Konda Surekha | రాష్ట్రపతిపై తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

అత్యంత అభ్యంతరకరమైన మాటలతో మరోసారి వార్తల్లో నిలిచిన తెలంగాణ మంత్రి.;

Update: 2025-08-06 09:37 GMT

దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. వినడానికే అభ్యంతకరంగా అనిపించేలా మాట్లాడారు. దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి అత్యంత జుగుప్సాకరమైన మాటలు మాట్లాడి కొండా సురేఖ మరోసారి వార్తల్లో నిలిచారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో జంతర్‌ మంతర్ దగ్గర కాంగ్రెస్ చేపట్టిన మహాధర్నాలో కొండ సురేఖ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంతేకాకుండా బీజేపీ నేతలపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నాయకులకు నరనరాన కుల పిచ్చి పాతుకుపోయి ఉందని, అందుకు పార్లమెంటు, అయోధ్యరామ మందిర ప్రారంభోత్సవాలకు రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడమే అతిపెద్ద నిదర్శనమని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. బీసీల సాధికారతకు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న చారిత్రాత్మక చర్యలను వివరించారు. బీఆర్‌ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు.

నేనూ బీసీ బిడ్డనే

“30 ఏళ్ల క్రితం ఎంపీటీసీగా నా ప్రస్థానం మొదలైంది. ఎంపీపీ, ఎమ్మెల్యే, మంత్రి వరుసగా సాగింది. ఇది సాధ్యపడింది అంటే కాంగ్రెస్‌లో ఉన్న సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి వల్లే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బడుగు, బలహీన వర్గాలకు బాసటగా నిలిచింది. కేవలం హామీలకే కాదు, ఆచరణకు కూడా కట్టుబడి ఉంది. కవిత బీసీ ఉద్యమాన్ని ఆధిపత్యంగా మలచే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. “బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీ ఉద్యమం గుర్తుకు రాలేదా? బతుకమ్మ, జాగృతి అని రెండు రోజులు బతికిన వారు ఇప్పుడు బీసీ ఉద్యమం అంటున్నారు. బీసీ నేతలైన ఈటల రాజేందర్, నరేంద్ర, విజయశాంతిని అవమానకరంగా పార్టీ నుంచి పంపించేశారు. ఇది బీఆర్‌ఎస్ లో బీసీలపై ఉన్న వ్యతిరేకతను స్పష్టంగా చూపుతుంది. కేసీఆర్ కుటుంబం బీసీలను ఓట్ల యంత్రాలుగా మాత్రమే చూశారు. బీసీ సబ్‌ప్లాన్‌ను రద్దు చేసి, కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు” అని ఆరోపించారు.

రిజర్వేషన్లపై కేంద్ర మౌనం దారుణం

“తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల కోసం కుల గణన పూర్తి చేసి, రెండు బిల్లులను శాసనసభలో ఆమోదించాం. కానీ కేంద్ర ప్రభుత్వం వాటిపై ఇప్పటివరకు స్పందించకపోవడం దురదృష్టకరం. బీజేపీ, బీఆర్‌ఎస్ అసెంబ్లీలో మద్దతు తెలిపినా… ఇప్పుడు వ్యతిరేక వైఖరిలో ఉండడం దౌర్భాగ్యం. బీసీ బిల్లుపై గల్లీలో ఓకే… ఢిల్లీలో నాట్ ఓకే అంటే ప్రజలు మన్నించలేరు. 42% రిజర్వేషన్లలో ముస్లింలు ఉంటే తప్పేంటి? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. ముస్లింలు మనుషులే కాదా? ప్రధాని మోదీ బీసీ అని చెప్పుకుంటారు. కానీ బీసీల బిల్లు గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు” అని అన్నారు.

“తెలంగాణలో బీసీ నేత మహేశ్ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించాం. అనిల్ కుమార్ గౌడ్‌కు రాజ్యసభ ఎంపీ అవకాశం ఇచ్చాం. గతంలో రాపోలు ఆనంద్‌భాస్కర్, మల్లికార్జున్, శివశంకర్‌లను కేంద్ర మంత్రులుగా పంపిన ఘనత కాంగ్రెస్‌దే. బీసీల అభ్యున్నతి కోసం కాటమయ్య కిట్, గీత కార్మికులకు 5 లక్షల పరిహారం, కులగణన కమిషన్‌ ఏర్పాటు వంటి ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాం. బీసీ బిడ్డ బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి ఎటువంటి కారణం లేకుండా తొలగించారు. ఇప్పుడు ఓసీ నేతను అధ్యక్షుడిగా పెట్టారు. అటువంటి పార్టీ బీసీలకు న్యాయం చేస్తుందా? గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, బీజేపీ ఇక్కడ మాత్రం వ్యతిరేకంగా మాట్లాడటం విరుద్ధ భాష్యంగా ఉంది” అని అన్నారు.“రాహుల్ గాంధీ దేశంలో ‘భారత్ జోడో యాత్ర’లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కులగణన చేసి చూపించిన ఏకైక పార్టీ కాంగ్రెస్‌. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అన్ని రాష్ట్రాల్లో కులగణన జరగాలి” అని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News