కేసీఆర్ కు ఉన్నట్లుండి కోర్టులు గుర్తొచ్చాయేమిటీ?

తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లుగా ఏకపక్షంగా, నిరంకుశంగా పాలన సాగించిన కేసీఆర్ వివిధ విషయాలపై తాజాగా కోర్టులను ఆశ్రయించే వైఖరి చేపట్టాడు.

Update: 2024-07-03 08:14 GMT

తెలంగాణ రాష్ట్రంలో జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వం లో ఏర్పడిన విద్యుత్ కమిషన్ ఇచ్చిన నోటీసులకు సకాలంలో జవాబు ఇవ్వకుండా, కమిషన్ పని తీరు పైనే అనేక ఆరోపణలు చేస్తూ, ఆయనకు లేఖ రాసి, మీడియాకు విడుదల చేసిన కేసీఆర్, తదనంతరం రాష్ట్ర హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్న విద్యుత్ కమిషన్ ను రద్ధు చేయాలని ఆ పిటిషన్ సారాంశం.

ఛత్తీస్ ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల నిర్మాణం విషయంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఈ విచారణా కమిషన్ ను ఏర్పాటు చేసింది. విచారణ క్రమంలో కమిషన్ ఆ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా నోటీసులు జారీ చేసింది. కమిషన్ అడిగే చాలా ప్రశ్నలకు ఆయన దగ్గర సరైన జవాబులు లేవని, ఆయన చేసిన తప్పులు, నేరాలు ప్రజల ముందు బట్టబయలు అవుతాయని ఆయనకు తెలుసు.

అందుకే కమిషన్ విచారణకు ముఖం చాటేస్తూ వచ్చిన కేసీఆర్, చివరికి కమిషన్ రద్ధు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను విచారించిన కోర్టు, విచారణ కమిషన్ పని తీరు సక్రమంగానే సాగుతుందని, కక్షసాధింపుతో వ్యవహరిస్తున్నట్లుగా ఆధారాలేమీ లేవవి తీర్పు ఇస్తూ.. కేసీఆర్ వేసిన పిటిషన్ ను కొట్టేసింది. కమిషన్ విచారణ కొనసాగింపుకు అనుమతి ఇచ్చింది.

కేసీఆర్ లో కొత్తగా కోర్టులను ఆశ్రయించే వైఖరి...

ఈ సందర్భంగా కొన్ని విషయాలను ప్రత్యేకంగా చర్చించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లుగా ఏకపక్షంగా, నిరంకుశంగా పాలన సాగించిన కేసీఆర్ వివిధ విషయాలపై తాజాగా కోర్టులను ఆశ్రయించే వైఖరి చేపట్టాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో నమోదైన రైల్వే కేసులో.. తాను ఆ సమయంలో అక్కడ లేనని, కనుక తనను కేసు నుంచి తప్పించాలని కోర్టును కోరుతూ ఇటీవల ఒక పిటిషన్ వేసిన విషయం మనం చూశాం.

తాను అధికారంలో ఉన్న పదేళ్ళ కాలంలో చట్టసభలు ఆమోదించిన చట్టాలను, కోర్టు తీర్పులను అమలు చేయాలనే స్పృహను ప్రదర్శించని కేసీఆర్ కి అకస్మాత్తుగా కోర్టుల ఉనికి గుర్తుకు రావడమే ఆశ్చర్యం.

చట్టాలను నీరు కార్చేస్తూ అన్యాయం...

కౌలు రైతుల గుర్తింపు కోసం అమలు చేయాల్సిన 2011 భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేయకుండా 2016 నుంచి కేసీఆర్ ఏకపక్షంగా నిలిపివేశాడు. పచ్చి దొర తనంతో ఆలోచించి చేసిన ఈ చర్య వల్ల, అప్పటి నుండీ ఇప్పటి వరకూ రాష్ట్రంలో లక్షలాది మంది కౌలు రైతులకు అన్యాయం జరుగుతూనే ఉంది.

2006 అటవీ హక్కుల చట్టాన్నికూడా పదేళ్ళ పాటు, ఆ చట్టం స్పూర్తితో అమలు చేయకుండా, చివరి సంవత్సరంలో తనకు తోచినట్లుగా అమలు చేసి ఆదివాసీలకు కేసీఆర్ అన్యాయమే చేశాడు.

2013 లో కేంద్రం తీసుకు వచ్చిన భూ సేకరణ చట్టాన్ని కూడా నీరు కార్చి, ఆ చట్టానికి 2015 లో తనకు తోచిన సవరణలు చేసి, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో, రైతుల నుంచి లక్షలాది ఎకరాల భూములను లాక్కున్నాడు. నిర్వాసితులకు అన్యాయం చేశాడు.

2016 లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన చట్టం ప్రకారం ఏర్పడిన వ్యవసాయ కుటుంబాల ఋణ విముక్తి కమిషన్ కు రిటైర్డ్ న్యాయమూర్తిని ఛైర్మన్ గా నియమించాల్సి ఉండగా, చట్ట సవరణ చేసి, తన పార్టీ నాయకులతో ఆ కమిషన్ సభ్యులను నింపి, స్వతంత్రంగా పని చేయాల్సిన కమిషన్ ను తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు.

కోర్టు తీర్పులనూ అపహాస్యం చేశారు...

కోర్టు కేసుల విషయంలో కూడా కేసీఆర్ తన పాలనా కాలంలో అలాగే వ్యవహరించారు. ఉదాహరణకు 2015 లో తెలంగాణ రైతు జేఏసీ, రాష్ట్ర వ్యవసాయ రంగ సంక్షోభంపై , రాష్ట్ర హైకోర్టు లో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఆ పిటిషన్ లోని అంశాలపై, సంబంధిత సమూహాలతో చర్చించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు, వ్యవసాయ కార్యదర్శి సమక్షంలో తూతూ మంత్రంగా ఒక సమావేశం నిర్వహించి, అప్పటి ప్రభుత్వం కోర్టు తీర్పును అపహాస్యం పాలు చేసింది. ఆ సమావేశంలో వచ్చిన ఏ సూచననూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు.

అలాగే 2020 లో భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం కోరుతూ రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కూడా ఒక సంవత్సరం పాటు విచారణ చేసి, రైతులకు అనుకూలంగా రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయకుండా సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెళ్ళింది. ఇప్పటి వరకూ ఆ కేసు తేలక లక్షలాది మంది రైతులకు అన్యాయమే జరిగింది.

అధికార పక్షంలో ఒకలా... ప్రతిపక్షంలో మరోలా...

కేసీఆర్ తన పాలనా కాలంలో ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీలతో, ప్రజా సంఘాలతో ఎప్పుడూ చర్చించి ఏ సమస్యలనూ పరిష్కరించలేదు. దశాబ్ధ కాలం పాటు అసలు ప్రజలకు తనను కలిసే అవకాశమే ఇవ్వలేదు. తన నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పుల విషయంలో కూడా పారదర్శకంగా వ్యవహరించలేదు. ఇప్పటి వరకూ జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా హాజరు కాలేదు. విచారణ కమిషన్ ల ముందుకు వచ్చి వివరణ ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడు. రాష్ట్రంలో అన్ని ప్రజా, ప్రభుత్వ సంస్థలనూ నిర్వీర్యం చేసి, అన్ని రంగాల వారికీ బకాయిలు పెట్టి, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కేసీఆర్, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఇప్పుడు మళ్ళీ ప్రజల గురించీ, ప్రజాస్వామ్యం గురించీ వాపోవడం, తనకు ఇబ్బంది కలిగించే అంశాల నుండీ తప్పించుకోవడానికి కోర్టులను ఆశ్రయించడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.

భారత ప్రజాస్వామ్యంలో శాసన నిర్మాణ వ్యవస్థ, కార్యనిర్వహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా, రాజ్యాంగ సూత్రాలకు లోబడి వ్యవహరించాలని భారత రాజ్యాంగం అంటోంది. అదే సమయంలో ఈ మూడు వ్యవస్థలూ పరస్పరాధారితంగా కూడా ఉంటాయి. ఆయా సమయాలలో ప్రభుత్వ పగ్గాలను చేపట్టిన వాళ్ళు, ఆయా వ్యవస్థలతో ఎలా వ్యవహరిస్తారు, వాటికి ఎంత స్వతంత్రతను మిగులుస్తారు, ఈ వ్యవస్థలను స్వంత ప్రయోజనాలకు కాకుండా, విశాల దేశ, రాష్ట్ర, ప్రజల సామూహిక ప్రయోజనాలకు ఉపయోగిస్తారా, ప్రజల ప్రాధమిక హక్కులకు ఎంత గౌరవం ఇస్తారు, రాజ్యాంగం ప్రబోధించిన ఆదేశిక సూత్రాల అమలుకు ఎంతగా కట్టుబడి ఉంటారు అన్నది చాలా ముఖ్యం.

మన దేశంలో, రాష్ట్రంలో అధికార , ప్రతిపక్ష పార్టీల వ్యవహార శైలి చూస్తుంటే, నిజంగా రాజ్యాంగ విలువల పట్ల వారికి గౌరవం లేదనీ, అమలు పట్ల చిత్త శుద్ధి లేదనీ అర్థమవుతుంది. ప్రజల పట్లా, ప్రజాస్వామ్యం పట్లా, రాజ్యాంగం పట్లా, చట్ట సభలు ఆమోదించే చట్టాల పట్లా, ప్రభుత్వాలు విడుదల చేసే జీవో ల పట్లా, కోర్టు తీర్పుల పట్లా అన్ని సమయాలలో ఒకే రకంగా వ్యవహరించరనీ, ఒకే విధంగా విలువ ఇవ్వరనీ, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తారనీ మనం చూస్తున్నాం.

హామీల అమలులో అవలక్షణాలు...

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చే హామీల విషయంలో కూడా అదే వైఖరి. ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయాలనే ఉద్దేశం కాకుండా, హామీల అమలులో కాల యాపన చేయడం, అరకొరగా అమలు చేసి, పక్కన బెట్టేయడం, తాము ప్రాధాన్యత ఇచ్చే అంశాలకు కాకుండా, ఇతర అంశాలకు బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించకపోవడం ఇవన్నీ ఒకే స్వభావానికి చెందిన అంశాలు.

ప్రజలకు అనేక వాగ్ధానాలు, ముఖ్యంగా ప్రజా పాలన, ప్రజాస్వామ్య పాలన హామీలు ఇచ్చి అధికారానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం లో కూడా పదేళ్ళ పాటు కేసీఆర్ ప్రభుత్వంలో వ్యక్తమయిన అవలక్షణాలే కనిపిస్తున్నాయని ప్రజలలో ఒక అభిప్రాయం ఏర్పడుతున్నది.

అసలు ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదనీ, ముఖ్యమంత్రిని, మంత్రులను కలవడం కూడా అసాధ్యంగా మారుతుందనీ, ప్రజా వాణిలో ఇచ్చిన దరఖాస్తులకు కూడా వెంటనే పరిష్కారం చూపడం లేదనీ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు విషయంలో, వివిధ విషయాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం లో జరుగుతున్న జాప్యం ప్రజలకు అసంతృప్తి కలిగిస్తున్నది.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలకు మొదటి అసెంబ్లీ సమావేశాలలోనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన మాట నిజం కాలేదు. లక్షలాది మంది గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ఆసరా పెన్షన్ లు (పెంచిన మొత్తంతో) ఎప్పుడు మొదలవుతాయో స్పష్టత లేదు. అన్ని పథకాలకు రేషన్ కార్డు ను తప్పనిసరి చేసినప్పటికీ, గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్న విషయం గుర్తించినా, కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేదు.

పెరుగుతోన్న అసంతృప్తి...

నిత్యం ప్రజల గొంతు వినిపించే ప్రొఫెసర్ కోదండ రామ్, అమీర్ అలీ ఖాన్ లాంటి మేధావులకు హామీ ఇచ్చినట్లుగా ఎమ్మెల్సీ బాధ్యతలు ఎప్పుడు ఫైనల్ చేస్తారో కూడా స్పష్టత లేదు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు జాబ్ క్యాలండర్ ఎప్పుడు విడుదల అవుతుందో తెలియదు. గత పది రోజులుగా నిరుద్యోగ యువకులు ఆందోళనలు, నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పిలిచి చర్చించడం లేదనే అసంతృప్తి వారిలో ఉంది. యూనివర్సిటీ లకు వైస్ ఛాన్సలర్ లను ఎంపిక చేయడానికి ఎంపిక కమిటీలు వేసినా, ఆ ప్రక్రియ ఎందుకు ముందుకు పోవడం లేదో తెలియదు.

విద్యారంగానికి ప్రత్యేక మంత్రి లేకపోవడం ఒక సమస్య అయితే, ఆ రంగంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయని, విద్యారంగ నిపుణులతో, ఉపాధ్యాయ సంఘాలతో కనీసం చర్చించడం లేదనే అసంతృప్తి కూడా వ్యక్తం అవుతున్నది. రాష్ట్రంలో కోట్లాదిమంది పని చేసే కార్మిక రంగానికి ప్రత్యేక మంత్రి లేకపోవడం, కార్మికుల సమస్యల విషయంలో, ఇచ్చిన హామీల విషయంలో ఏడు నెలలు గడిచినా, కనీస చర్చలు కూడా ప్రారంభం కాకపోవడం కూడా శ్రామిక ప్రజలలో అసంతృప్తికి దారి తీస్తున్నది.

ప్రభుత్వ వైద్య, ఆరోగ్య రంగంలో ప్రజలకు భరోసా ఇచ్చే అంశాలలో పెద్దగా కదలికలు కనపడడం లేదు కానీ, ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రి వర్గ సహచరులు వరంగల్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి అట్టహాసంగా తరలి వెళ్లడం ప్రజలకు తప్పుడు సిగ్నల్స్ మాత్రమే ఇస్తున్నది. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం వేగంగా కదిలి చర్యలు తీసుకోవడం అభినందనీయమే అయినా, మద్యం బెల్టు షాపులు రద్ధు చేస్తామనే హామీ వైపు అడుగులు పడలేదు. మరో వైపు ఎక్సైజ్ పన్ను ఆదాయాన్ని ఈ సంవత్సరం 25,000 కోట్లకు పెంచుకుంటామనే బడ్జెట్ పత్రాలు ప్రజలకు మరింత భయాందోళనలు కలిగిస్తున్నాయి.

ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా పని చేయాలంటే, గత ప్రభుత్వం ప్రజా సంఘాల కార్యకర్తలపై, మేధావులపై పెట్టిన UAPA సహా ఇతర అక్రమ కేసుల సమీక్ష తక్షణమే చేయాల్సి ఉన్నా, కారణమేదైనా అటువైపు కదలికలు లేవు.

వరంగల్ లో సమూహ సెక్యులర్ రచయితల సమావేశంపై, మెదక్ లో ముస్లిం సముదాయానికి చెందిన ప్రజల ఇళ్లపై, దుకాణాలపై హిందుత్వ శక్తులు దాడులు చేసి భయ భ్రాంతులకు గురి చేసినా, క్రిస్టియన్ చర్చ్ లపై దాడులు జరగుతున్నా పోలీసులు వేగంగా స్పందించలేదనీ, ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదనీ విమర్శలు వచ్చాయి. ఏ సందర్భం వచ్చినా హైదరాబాద్ లో ముస్లిం ప్రజల ఇళ్లపై కార్డన్ సెర్చ్ పేరుతో పోలీసులు దాడులు చేయడం ఈ ప్రభుత్వ కాలంలో కూడా ఆగలేదనే అసంతృప్తి ముస్లిం సామాజిక కార్యకర్తలలో వ్యక్తం అవుతున్నది.

ఒక నిరంకుశ పాలన నుంచి బయట పడి, ఊపిరి పీల్చుకుందామని ఆశించిన సాధారణ ప్రజలలో వ్యక్తమవుతున్న ఈ అసంతృప్తులను ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరముంది. ప్రజాసంఘాలతో, పౌర సమాజంతో రెగ్యులర్ గా చర్చలకు తగిన అవకాశాలు కల్పించడం ద్వారా, ప్రజల గొంతును ప్రభుత్వం వినే అవకాశం ఉంది. అందుకు ఏర్పాట్లు చేయాలి. లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా మారిపోతారనే విమర్శను ఈ ప్రభుత్వం కూడా నిజం చేస్తుందనే అభిప్రాయం బలపడుతుంది.

Tags:    

Similar News