బీఆర్ఎస్ కి జేడీ లక్ష్మీనారాయణ మద్దతు

నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మద్దతు ప్రకటించారు.

Update: 2024-05-22 14:35 GMT

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మద్దతు తెలిపారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి ఆయన మద్దతు ప్రకటించారు. ఈ మేరకు రాకేష్ రెడ్డికి ఓటేయాలంటూ ఓ వీడియో మెసేజ్ ద్వారా గ్రాడ్యుయేట్లకు పిలుపునిచ్చారు. జేడీ మద్దతు ప్రకటించడంపై రాకేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనకి మద్దతు ఇస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 

జేడీ మాట్లాడుతూ... "ఉన్నత విద్యావంతులు, యువకులు నిజాయితీ పరులు రాజకీయాల్లోకి రావాలని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఒక వ్యాపారం చెడిపోతే ఆ వ్యాపారి మాత్రమే నష్టపోతారు. ఒక వ్యక్తి ఆరోగ్యం చెడిపోతే ఆ శరీరానికి మాత్రమే నష్టం. కానీ, రాజకీయాల్లో చెడు వ్యక్తులు, స్వార్థ పరులు, మోసగాళ్ళు ఉంటే మాత్రం మొత్తం సమాజమే చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, ఉన్నత విద్యావంతులు, నిజాయితీ పరులు, ప్రజాసేవ పట్ల అంకితభావం గల యువత రాజకీయాల్లోకి రావాలి, రాణించాలి అని తపనపడే వారిలో నేనూ ఒకడిని. ఏనుగుల రాకేష్ రెడ్డి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి బిట్స్ పిలాని లాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించారు. గోల్డ్ మెడల్ కొట్టి, అమెరికాలో కోట్లు సంపాదించే కొలువులు కాదని ప్రజాసేవ కోసం వచ్చారు. అలాంటి నిజాయితీ పరులకు అండగా నిలవాలి. ఈ నెల 27 జరిగే ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 3 పై గల ఏనుగుల రాకేష్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఒక మంచి భవిష్యత్ నాయకుడిని గెలిపించాలని" జేడీ గ్రాడ్యుయేట్లను కోరారు.

ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న జేడీ...

జేడీ లక్ష్మినారాయణ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ తరపున ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీలో నిలబెట్టారు. ఆయన కూడా విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేశారు. పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ సన్నాహాల్లో ఉన్నారు. 

Tags:    

Similar News