Magnet Krishnaiah|పదవుల అయస్కాంతం కృష్ణయ్య
అసలు ఏ పార్టీలో కూడా సభ్యుడే కాని ఆర్ కృష్ణయ్యకు ఆ పార్టీల తరపున పదవులు ఎలాగ వస్తున్నాయి ?;
అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుందని అందరికీ తెలుసు. అయస్కాంతం పవర్ ను బట్టి చుట్టుపక్కల ఇనుము ఎక్కడున్నా ఇట్టే లాగేసుకుంటుంది. ఇనుము, అయస్కాంతం గురించి ఇపుడు ఎందుకంటే ర్యాగా కృష్ణయ్య(R Krishnaiah) బీజేపీ (BJP MP) తరపున ఏపీ కోటాలో రాజ్యసభ ఎంపీ అయ్యారు. బీసీ రిజర్వేషన్ పోరాట నేతకు పదవులు కొత్తేమీకాదు. రాజ్యసభ ఎంపీగా ఎంపికవ్వటం ఇది రెండోసారి. వైసీపీ అధికారంలో ఉన్నపుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ప్రత్యేకంగా పిలిపించుకుని రాజ్యసభ టికెట్ ఖాయంచేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. తర్వాత జరిగిన పరిణామాల్లో కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు అంటే 2014లో టీడీపీ తరపున ఎల్బీ నగర్(LB Nagar) నుండి ఎంఎల్ఏగా గెలిచారు.
ఇపుడు విషయం ఏమిటంటే కృష్ణయ్య ఏ పార్టీలోను సభ్యుడు కాదు. అయినా టీడీపీ తరపున ఎంఎల్ఏ అయ్యారు. తర్వాత వైసీపీ రాజ్యసభ ఎంపీ అయ్యారు. ఇపుడేమో బీజేపీ ఎంపీ అయ్యారు. పార్టీల్లో దశాబ్దాలుగా కష్టపడుతున్న వేలాదిమందికి ఒక్క పదవి కూడా దక్కదు. పార్టీలు మారుతున్న కొంతమందికి మాత్రం పదవులు దక్కుతున్నది వాస్తవం. పై రెండు క్యాటగిరీ నేతలకు పదవులు దక్కలేదన్నా లేదా దక్కుతున్నాయని అనుకున్నా ఏదోలే అని సరిపెట్టుకోవచ్చు. అయితే అసలు ఏ పార్టీలో కూడా సభ్యుడే కాని ఆర్ కృష్ణయ్యకు ఆ పార్టీల తరపున పదవులు ఎలాగ వస్తున్నాయి ? ఇక్కడే కృష్ణయ్య పదవులను ఆకర్షించే అయస్కాంతమా అనే సందేహం పెరిగిపోతోంది.
దశాబ్దాలుగా బీసీల రిజర్వేషన్ హక్కుల కోసం కృష్ణయ్య పోరాటాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. జాతీయస్ధాయిలో కూడా బీసీల హక్కులు, రిజర్వేషన్ల కోసం చాలా పోరాటాలే చేశారు, ఇపుడు కూడా చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటైన నేపధ్యంలో తెలంగాణాలో పోటీచేయటానికి టీడీపీ(TDP)కి అభ్యర్ధుల కొరత ఏర్పడింది. అప్పుడు కృష్ణయ్యతో చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) చర్చలు జరిపి పార్టీ కండువాకప్పారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పోటీచేయించారు. తెలుగుదేశంపార్టీ గెలిస్తే కృష్ణయ్యే ముఖ్యమంత్రని చంద్రబాబు బాగా ప్రచారంచేశారు. టీడీపీ గెలవకపోయినా ఎల్బీ నగర్ నుండి కృష్ణయ్య అయితే గెలిచారు. పార్టీలో చేరినపుడు, బీఫారం అందుకున్నపుడు టీడీపీ నేతగా ఉన్నారే కాని కృష్ణయ్య ఎప్పుడూ టీడీపీ సభ్యత్వం తీసుకోలేదు.
సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ అఖండ విజయం సాధించారు. వైసీపీ తరపున బీసీలకు జగన్ పదవుల్లో పెద్ద పీట వేశారు. ఇందులో భాగంగానే కృష్ణయ్యను ఏరికోరి జగన్ రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేశారు. వైసీపీ(YCP) తరపున రాజ్యసభ ఎంపీ అయినా కృష్ణయ్య పార్టీ సభ్యత్వం తీసుకోలేదు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత పరిణామాల్లో సెప్టెంబర్లో రాజ్యసభ(RajyaSabha) ఎంపీగా ర్యాగా రాజీనామా చేశారు. బీసీ హక్కుల పోరాటాలకు రాజ్యసభ ఎంపీ పదవి అడ్డంకిగా మారిందని రాజీనామా సమయంలో ప్రకటించారు. కొంతకాలం తర్వాత ఇపుడు సడెన్ గా ఏపీ కోటాలో బీజేపీ తరపున మళ్ళీ కృష్ణయ్య రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యారు. విచిత్రం ఏమిటంటే ఏపీలో బీసీ నేతలు ఎవరూ లేనట్లుగా తెలంగాణాలోని వికారాబాద్ జిల్లాకు చెందిన కృష్ణయ్యను ఏపీ కోటాలో రాజ్యసభ ఎంపీగా చేయటం. ఇపుడు కూడా బీజేపీ తరపున ఎంపీ అయిన కృష్ణయ్యకు పార్టీలో సభ్యత్వంలేదు. పార్టీలో సభ్యుడు కూడా కాని కృష్ణయ్యకు టీడీపీ, వైసీపీ, బీజేపీలు పిలిచి పదవులు అప్పగిస్తున్నాయంటే పదవులను ఆకర్షించే అయస్కాంతశక్తి ఏదో కృష్ణయ్యలో ఉందని అనుకోవాల్సిందే.
ఇదే విషయమై కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతు తనను పిలిచి పార్టీలు పదవులు ఇస్తున్నట్లు చెప్పారు. పదవులు ఇస్తామని పార్టీలే తన దగ్గరకు వస్తున్నట్లు చెప్పారు. పదవులు కావాలని తాను ఏ పార్టీనీ ఎప్పుడూ కోరలేదన్నారు. తనకు ఏ పార్టీలో కూడా సభ్యత్వం లేదన్న విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలని కృష్ణయ్య చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు-జగన్ మధ్య సంబంధాలు ఉప్పునిప్పు అని అందరికీ తెలిసిందే. అలాంటిది చంద్రబాబు ఆధరించి ఎంఎల్ఏని చేసిన కృష్ణయ్యను జగన్ కూడా పిలిచి రాజ్యసభ ఎంపీని చేశారు. 2024 ఎన్నికల్లో ఓటమితో వైసీపీని బీజేపీ పెద్దగా పట్టించుకోవటంలేదు. వివిధ కారణాలతో వైసీపీ రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేసిన కృష్ణయ్యను బీజేపీ పిలిచి మరీ రాజ్యసభ ఎంపీని చేయటం. మీడియాతో అన్నమాటలు విన్నతర్వాత కృష్ణయ్య పదవులను ఆకర్షించే అయస్కాతమే అనటంలో సందేహంలేదు.