మేధా స్కూల్ సీజ్
డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు కావడంతో విద్యాశాఖ నిర్ణయం;
సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్ పల్లిలోని మేధాస్కూల్ ను విద్యాశాఖాధికారులు ఆదివారం సీజ్ చేశారు. కరస్పాండెంట్ మల్లెల జయప్రకాశ్ గౌడ్, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు స్కూల్ మొదటి అంతస్థులో ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు ఈగల్ టీం గుర్తించిన నేపథ్యంలో విద్యాశాఖాధికారులు అప్రమత్తమై ఆదివాం హుటాహుటిన స్కూల్ కు చేరుకుని సీజ్ చేశారు. బాలానగర్ విద్యాశాఖ అధికారి హరీష్ చంద్ర ఆదేశాల మేరకు అధికారులు స్కూల్ ను శాశ్వతంగా సీజ్ చేశారు. అన్ని అనుమతులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మేధాస్కూల్ కేంద్రంగా డ్రగ్స్ తయారవుతున్నట్లు ఈగల్ టీంకు సమాచారమందింది.
మేధాస్కూల్ స్థానికంగా పాపులర్ అయిన స్కూల్. స్కూల్ లో మొత్తం 130 మంది విద్యార్థులు చదువుతున్నారు. నర్సరీ నుంచి 10వతరగతి వరకు మేధాస్కూల్ పాఠాలు బోధించేది. స్కూల్ సీజ్ కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం కూడా తల్లిదండ్రులు స్కూల్ కు చేరుకుని విద్యాశాఖాధికారులను తమ పిల్లల భవితవ్యం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థులను ఇతర స్కూల్స్ లో చేర్పించాలని విద్యాశాఖాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హామి ఇచ్చారు.
విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన స్కూల్ లో డ్రగ్స్ తయారీ జరుగుతుందన్న వార్త సంచలనమైంది. తొమ్మిదేళ్ల క్రితం బోయిన్ పల్లిలో భవనాన్ని అద్దెకు తీసుకున్న కరస్పాండెంట్ మల్లెల జయ ప్రకాశ్ గౌడ్ మొదటి అంతస్థును పూర్తిగా డ్రగ్ తయారీ కేంద్రంగా మార్చేశాడు. పగటి పూట స్కూల్ నడిచేది. పిల్లలు, టీచర్లు వెళ్లిపోయిన తర్వాత సాయంత్రం నుంచి తెల్లవారే వరకు స్కూల్ లో డ్రగ్స్ తయారు చేసేవారు. అల్ఫాజోలం అనే మత్తు పదార్థాన్ని తయారుచేసేవారు. పాఠశాల కరస్పాండెంట్ ఈ దందాకు తెరతీసినట్లు ఈగల్ టీంకు సమాచారం ఉంది.
శనివారం మధ్యాహ్నం స్కూల్లో తయారైన అల్ఫాజోలం మత్తు పదార్థాన్ని కస్టమర్లకు విక్రయించడానికి తీసుకుని వెళుతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని నుంచి 4.3 కిలోల అల్ఫా జోలం, 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
రెండు గదుల్లో తయారీ పరికరాలు కనిపించాయి. ఓల్డ్ బోయిన్ పల్లి గంగపుత్రకాలనీకి చెందిన గోటె మురళి సాయి, బోయిన్ పల్లి హస్మత్ పేటకు చెందిన పెంటమోల్ ఉదయ్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. పట్టు బడ్డ అల్ఫాజోలం విలువ మార్కెట్ లో 50 లక్షల వరకు ఉంటుంది.
కల్లు దుకాణాలకు సప్లై చేసేవాడు
బిటెక్ డిస్ కంటిన్యూ చేసిన స్కూల్ కరస్పాండెంట్ మల్లెల జయప్రకాశ్ గౌడ్ వనపర్తి వాస్తవ్యులు. మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలో ఉన్న కల్లు కంపౌండ్ లకు అల్ఫా జోలం సప్లయ్ చేసేవాడు. తయారీ ప్రక్రియను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మేధాస్కూల్ ప్రారంభించాడు. స్కూల్ లో డ్రగ్స్ తయారీ చేస్తే ఎవరికీ అనుమానం రాదని గ్రహించాడు. స్కూల్ తో సంబంధం లేని ఉదయ్ సాయి, మురళి సాయి అనే వ్యక్తులను చేర్చుకుని అల్ఫాజోలం తయారు చేయడం ప్రారంభించాడు. అల్ఫాజోలం తయారీకి వాడే ముడిసరుకు(కెమికల్స్), (ఇతర సామాగ్రి)ని రాత్రిపూట తెచ్చుకునేవాడు.
అల్ఫాజోలం మత్తు పదార్థాన్ని కేవలం కల్లు కంపౌండ్ లకే విక్రయించేవాడా, ఇతర రాష్ట్రాల్లో విక్రయించేవాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు