‘రేవంత్ అలా అనడం సరికాదు’

సీఎం వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.;

Update: 2025-07-19 07:40 GMT

‘పది సంవత్సరాలు నేనే సీఎంగా ఉంటా’ అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా రేవంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడే అయినప్పటికీ రేవంత్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. సీఎం అలా అనడం సరికాదని పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. కాంగ్రెస్‌లోని అంతర్గత వివాదాలను, రేవంత్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయన్న చర్చలు కూడా మొదలయ్యాయి. అదే సమయంలో రేవంత్ వ్యాఖ్యలపై మరేనేత ఇప్పటి వరకు స్పందించలేదు. కేవంత్ రాజగోపాల్ రెడ్డి ఒక్కరే ఎక్స్(ట్విట్టర్) వేదికగా కీలక వ్యాఖ్యలతో పోస్ట్ పెట్టారు. దీంతో తనకు మంత్రి పదవి ఇవ్వలేదన్న అక్కసుతోనే రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి తప్పుబడుతున్నారన్న చర్చ కూడా జరుగుతోంది.

పార్టీ విధానాలకు వ్యతిరేకం: రాజగోపాల్

‘‘పదేళ్లు తానే సీఎం అని రేవంత్ చెప్పడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో అధిష్ఠానం ఆదేశాలతోనే ఎన్నిక ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం ఎన్నిక జరుగుతుంది. తెలంగాణలోని పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలు సహించం. నిఖార్సయిన నేతలు, కార్యకర్తలు ఎవరూ ఇలాంటివి సహించరు’’ అని రాజగోపాల్ రెడ్డి పోస్ట్ పెట్టారు.

రేవంత్ ఏమన్నారంటే..

‘కేసీఆర్‌ నీ గుండెల మీద రాసుకో.. 2024 నుంచి 2034 వరకు పాలమూరు బిడ్డ.. తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు..పాలమూరు నుంచి ప్రజాప్రభుత్వాన్ని నడుపుతాడు.. పాలమూరు నుంచి శాసనం చేస్తా.. పాలమూరు నుంచి శాసనసభలు నడిపించే బాధ్యత నేను తీసుకుంటా..ఇది నా మాట.. నువ్వు నీ గుండెల్లో రాసుకో’ అంటూ శుక్రవారం కొల్లాపూర్‌లో జరిగిన బహిరంగ సభ వేదిగకగా రేవంత్‌రెడ్డి పగటి కలలుకన్నారు.

Tags:    

Similar News