇంపార్టెంట్ కాదు.
హైకోర్టు స్టే ఇవ్వటంపై సుప్రింకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేయాలని రేవంత్ అడ్వకేట్ జనరల్ ను ఆదేశించినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవు. ఎందుకంటే మొత్తం రిజర్వేషన్లు 50శాతంకు మించకూడదని గతంలో తానే ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా సుప్రింకోర్టు ఇపుడు నడుచుకోదు. హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తుందనే నమ్మకం కూడా ఎవరిలోను లేదు. రిజర్వేషన్లకు సంబంధించి రెండేమార్గాలు కనబడుతున్నాయి. మొదటిది మోదీని ఒప్పించి రాజమార్గంలో చట్టం చేసుకోవటం. ఇక రెండోమార్గం పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించటం. పార్టీపరంగా రిజర్వేషన్లు అమలుచేయటం కన్నా చట్టబద్దత కల్పించటమే భేషైన మార్గం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన బిల్లుకు కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తుందా ? అన్నదే కీలకమైన అంశం. రిజర్వేషన్లకు చట్టటబద్ధత రావాలంటే నరేంద్రమోదీ అనుకుంటే మాత్రమే సాధ్యమవుతుంది.