ప్రాణాలు తీస్తున్న వీధికుక్కలను చంపేయండి:ఫోరంఫర్ గుడ్‌గవర్నెన్స్
పిల్లల ప్రాణాలను హరిస్తున్న వీధికుక్కలను చంపేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.ఫోరం సర్కారుకు వినతిపత్రాన్ని సమర్పించింది.
By : The Federal
Update: 2024-07-22 14:25 GMT
తెలంగాణ రాష్ట్రంలో పిల్లల ప్రాణాలు తోడేస్తున్న వీధికుక్కల సమస్యను శాశ్వతంగా పరిష్కారానికి వాటిని చంపేయడం ఒక్కటే మార్గమని హైదరాబాద్ నగరానికి చెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేర తెలంగాణ మునిసిపల్ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ కు సోమవారం పద్మనాభరెడ్డి వినతిపత్రాన్ని సమర్పించారు.
హైదరాబాద్ నగరంలో 4 లక్షల వీధికుక్కలు
తెలంగాణ రాష్ట్రంలో వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగింది. జి.హెచ్.యం.సి. సర్వే ప్రకారం కేవలం ఒక హైదరాబాదు నగరంలోనే 4 లక్షల వీధి శునకాలు ఉన్నాయని తేలింది.జి.హెచ్.యం.సి. వారు కుక్కలను స్టెరిలైజ్ చేసి కుక్కల బెడద తగ్గించడానికి చేసిన ప్రయత్నం ఫలితాలు ఇవ్వడం లేదు.దీంతో పసిపిల్లలను వీధి కుక్కలు వెంబడించి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కొన్ని సందర్భాలలో పిల్లల శరీర భాగాలను తినడం వంటివి చూసినప్పుడు హృదయం కలచివేస్తుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి ఆవేదనగా చెప్పారు.
జీహెచ్ఎంసీ చట్టం ఏం చెబుతుందంటే...
హైదరాబాద్ నగర వీధుల్లో స్వైరవిహారం చేస్తున్న వీధి కుక్కలకు యజమానులు లేరని, అందుకే జి.హెచ్.యం.సి. చట్టం సెక్షన్ 249 ప్రకారం యాజమానులు లేని వీధి కుక్కలను చంపి వేయవచ్చునని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి చెప్పారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న వీధి కుక్కలను చంపివేయాలని ఆయన కోరారు.
అడవి పందులను చంపేయాలని గతంలో ఉత్తర్వులు
కొన్ని సంవత్సరాల క్రితం హకీంపేట ఏరియాలో అడవి పందులు స్థానికులకు అపాయం కలిగించే పరిస్థితుల్లో అక్కడ అటవీ శాఖాధికారి ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని అడవి పందులను చంపడానికి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అప్పట్లో అడవి పందుల బెడదను నివారించడానికి వాటిని చంపి వేశారు. గ్రామాల్లో అడవి పందులు పంటలకు నష్టం చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం గ్రామపంచాయితీలకు అడవిపందులను చంపడానికి అధికారాలు ఇచ్చింది.
ఏనుగులు, పెద్దపులులు సైతం...
ప్రపంచంలోని చాలా అభయారణ్యాలలో ఏనుగుల జనాభా పెరిగిపోవడంతో అన్నింటికి తగినంత ఆహారం దొరకని పరిస్థితిలో కొన్నింటిని చంపివేశారని అటవీశాఖ మాజీ డీఎఫ్ఓ అయిన పద్మనాభరెడ్డి చెప్పారు. పెద్ద పులులు సైతం మనుషులపై దాడిచేసిన సందర్భాల్లో అలాంటి పులిని మ్యాన్ ఈటర్‌గా గుర్తించి చంపివేయాలని షూట్ ఎట్ సైట్ అంటూ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భాలను పద్మనాభరెడ్డి గుర్తు చేశారు. కోతులు పంటలను ధ్వంసం చేయడంతోపాటు కొన్ని సందర్భాల్లో మనుషులపై దాడులు చేస్తున్నాయి.అటవీశాఖ అధికారులు అక్కడక్కడ దాడులు చేసే కోతులను పట్టుకొని వాటిని స్టెరిలైజ్ చేయించి కేజ్‌లలో ఉంచి ఆహార సదుపాయాలు సమకూరుస్తున్నారు.
ప్రతీ 20 మంది జనాభాకు ఒక వీధికుక్క
జి.హెచ్.యం.సి. పరిథిలో ప్రతి 20 మంది జనాభాకు ఒక వీధి కుక్క ఉందని గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాదు నగర రోడ్లు, కాలనీల్లో వీధికుక్కలు యథేచ్చగా తిరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు కుక్కలకు స్టెరిలైజ్ చేయిస్తున్నామని చెబుతున్నా కుక్కల బెడదకు తెరపడటం లేదు. ఆహార లభ్యతను బట్టి వీధి కుక్కల సంఖ్య పెరుగుతుంది. ప్రజలు మిగిలిన ఆహారం, మాంసం దుకాణాలలో మిగిలిపోయిన ముక్కలు, హోటళ్ళ లో మిగిలిన భోజనం రోడ్లపై వేయడంతో కుక్కల సంఖ్య పెరుగుతుంది.
భారత ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు ఎం చెబుతుందంటే...
భారత ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు వీధికుక్కలు కరచినప్పుడు తీసుకోవలసిన చర్యల గురించి చెబుతోంది. కుక్క కాటుకు గురైన వ్యక్తి గురించి ఏమీ మాట్లాడకుండా కరచిన కుక్కను మానవతా దృక్పథంతో చూడాలని ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు చెప్పడాన్ని పద్మనాభరెడ్డి తప్పుబట్టారు. కరిచిన కుక్కను వారం రోజులు పరిశీలనలో ఉంచాలని, మళ్లీ ఆ కుక్కను అదే స్థలంలో వదిలివేయాలని ఆచరణ యోగ్యం కాని సలహాలు ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. జి.హెచ్.యం.సి. లో వెల్ఫేర్ బోర్డు సలహాలు పాటించడానికి సరియైన యంత్రాంగం లేనందున వెల్ఫేర్ బోర్డు సలహాలు కాగితాలకే పరిమితమైనాయి.ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక చోట కుక్క కాటు కేసులు వెలుగుచూస్తున్నా ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు ఆదేశాలు ఇవ్వడం ఆచరణీయంకాదని పద్మనాభరెడ్డి చెప్పారు.బోర్డు వారి సలహాలు ప్రజల ప్రాణాల కంటే కుక్క ప్రాణాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా ఉన్నాయన్నారు.
కుక్కల కంటే మనుషుల రక్షణే ముఖ్యం
‘‘మనుషులను కుక్కల బారి నుంచి కాపాడటం కూడా ముఖ్యమని, పాలన యంత్రాంగం అలసత్వం వల్ల ప్రజలు కుక్కల కాటుతో ఎవరూ బాధపడకూడదు’’ అని సుప్రీంకోర్టు 2015 నవంబరు 18వతేదీన తీర్పులో పేర్కొంది. సుప్రీం తీర్పును దృష్టిలో ఉంచుకొని కుక్కల రక్షణ కంటే మనుషుల రక్షణే అవసరమని గుర్తించి వీధుల్లో తిరుగుతున్న వీధికుక్కలను చంపడానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని కోరింది.