KTR and ACB| కేటీఆర్ వ్యూహం సక్సెస్ అయ్యిందా ?

లాయర్లను కూడా తనతో విచారణకు అనుమతిస్తేనే తాను ఆఫీసులోకి వస్తానని లేకపోతే విచారణకు హాజరుకానని చెప్పేశారు.;

Update: 2025-01-06 06:03 GMT
KTR before ACB office

ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ఆఫీసు దగ్గర పెద్ద సీన్ క్రియేట్ చేశారు. తాను విచారణకు హాజరైనట్లుండాలి. ఇదేసమయంలో విచారణ జరగకూడదు. ఎలాగన్న విషయంలో కేటీఆర్ వేసిన ప్లాన్ పక్కాగా వర్కవుటైనట్లే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే కారు రేసు అవినీతిలో 6వ తేదీన విచారణకు రావాలని ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. 7వ తేదీన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు రావాలని నోటీసులు జారీచేసింది. 7వ తేదీ విచారణకు హాజరవుతారా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతుండగానే సడెన్ గా ఏసీబీ నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరవుతారా లేదా అన్నఅనుమానాలు పెరిగిపోతున్న నేపధ్యంలో సోమవారం ఉదయం 10.15 గంటలకు విచారణకు హాజరయ్యారు. అయితే ఇక్కడే కేటీఆర్ ఒక మెలిక పెట్టారు. అదేమిటంటే విచారణకు తనతో పాటు తన లాయర్లు కూడా హాజరవుతారని.

ముగ్గురు లాయర్లతో కలిసి కేటీఆర్ ఏసీబీ కార్యాలయంలో(ACB Office) విచారణకు హాజరయ్యారు. అయితే కార్యాలయం బయటే కారును నిలిపేసిన పోలీసులు కేటీఆర్ ను మాత్రమే ఆఫీసులోకి రావాలని చెప్పారు. విచారణకు లాయర్లను అనుమతించేదిలేదని పోలీసులు స్పష్టంచేశారు. అయితే కేటీఆర్(KTR) అందుకు అంగీకరించలేదు. విచారణకు లాయర్లను అనుమతించేదిలేదని, ఒక్కరు మాత్రమే రావాలని పోలీసులు కూడా పట్టుబట్టారు. దాంతో ఏసీబీ ఆఫీసు ముందు రోడ్డుమీదే పోలీసుల వైఖరికి నిరసనగా కేటీఆర్ కారులోనే కూర్చున్నారు. లాయర్లను కూడా తనతో విచారణకు అనుమతిస్తేనే తాను ఆఫీసులోకి వస్తానని లేకపోతే విచారణకు హాజరుకానని చెప్పేశారు. కేటీఆర్ డిమాండును పోలీసులు అంగీకరించకపోవటంతో ఆఫీసు ముందే అర్ధగంటసేపు వెయిట్ చేసిన కేటీఆర్ చివరకు 10.50 గంటలకు ఏసీబీ ఆఫీసునుండి వెళ్ళిపోయారు.

కేటీఆర్ డిమాండ్ ఏమిటి ?

విచారణ సందర్భంగా తాను చెప్పనివిషయాలను చెప్పినట్లుగా ఏసీబీ అధికారులు కన్ఫెషన్ స్టేట్మెంట్ తయారుచేసుకుంటారని ఆరోపించారు. అనని మాటలను అన్నట్లుగా, చెప్పని మాటలను చెప్పినట్లుగా పోలీసులు తప్పుడు కన్ఫెషన్ ప్రకటనలు వాళ్ళే తయారుచేసుకుని కోర్టులో సబ్మిట్ చేసుకుంటారని కేటీఆర్ ఆరోపించారు. లగచర్లలో కలెక్టర్ మీద గ్రామస్తుల దాడికి సంబంధించి మాజీ ఎంఎల్ఏ పట్నంనరేందర్ రెడ్డి విషయంలో పోలీసులు ఏమిచేశారో అందరూ చూసిందే అన్నారు. పట్నం చెప్పని మాటలను చెప్పినట్లుగా కలెక్టర్ మీద దాడికి తానే కుట్రచేశానని పోలీసులు కన్పెషన్ ప్రకటన దాఖలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తర్వాత ఈ విషయం తెలిసిన పట్నం తానసలు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వనేలేదని ప్రకటించినట్లు కేటీఆర్ చెప్పారు.

పట్నం నరేందర్ రెడ్డి విషయంలో పోలీసులు ఊహాజనితమైన కన్ఫెషన్ స్టేట్మెంట్లు సొంతంగా తయారుచేసుకున్నట్లుగానే తనవిషయంలో కూడా తప్పుడు స్టేట్మెంట్ రెడీచేసే అవకాశాలున్నాయని ఆరోపించారు. పోలీసుల మీద తనకు నమ్మకంలేదన్నారు. చట్టంమీద గౌరవంతోనే తాను ఏసీబీ విచారణకు హాజరయ్యానని చెప్పిన కేటీఆర్ విచారణలో తనతో పాటు తన లాయర్లను కూడా అనుమతించాల్సిందే అని పట్టుబట్టారు. అయితే అందుకుపోలీసులు అనుమతించకపోవటంతో అర్ధగంటసేపు వెయిట్ చేసిన కేటీఆర్ అక్కడినుండి బీఆర్ఎస్ ఆపీసుకు వెళ్ళిపోయారు. తాను విచారణకు హాజరవ్వగానే తన ఇంటిపైన ఏసీబీ వాళ్ళు దాడులుచేస్తారనే సమాచారం కూడా ఉందన్నారు. విచారణకు లాయర్లను కూడా తీసుకొస్తే పోలీసులు అంగీకరించరని కేటీఆర్ కు బాగా తెలుసు. అందుకనే లాయర్ల విషయాన్ని అడ్డంపెట్టుకుని విచారణకు హాజరుకాకుండా ఎగ్గొట్టవచ్చన్న కేటీఆర్ వ్యూహం పర్ఫెక్టుగా సక్సెస్ అయ్యింది.

చెరో వాదన వినిపిస్తున్నారా ?

కేటీఆర్ వినిపించిన వాదనకు పోలీసులు పూర్తి విరుద్ధంగా ఉంది. తనతో పాటు విచారణకు లాయర్లను కూడా అనుమతించటంలో తప్పేమిటని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. విచారణలో తన లాయర్లను ఉంచుకునేందుకు తనకు అన్నీ హక్కులున్నాయని కూడా వాదిస్తున్నారు. అయితే విచారణకు ఒక్కడినే రావాలని నోటీసులో ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఫార్ములా కార్ రేసు(Formula E Car Race) అవినీతి కేసులో కేటీఆర్ ను విచారించుకోవచ్చని చెప్పిన కోర్టు లాయర్ల సమక్షంలోనే విచారించాలని ఆదేశించలేదని గుర్తుచేస్తున్నారు. కేటీఆర్ కావాలనే ఇష్యూచేయాలన్న ఉద్దేశ్యంతోనే ఇంత రాద్దాంతం చేసినట్లు పోలీసులు అంటున్నారు. మరో నోటీసిచ్చి విచారణకు పిలిపించేందుకు ఏసీబీ మళ్ళీ రెడీ అవుతున్నది. మరీసారి ఏమిచేస్తారో చూడాల్సిందే.

Tags:    

Similar News