విశాఖ డాక్టర్లు అరెస్ట్ అయినా.. సంబంధం లేదంటున్న కేజీహెచ్..

డాక్టర్ నమ్రత వ్యవహారమై విశాఖపట్నంలోని కేజీహెచ్ స్పందించింది.. ఎందుకంటే..;

Update: 2025-08-09 15:54 GMT

తెలుగు రాష్ట్రాల్లో కల్లోలం రేపిన డాక్టర్ అత్తలూరి నమ్రత సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ వ్యవహారంపై విశాఖ కేజీహెచ్‌ ని తాకింది. ఈ కేసులో విశాఖపట్నం డాక్టర్లు ముగ్గురు అరెస్ట్ అయినట్టు చెబుతున్న నేపథ్యంలో ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాణి శనివారం ఒక సంచలన ప్రకటన చేశారు. ఆ కుంభకోణంతో తమకేమీ సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కేసుతో తమకు గానీ, ఆంధ్రా మెడికల్‌ కాలేజీ (ఏఎంసీ)కి గానీ ఏ విధమైన అధికారిక సంబంధం లేదని ఆమె ఖరాఖండితంగా చెబుతున్నారు.


ఈ కేసు సంబంధించి తెలంగాణ పోలీసులు కొనసాగిస్తున్న దర్యాప్తులో కొన్ని ముఖ్యమైన విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా, కేజీహెచ్‌, ఏఎంసీకి చెందిన ఇద్దరు వైద్యుల పేర్లు ఈ వ్యవహారంలో ప్రస్తావనకు వచ్చాయి. డాక్టర్‌ వాణి వీటితో విభేదిస్తున్నారు. వ్యక్తిగత హోదాలో ఎవరైనా డాక్టర్ నమ్రతకు సేవలు అందించారేమో తమకు తెలియదని అన్నారు.

వాణి వాదన ప్రకారం, ఆ ఇద్దరు వైద్యులు వ్యక్తిగత హోదాలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కు వైద్య సేవలు అందించి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం వారిద్దరి ఫోన్‌ నంబర్లు స్విచ్‌ ఆఫ్‌లో ఉండటంతో, వారితో సంప్రదింపులు జరగలేకపోతున్నాం. ఈ కారణంగా, వారి నుంచి ఎటువంటి అధికారిక వివరణ రాలేదని ఆమె చెప్పారు.

వైద్యుల పాత్రపై అధికారిక దర్యాప్తు నివేదిక అందిన తర్వాత, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని డాక్టర్‌ వాణి స్పష్టం చేశారు. అలాగే, ఆసుపత్రి లేదా మెడికల్‌ కాలేజీ స్థాయిలో ఎలాంటి అనుమతి లేదా మద్దతు సృష్టి ఆస్పత్రికి లేదా డాక్టర్ నమ్రతకు ఇవ్వలేదని పునరుద్ఘాటించారు.

సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంపై అధికారుల స్పందన..

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ లో శిశు విక్రయాల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. వైద్య నిబంధనల ఉల్లంఘన, సరోగసీ (Surrogacy), ఇన్‌-విట్రో ఫెర్టిలైజేషన్‌ (IVF) విధానాల దుర్వినియోగం, అంతర్రాష్ట్ర స్థాయిలో అవకతవకలు జరిగాయన్న అనుమానాలతో డాక్టర్ నమ్రతతో పాటు 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసులో ప్రధాన ఆరోపణలు...

-గర్భధారణ ప్రక్రియలలో నిబంధనలకు విరుద్ధమైన విధానాలు

-పత్రాలు, వైద్య రికార్డుల్లో లోపాలు-

-సంబంధిత వైద్యుల అనుమతులు, అర్హతలపై అనుమానాలు ముఖ్యాంశాలుగా నిలిచాయి.

ఈ నేపథ్యంలో, తెలంగాణ పోలీసులు అనేక వైద్య కేంద్రాలు, సిబ్బందిపై విచారణ చేపట్టారు. దర్యాప్తులో ఆంధ్రప్రదేశ్‌ వైద్యులు, ఆసుపత్రుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి.

కేజీహెచ్‌–ఏఎంసీపై అనుమానాలు...

దర్యాప్తు సమయంలో, విశాఖపట్నంలోని కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌ (కేజీహెచ్‌), ఆంధ్రా మెడికల్‌ కాలేజీ (ఏఎంసీ)కి చెందిన ఇద్దరు వైద్యుల పేర్లు విచారణలో బయటకువచ్చాయి. ఈ దశలో సూపరింటెండెంట్‌ వాణి స్పందించారు. కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాణి ఈ కేసుతో తమకు గానీ, ఏఎంసీకి గానీ అధికారిక సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఈ కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉంది. తెలంగాణ పోలీసులు, ఇతర సంబంధిత విభాగాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. ఫెర్టిలిటీ, సరోగసీ రంగాలలో చట్టపరమైన నియంత్రణ, నైతికత అంశాలు మళ్లీ చర్చకు రావడంతో, వైద్య రంగంలో పారదర్శకత, పర్యవేక్షణ అవసరం పై నిపుణులు దృష్టి సారించారు.

Tags:    

Similar News