‘సుదర్శన్ రెడ్డిని వ్యతిరేకిస్తాం’

ఎన్నికలు వస్తే రేవంత్‌కు బీసీలు కనిపించరా అని ప్రశ్నించిన కేటీఆర్.;

Update: 2025-08-20 10:36 GMT

ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక అంశంలో జరుగుతున్నదంతా ఒక డ్రామా అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్, కాంగ్రెస్ కలిసి చిల్లర గేమ్స్ ఆడుతున్నారని ఆరోపించారు. బీసీలపై ప్రేమ ఉందని చెప్తున్న కాంగ్రెస్.. బీసీ అభ్యర్థిని ఎందుకు సిఫార్సు చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులు, బీసీల విషయంలో కాంగ్రెస్‌కు, రేవంత్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. రైతులను ఎరువుల కోసం బాధపెడుతున్నారని, బీసీలకు పరచేతిలో వైకుంఠ చూపుతూ ఎన్నికలు రాగానే మరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లే ఆనాటి రోజులను రాష్ట్రంలో తిరిగి తీసుకొచ్చిందంటూ మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఈ సర్కార్ చేతకాని తనం వల్ల రైతులు నానా అవస్థలు పడుతున్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది దున్నపోతుపై వానపడినట్లే అన్నట్లు ఉంటుందని చురకలంటించారు. కేసీఆర్ పాలించిన పది సంవత్సరాల్లో ఏనాడూ కూడా యూరియా కోసం రైతులు క్యూలు కట్టింది లేదని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు రోజుల తరబడి లైన్లలో నిల్చున్నా బస్తా యూరియా లభించే పరిస్థితులు కనిపించడం లేదని ఆరోపించారు కేటీఆర్. రావాల్సిన యూరియా తెచ్చుకోవడం తర్వాత.. వచ్చిన యూరియాను కూడా పంచే పరిస్థితులు రాష్ట్రంలో లేవన్నారు. సీఎం కానీ, మంత్రులు కానీ రైతుల దగ్గరకు పోతే వాళ్ల పరిస్థితి ఏంటో తెలుస్తదని అన్నారు.

‘‘ఆలనాడు రైతులు నీళ్ల కోసం బావుల దగ్గర పడుకునేటోళ్లు. అలాంటిది ఇప్పుడు ఎరువుల కోసం ఎరువు పంపిణీ దగ్గర రైతులు రాత్రిళ్లు నిద్రలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల ముందు ప్రజలకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం.. అలనాటి కరువు పరిస్థితులను తీసుకురావడంలో మాత్రం సక్సెస్ అయింది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉపరాష్ట్రపతి సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వంపై ఆయన స్పందించారు. ఆ విషయంలో తమను ఏ పార్టీ సంప్రదించలేదు. సెంప్టెంబర్ 9లోపు రాష్ట్రానికి రెండు లక్షల టన్నుల ఎరువులను ఏ పార్టీ తెలంగాణకు తెచ్చి పెడుతుందో ఆ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మేము సానుకూలంగా స్పందిస్తాం’’ అని కేటీఆర్ చెప్పారు.

సుదర్శన్ రెడ్డిని కచ్ఛితంగా వ్యతిరేకిస్తాం: కేటీఆర్

అంతేకాకుండా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిఫార్సు చేయడానికి రేవంత్ రెడ్డికి ఏ బీసీ నాయకుడు కనిపించలేదా అని కూడా ఆయన ప్రశ్నించారు. ‘‘సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి పెట్టిన అభ్యర్థి అయితే కచ్ఛితంగా ఆయనను మేము వ్యతిరేకిస్తాం. కాంగ్రెస్ అనేది ఒక చిల్లర పార్టీ. ఇవాళ రాష్ట్ర ప్రజలను ఎంత ఇబ్బంది పెడుతుందో అందరికీ తెలుసు. అలాంటి థర్డ్ క్లాస్ పార్టీ, థర్డ్ క్లాస్ సీఎం పెట్టిన అభ్యర్థిని మేము ఎందుకు సమర్థిస్తాం. ఇదంతా కూడా ఒక డ్రామా. ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికపై జరుగుతున్నదంతా ఒక డ్రామా. బీసీల విషయంలో మా పార్టీ చిత్తశుద్ధితో ఉందని రేవంత్ చెప్పడమే తప్ప.. ఆ చిత్తశుద్ధి ఆయనకు లేదు. నిజంగానే ఆయనకు అంత చిత్తశుద్ధి ఉంటే ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు ఆయన సిఫార్సు చేయలేదు? తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదా? కంచె ఐలయ్యను పెట్టొచ్చు కదా? అంటే బీసీలపై ప్రేమ మాటలకే పరిమితం. ఎన్నికలు వస్తే మీకు మళ్ళీ బీసీలు కనిపించరు. అలాంటి మీ మాటలు మేము నమ్మాలా?’’ అని విమర్శలు గుప్పించారు.

Tags:    

Similar News