ఓటర్లజాబితాలో రమేష్ పేరు తొలగించేందుకు 16 ఏళ్ళు పట్టింది

వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లజాబితాలో నుండి మాజీ ఎంఎల్ఏ చెన్నమనేని రమేష్ పేరును రెవిన్యు అధికారులు తొలగించారు;

Update: 2025-07-06 10:27 GMT
Former MLA Channamaneni Ramesh

అవును మీరు చదివింది నిజమే. ఎవరైనా ఓటర్ల జాబితాలో పేరు నమోదుచేయించుకునేందుకు అవస్తలు పడతారు కాని ఓటర్ల జాబితాలో పేరు తీయించేసుకుంటారా ? తొలగించేందుకు ఇన్ని కష్టాలా ? అందుకు 16 ఏళ్ళు పడుతుందా అనే అనుమానాలు చాలా సహజం. ఓటర్ జాబితా ఏమిటి ? పేరు తీయించేయటం ఏమిటనే విషయం తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. విషయం ఏమిటంటే వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లజాబితాలో నుండి మాజీ ఎంఎల్ఏ చెన్నమనేని రమేష్ పేరును రెవిన్యు అధికారులు తొలగించారు. మాజీ ఎంఎల్ఏ పేరును రెవిన్యు అదికారులు తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఏమొచ్చింది అంటే రమేష్ జర్మనీ పౌరుడని సుప్రింకోర్టు తీర్పిచ్చింది. నిబంధనల ప్రకారం ఒక పౌరుడికి రెండు దేశాల్లో పౌరసత్వం ఉండకూడదు. అందుకనే రమేష్ కు భారత పౌరసత్వం రద్దయ్యింది. పౌరసత్వం రద్దయ్యింది కాబట్టి వేములవాడ నియోజకవర్గం ఓటర్లజాబితాలో నుండి చెన్నమనేని రమేష్ పేరును రెవిన్యు అధికారులు తొలగించారు.

రమేష్ పేరును ఓటర్లజాబితాలో నుండి తొలగించేందుకు 16 ఏళ్ళు పట్టింది. ఈ 16 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ఎంఎల్ఏ ఆది శ్రీనివాస్ పట్టువదలని విక్రమార్కుడిలాగ న్యాయస్ధానాల్లో పోరాటం చేస్తే కాని మాజీ ఎంఎల్ఏ పేరును ఓటర్లజాబితాలో నుండి తొలగించటం సాధ్యంకాలేదు. ఈన్యాయపోరాటానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. అదేమిటంటే 2009లో చెన్నమనేని రమేష్ జర్మని నుండి వచ్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో టీడీపీ ఎంఎల్ఏగా పోటీచేసి గెలిచారు. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసింది ఆది శ్రీనివాసే. తర్వాత రమేష్ టీడీపీ(TDP) పార్టీతో పాటు ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేశారు. దాంతో 2010లో ఉపఎన్నికలు జరిగాయి. టీడీపీకి రాజీనామా చేసిన రమేష్ బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్(BRS) తరపున రమేష్ పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 2014, 2018లో కూడా గెలిచారు. మొత్తం నాలుగుసార్లు గెలిచిన రమేష్ పైన ఆది కోర్టులో ఒక పిటీషన్ వేశారు.

అదేమిటంటే ఎంఎల్ఏ రమేష్ పై అనర్హత వేటు వేయాలని పిటీషన్లో కోరారు. ఎందుకంటే రమేష్ జర్మనీ పౌరసత్వంతో పాటు భారతీయ పౌరసత్వం కూడా కలిగున్నాడని. రెండు దేశాల్లోనూ పౌరసత్వం ఉండటం మనదేశం చట్టాలకు విరుద్ధం. జర్మనీలో పౌరుడైన రమేష్ కు భారత్ పౌరసత్వం చట్టవిరుద్ధమని వాదించాడు. పౌరుడే కాని రమేష్ ఇక ఎన్నికల్లో ఎలాగ పాల్గొంటాడన్నది ఆది పాయింట్. మొదటి ఎన్నికలో రమేష్ గెలిచినపుడే ఆది కోర్టులో కేసు వేశారు. అప్పట్లోనే రమేష్ జర్మనీ పౌరుడని తేలిపోయింది. కాబట్టి రమేష్ ఎంఎల్ఏ గెలుపు కూడా చట్టవిరుద్ధమే అని న్యాయస్ధానం తేల్చేసింది. అయితే రమేష్ లాయర్ గట్టోడు కాబట్టి వేలికేస్తే కాలికి..కాలికేస్తే వేలికి అన్నట్లుగా ఏవేవో పాయింట్లు లాగిలాగి హైకోర్టు, సుప్రింకోర్టుల్లో సంవత్సరాల పాటు కేసును సాగదీశాడు. ఈ సాగదీతలోనే రమేష్ నాలుగుసార్లు ఎంఎల్ఏగా గెలిచేశాడు. 2023 ఎన్నికల్లో మాత్రం రమేష్ ఓడిపోయి ఆది శ్రీనివాస్ గెలిచాడు. రమేష్ జర్మనీ పౌరుడే అని చెప్పేందుకు అవసరమైన అన్నీఆధారాలను ఆది శ్రీనివాస్(MLA Aadi Srinivas) కోర్టుల్లో సమర్పించారు. అన్నీదారులు మూసుకుపోయిన తర్వాత చివరాఖరుకు, హైకోర్టు, సుప్రింకోర్టు రమేష్ జర్మనీ పౌరుడే అని తేల్చిచెప్పేశాయి. చట్టాలను తప్పుదోవ పట్టించిన కారణంగా, రమేష్ పై అలుపెరుగని న్యాయపోరాటంచేసిన ఆది శ్రీనివాస్ కు రు. 25 లక్షల రూపాయలు చెల్లించాలని సుప్రింకోర్టు తీర్పిచ్చింది. అలాగే కోర్టుఫీజులను కూడా రమేషే(Chennamaneni Ramesh) చెల్లించాలని ఆదేశించింది. దాంతో వేరేదారిలేక ఆదికి రమేష్ డబ్బులు మొత్తం చెల్లించాడు.

ఇక్కడితో రమేష్ వ్యవహారం ముగియలేదు. ఓటర్లజాబితాలో నుండి మాజీ ఎంఎల్ఏ పేరును తొలగించాలనే మరో పోరాటాన్ని ఆది చేస్తున్నాడు. ఈ కేసు కూడా చాలా సంవత్సరాలు న్యాయస్ధానాల్లో నలిగింది. రమేష్ జర్మనీ(Germany) పౌరుడే అని తేలిపోయింది కాబట్టి మొన్నటి జూన్ 24న హైకోర్టు ఆదేశాలతో రెవిన్యు అధికారులు ఓటర్లజాబితాలో పేరు తొలగింపుపై రమేష్ కు నోటీసు జారీచేశారు. జూలై 2వ తేదీలోగా సమాధానం చెప్పాలని నోటీసులో రెవిన్యు అధికారులు స్పష్టంగా చెప్పారు. అయితే నోటీసులకు రమేష్ ఎలాంటి సమాధానం చెప్పలేదు. దాంతో వేములవాడ నియోజకవర్గం ఓటర్లజాబితాలో నుండి రమేష్ పేరును రెవిన్యు అధికారులు తొలగించారు. ఈమేరకు రమేష్ ఇంటికి రెవిన్యు అధికారులు నోటీసును అంటించారు. మొత్తానికి ఆది శ్రీనివాస్ అలుపెరగని సంవత్సరాల పోరాటం ఫలితంగా రమేష్ పేరును ఓటర్లజాబితాలో నుండి అధికారులు తొలగించారు.

Tags:    

Similar News