కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారంటూ కోమటిరెడ్డి విసుర్లు
పీసీ ఘోష్ కమిషన్‌ను కాంగ్రెస్ కమిషన్ అనడాన్ని తప్పుబట్టిన శ్రీధర్ బాబు;
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అంతా కూడా కమిషన్ల కోసమే జరిగిందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన విమర్శలు చేశారు. పీసీ ఘోష్ కమిషన్‌పై అసెంబ్లీలో జరుగుతున్న చర్చ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్ బాబు.. ప్రతిపక్షంపై విమర్శల వర్షం కురిపించారు. కాళేశ్వరం కమిషన్ నిర్మాణంలో చిత్తశుద్ధి లేదని, అంతా అవినీతే అని కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శిక్ష తప్పించుకోవాలని హరీష్ రావు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. బ్యారేజీల గురించి హరీస్ రావు మాట్లాడాలని వెంకట్‌రెడ్డి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలో.. ఎలా కట్టాలో వారికీ తెలియదని, కమిషన్లకు కక్కుర్తి పడి ఎక్కడో ఒకచోట అన్నట్లు కట్టారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం హడావుడిగా కట్టింది కాబట్టే కూలిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని కాళ్లు మొక్కి వచ్చారని గుర్తుచేశారు. గతంలో అసెంబ్లీలో సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.
ప్రజలను కేసీఆర్ అవమానిస్తున్నారు
‘‘ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్.. సభకు రాకుండా రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారు. మేడి గడ్డ కూలడానికి తామే కారణమని సభకు వచ్చి రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి. బీసీ రిజర్వేషన్ల కోసం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుంటే కేసీఆర్ సభకు ఎందుకు రారు? హరీష్ రావు కూడా కోర్టు కేసుల గురించి మాట్లాడటం మానుకుని అసలు విషయం మాట్లాడాలి? బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలు జరిగాయా లేదా అన్నదానిపై చర్చ జరుగుతుంది. వాళ్లు మాత్రం సబ్జెక్ట్ వదిలి ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్లు ఇంకోసారి అధికారంలోకి వచ్చి ఉంటే మరో రూ.లక్ష కోట్లు కొల్లగొట్టి ఉండేవారు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
కాంగ్రెస్ కమిషన్ అంటారా: శ్రీధర్ బాబు
ఈ సందర్భంగానే పీసీ ఘోష్ కమిషన్‌ను కాంగ్రెస్ కమిషన్ అన్న ఆరోపణను మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ‘‘హరీష్ రావు దగ్గర కాళేశ్వరంకు సంబంధించి విషయం ఉంటే మాట్లాడాలి. లేదంటే మా వాళ్లు మాట్లాడతారు. టెక్నికల్ అంశాలపై కోర్టుకు వెళ్లారు. దాన్ని కోర్టు తేలుస్తుంది. ఏఐసీసీ సీనియర్ సభ్యులే ప్రస్తుతం మీ కేసును వాదిస్తున్నారు.. అది వారి వృత్తి. అలాంటిది పీసీ ఘోష్ కమిషన్‌ను కాంగ్రెస్ కమిషన్ అంటారా?’’ అని శ్రీధర్ బాబు మండిపడ్డారు.