మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారా?
14 నెలలు ఫామ్ హౌస్‌లో కుర్చున్న వారికి అభివృద్ధి ఏం కనిపిస్తుందంటూ పొంగులేటి సెటైర్లు. స్థానిక సంస్థలు దగ్గర పడటంతోనే అజ్ఞాతం వీడారు.;
బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకవర్గ సమావేశం ఈరోజు తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగింది. ఇందులో కేసీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అతి త్వరలోనే రాష్ట్రంలో ఉపఎన్నికలు కూడా రానున్నాయని జోస్యం చెప్పారు. కాగా మాటలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సెటైరలు వేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేసీఆర్ పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఏడాది పాటు ఫార్మ్ హౌస్‌లోనే ఉండటంతో ఆయనకు బయట ఏం జరుగుతుందో తెలియడం లేదని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంతో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, బీఆర్ఎస్ ఊసు కూడా ఎక్కడా వినిపించడం లేదని అన్నారు. ఇవన్నీ తెలియక కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, పైగా పార్టీ కార్యకర్తలను కూడా వాటిళ్లో గుంజుతున్నారంటూ చురకలంటించారు. 14 నెలల నుంచి అజ్ఞాతంలో ఉన్న వ్యక్తికి అభివృద్ధి ఎలా కనబడుతుంది? అని ప్రశ్నించారు.
కేసీఆర్ ఒక సీజనల్ పొలిటీషియన్
‘‘ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్లు ఫాంహౌస్ దాటని దొరవారు అధికారంపై పగటికలలు కంటున్నారు. అధికారం కోల్పోగానే తనకు పదేళ్లు అధికారం కట్టబెట్టిన ప్రజలను మరిచి అజ్ఞాతంలోకి వెళ్లిన కేసీఆర్‌కి, 14 నెలలుగా కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ది ఏ విధంగా కనబడుతుంది. కేసీఆర్ ఒక సీజనల్ పొలిటీషియన్. ఎన్నికలప్పుడు మాత్రమే ఆయనకు ప్రజలు గుర్తుకొస్తారు. 14 నెలల నుంచి ఫాంహౌస్ దాటని ఆయన స్ధానిక ఎన్నికలు వస్తున్నాయని ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు’’ అని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.
అప్పుడెందుకు బయటకు రాలేదు కేసీఆర్
‘‘మేడిగడ్డ కుంగినప్పుడు గాని, రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు గాని ఆయనకు ప్రజలు గుర్తుకురాలేదు. శాసనసభలో కీలకమైన తీర్మానాలు, కులగణన, ఎస్సీవర్గీకరణ, భూభారతి బిల్లు, తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానానికి కూడా కేసీఆర్ హాజరుకాలేదు. తెలంగాణ ప్రజలు కష్టపడి కేసీఆర్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెడితే, ఆయన ఏనాడు ప్రజాతీర్పును గౌరవించలేదు. అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షనేత అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించాలి. కానీ కేసీఆర్ మాత్రం తాను ప్రజలు జవాబుదారీగా లేనట్లుగా ప్రవర్తిస్తున్నారు’’ అని విమర్శించారు.
కేసీఆర్ తన భవిష్యత్తుపై ఫోకస్ పెట్టాలి
‘‘ఆయన అసెంబ్లీకి వస్తే ఆయన పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఏవిధంగా తిరోగమనదిశలోకి తీసుకెళ్లారు, పదేళ్లలో ఆయన చేసిన నిర్వాకాలను తప్పులను ఒక్కోక్కటిగా సరిచేసుకుంటూ 14నెలల్లో తాము సాధించిన అభివృద్దిని సవివరంగా కేసీఆర్ ముందుంచుతాం. కాంగ్రెస్ భవిష్యత్ గురించి కాకుండా ముందుగా తన భవిష్యత్తు, తన పార్టీ భవిష్యత్తు గురించి కేసీఆర్ ఆలోచిస్తే బాగుంటుంది. కేసీఆర్ భవిష్యత్తుపై గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. పార్లమెంటు తీర్పే భవిష్యత్తులో ఉంటుంది. విపరీతమైన అప్పులు చేసి నెత్తినమీద మిత్తిల భారం పెట్టిపోయారు . పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పులకు తెలంగాణ సమాజం ఆయనను ఎన్నటికీ క్షమించదు’’ అని వ్యాఖ్యానించారు.
కేసీఆర్.. నిజాన్ని జీర్ణించుకోలేకున్నారు: పొన్నం ప్రభాకర్
బీఆర్ఎస్ సమావేశం, అందులో కేసీఆర్ ప్రసంగంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఘాటు వ్యాఖ్యలే చేశారు. కేసీఆర్ పాస్‌పోర్ట్ కోసమే బయటకు వచ్చారంటూ ఎద్దేవా చేశారు. అసలు ఏడాది పాటు అసెంబ్లీ మొఖం చూడని ప్రతిపక్ష నాయకుడు ఎక్కడైనా ఉంటారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు నిజాలు చెప్తున్నా వాటిని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ‘‘ఫామ్ హౌస్ నుండి పాస్ పోర్ట్ కు వచ్చారు కాబట్టే.. పార్టీ ఆఫీస్ వచ్చారనకుంటా. ప్రతిపక్ష నేతగా ఉన్న ఎవరైనా ఏడాదిగా ఫామ్ హౌస్ లో ఉంటారా? కాంగ్రెస్ ఏడాదిలో అమలుచేసిన సంక్షేమ పథకాలు చూసి కెసిఆర్ తట్టుకోలేక పోతున్నారు. కేసీఆర్.. ప్రభుత్వంపై అసహనంతో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు నిజం మాట్లాడుతుంటే కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే క్యాడర్‌ను నిందిస్తున్నారు’’ అని అన్నారు.
సంక్షేమం కనిపిస్తలేదా కేసీఆర్
‘‘ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ,ఇందిరమ్మఇండ్లు, ఉచిత విద్యుత్, యాభై వేల ఉద్యోగాలు, రైతు భరోసా, రుణమాఫీ అమలు కెసిఆర్ కు కనిపిస్తలేవా? ఆర్థిక విధ్వంసం తర్వాత కూడా సమర్ధవంతంగా పాలన ఇస్తున్నాం. పాత పథకాలను కొనసాగిస్తూ.. కొత్త పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తున్నాం. భాధ్యత యుత ప్రతిపక్ష నేతగా కెసిఆర్ వ్యవహరించాలి. తమిళనాడు మాదిరి.. రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రం పై వత్తిడికి ప్రభుత్వంతో కలిసిరావాలి. బీసీ రిజర్వేషన్‌లపై ప్రతిపక్షాలు కలిసి రావాలి’’ అని పిలుపునిచ్చారు.