మరో వివాదంలో కొండా సురేఖ
మంత్రి పొంగులేటిపై రేవంత్ రెడ్డికి ఫిర్యాదు
వివాదాలకు మంత్రి కొండా సురేఖ కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. స్వంత పార్టీ నేతలపై ఆరోపణలు చేసే ఆమె మరోసారి వివాదాల్లో మునిగిపోయారు. కొత్తగా మరో వివాదంలో కొండా సురేఖ ఇరుక్కున్నారు. ఈ సారి ఆమె రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి పొంగులేటిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మేడారం టెండర్లలో పొంగులేటి తన మనిషికి 71 కోట్ల రూపాయల టెండర్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కొండ సురేఖ ప్రధాన ఆరోపణ.
కొండ సురేఖకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో విభేధాలు రావడానికి ప్రధాన కారణం మేడారం జాతర టెండర్లు.
ఇటీవలె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించారు. జాతర అభివృద్ది పనులకు నిధులు కేటాయించారు.
తన శాఖకు సంబంధించి టెండర్లను స్వంత మనుషులకు దక్కించుకోవడానికి పొంగులేటి యత్నిస్తున్నట్టు ఆమె చేసిన ఆరోపణ పార్టీలో చర్చనీయాంశమైంది.దేవాదాయ శాఖ మంత్రి హోదాలోనే కొండా సురేఖ రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో పార్టీలో ఆమెపై ఉన్న వ్యతిరేకత మరింత పెరిగే అవకాశమేర్పిడందని తెలుస్తోంది.
మరో వైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు భగ్గుమంటున్నాయి. మంత్రి కొండా సురేఖపై ఇతర ఎమ్మెల్యేలు ఫిర్యాదులు, విమర్శలు, ఆరోపణలతో గ్రూపుల పంచాయితీ అనేక మలుపు తిరుగుతున్నది. అధిష్ఠానం, పీసీసీ స్థాయిలో జోక్యం చేసుకొని హెచ్చరికలు చేసినా, నోటీసులిచ్చినా వరంగల్ ఉమ్మడి జిల్లాలో గ్రూపు రాజకీయ విభేదాలు ఆగడంలేదు. రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయులు కొండా ప్లెక్లీలను చించడంతో వివాదం అధిష్టానం దృష్టికి వెళ్లింది.
కొండా సురేఖ కూతురు సుస్మిత వచ్చే ఎన్నికలలో రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. ఆమె ఎంట్రీని రేవూరి ప్రకాశ్ రెడ్డి వ్యతిరేకిస్తున్నట్టు కొండా ఫ్యామిలీ భావిస్తోంది. సుస్మిత రాజకీయ రంగ ప్రవేశం మరోసారి వివాదాస్పదమైంది.
తాజాగా సుస్మిత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ రచ్చగా మారింది. రేవూరి ప్రాతినిద్యం వహిస్తున్న పరకాల నుంచి పోటీ చేస్తానని సుస్మిత పోస్ట్ పెట్టారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బసవరాజు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య వర్గీయులతో కొండా సురేఖకు అస్సలు పడదు.
గత నెలలో కొండా సురేఖపై కాంగ్రెస్ పార్టీ నేత, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. భధ్రకాళీ దేవాలయం ఆయన నియోజకవర్గంలోనే ఉంది. ఆలయపాలకమండలిలో కొండా జోక్యాన్ని నాయిని సహించలేకపోయారు. తన నియోజకవర్గంలో ఆమె పెత్తనమేమిటని ప్రశ్నించారు.
వివేక్ పై ఫిర్యాదు
గత నెలలోనే మంత్రి గడ్డం వివేక్ పై మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదుచేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మంత్రి కొండా సురేఖ అటవీ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అటవీ శాఖాధికారులతో మంత్రి వివేక్ సమీక్షా సమావేశం జరపడం కొండా సురేఖ కు మింగుడు పడలేదు.
వివేక్ ప్రాతినిద్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో పోడు భూములున్నాయి. అటవీశాఖకు చెందిన ఈ భూములపై మంత్రి వివేక్ సచివాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటివ్ ఆఫిసర్ ను పిలిపించుకుని వివేక్ సమావేశం ఏర్పాటు చేయడంపట్ల కొండా మండిపడ్డారు. తన ప్రమేయం లేకుండానే వివేక్ ఈ సమావేశం నిర్వహించినట్టు ఆమె ఆరోపణ.
తన నియోజకవర్గ అటవీ భూములకు సంబంధించి క్లియరెన్స్ ల కోసమే సమావేశం నిర్వహించినట్టు వివేక్ ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు.
నెల రోజుల వ్యవధిలో ఇద్దరు మంత్రులపై కొండా సురేఖ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో ఈ అంశాన్ని పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది.