తెలంగాణ సహజకవి ‘అందెశ్రీ’ కన్నుమూత
ఉదయం ఇంట్లోనే గుండెపోటుతో కుప్పకూలిన ‘పాట’
ప్రముఖ తెలంగాణ వాగ్గేయకారుడు అందెశ్రీ (64) తీవ్ర అస్వస్ధతతో సోమవారం ఉదయం కన్నుమూశారు. ఉదయం ఇంట్లోనే రచయిత గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అందెశ్రీ కి తెల్లవారిజుమునుండే బాగా నలతగా ఉన్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఉదయం 3.30 గంటల ప్రాంతంలో పల్స్ కొట్టుకోవటం బాగా పడిపోవటంతో స్పృహతప్పిపడిపోయారు. దాంతో వెంటనే కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ గేయం ‘జయజయజయహే తెలంగాణ జననీ జనకేతనం‘ ను అందెశ్రీనే రచించారు. ఈ గీతాన్ని ప్రభుత్వం తెలంగాణ గేయంగా ప్రకటించింది. ఈయనకు 64 ఏళ్ళు. సిద్దిపేట జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించిన అందెశ్రీ తెలంగాణలోని ప్రముఖ రచయితల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన రచనలతో ఉద్యమానికి చాలా ఊపుతెచ్చారు. కొన్ని సినిమాల్లో కూడా అందెశ్రీ పాటలను రచించారు.
అందెశ్రీ సహజకవి. ఆయనకు చదువుకునే అవకాశం రాలేదు. గ్రామాల్లో నిరం తరం జరిగే యక్షగానాలు, కోలాటాల పాటలు ఆయనలోని కవిని నిద్రలేపాయి. ఆయన తాపీ పనివాడిగా నిజామాబాద్ వలస వెళ్లారు.ఆధునికత పేరుతో మనిషి కానరాకుండా పోతున్న వైనాన్ని మనీషన్న వాడు మచ్చుకైనలేడు అని ఎర్రసముద్రం సినిమాలో పది సంవత్సరాల క్రితమే అందెశ్రీ తన పాట ద్వారా మహాగొప్పగా చాటిచెప్పారు.
ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఒక అనాథగా తెలంగాణ ఒడిలో పెరిగారు. ఏ విధమయిన చదువూ చదవలేదు.అయితే, కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు
గొడ్లకాపరిగా...
అందెశ్రీ కాకముందు ఆయన గొడ్ల కాపరిగా పనిచేసారు. ఒకసారి అందెశ్రీ పాటపాడుతుండగా శృంగేరి మఠం స్వామీ శంకర్ మహారాజ్ విని ఆయన్ని చేరదీసాడు. అన్ని రకాల హావభావాలను సులభంగా ఇముడ్చుకునే ఆయన గొంత పాటని రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళ్లింది. సీని దర్శకుడు నారాయణ మూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఆయన పాటలున్నాయి. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయరచన చేసారు. ఈయన అశువు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో గంగ సినిమాకు గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు.
ఆయన తాత్వికత
భజన భజంత్రీల పాటలు వద్దు,
ఎంగిలి పాటలు రాయకు
నీవు చూసిన బతుకుపాటలు రాయి
నీకై నీవె కైకట్టు – మనసుపెట్టి...
అనేది ఆయన ఆయన తత్వచింతన
ఆయన పాడితె ఎలా ఉంటుందంటే...
ముఖ్యమంత్రి రేవంత్ ఆవేదన
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ గారి ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ గారి మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ… pic.twitter.com/l2ABGj3kwf
— Telangana CMO (@TelanganaCMO) November 10, 2025
కిషన్ సంతాపం
ప్రముఖ కవి అందెశ్రీ మరణంపై కేంద్రమంత్రి జీ. కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. అందెశ్రీ మరణం తీవ్ర విచారకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో సమాజంలోని అన్నీ వర్గాలను కదిలించిన విషయాన్ని కిషన్ గుర్తుచేశారు. ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’ అనే గేయం తెలంగాణ ఉద్యమానికి మైలురాయిగా నిలిచిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలోనే కాకుండా తర్వాత కూడా తెలంగాణ జాతిని జాగృతంచేసే విషయంలో ముక్కుసూటిగా వ్యవహరించారని చెప్పారు. సమాజానికి చెప్పాలని అనుకున్న విషయాన్ని అందెశ్రీ సూటిగా, స్పష్టంగా చెప్పేవారని గుర్తుచేశారు.
కేసీఆర్ దిగ్భ్రాంతి
అందెశ్రీ మరణం విషయంలో కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహజకవి మరణం పట్ల విచారం చెబుతు కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. తెలంగాణ సాధన కోసం సాగిన సాంస్కృతిక సాధన ఉద్యమంలో కవిత తన పాటలతో, సాహిత్యంతో అందెశ్రీ మరణం తెలంగాణకు తీరనిలోటన్నారు. ఉద్యమకాలంలో సహజకవితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు.