KTR | ‘ఈ ప్రభుత్వానివన్నీ దిక్కుమాలిన నిర్ణయాలే..’

రాజధాని వాసులకు కరెంటు కోతలను మళ్ళీ పరిచయం చేసిన పాపం సీఎం రేవంత్‌దేనన్న కేటీఆర్.;

Update: 2025-08-05 07:38 GMT

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఉపయోగపడే ఒక్క నిర్ణయం కూడా తీసుకోకపోవడమే ఈ ప్రభుత్వం ఘనత అంటూ సెటైర్లు వేశారు. దిక్కుమాలిన నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్‌ను మించినవాళ్లు ఎవరూ లేరంటూ చురకలంటించారు. రైతులకు సాగునీరు, హైదరబాద్ ప్రజలకు తాగునీరు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో అమలవుతున్న ఉచిత తాగునీటి పథకానికి పాతరేయాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి పరాకాష్ట అని కేటీఆర్ దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని 1.20 కోట్ల మంది ప్రజలు ఎప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని క్షమించరని విమర్శించారు. ఇప్పటికే అనేక దిక్కుమాలిన నిర్ణయాలు తీసుకుని ప్రజల జీవనాన్ని కష్టంగా మార్చిన ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని అన్నారు. రేవంత్ సర్కార్ తీసుకున్న దిక్కుమాలిన నిర్ణయాల్లో హైడ్రా ఒకటని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడం తప్ప హైడ్రా చేసిందేమీ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకాన్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ మసే. అధికారంలోకి వచ్చి 20 నెలలు కావొస్తుంది. అయినా ఎన్నికలకు ముందు ఇచ్చిన 420 హామీలను అమలు చేయకపోగా.. చేతులెత్తేసి రేవంత్ రెడ్డి మహాపాపాన్ని మూటగట్టుకున్నారు. బీఆర్ఎస్ తెచ్చిన పథకాలకు కూడా ఉరివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే చేస్తే నగర ప్రజలు మిమ్మల్ని ఎన్నటికీ క్షమించరు. బీఆర్ఎస్ హయాంలో రెప్పపాటు కూడా కరెంట్ కోతలు లేవు. అలాంటిది హైదరాబాద్ వాసులకు మళ్ళీ కరెంటు కోతలను పరిచయం చేసిన పాపం రేవంత్‌దే. ఒకవైపు కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు మరోవైపు అస్తవ్యస్థమైన డ్రైనేజీ వ్యవస్థతో అవస్థలు పడుతునస్నారు. ప్రయాణించడానికి సరైన రోడ్లు కూడా లేక అల్లాడుతున్నారు. ఇప్పుడు ఫ్రీ డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌కు గండికొట్టి ప్రజల గొంతులను ఎండగట్టాలని రేవంత్ పన్నాగం పన్నుతున్నారు. రేవంత్‌కు కర్రుగాల్చి పెట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News